అసలు ఆత్రేయ పాట లేని
తెలుగు సినిమా
అన్నీ ఉన్నా అంగట్లో “శని”మా
ఆ కలం శక్తిసంపన్నం
ఆయన పాటలతో
సినిమా సుసంపన్నం..!
నీ భాషలో..నా భాషలో
మన మనసు ఘోషలో
పాట రాస్తే అది ఆత్రేయ
ఆయన చెయ్యి
పాటల అక్షర పాత్రేయ..!
భాషను మించి భావం..
ఆత్రేయకేనేమో సంభవం..
నువ్వు నేను
అనుకునే మాటలే
పాటలైతే ఆ పాటవం
ఆత్రేయ కలానిదే..
తెలుగు సినిమా పాటలో
మూగమనసు..
మంచి మనసు
ఆ మనసు సొగసు
అదంతా ఆత్రేయకే తెలుసు
ఆ కవికి మనసంటే
ఎంత అలుసు..
అప్పుడప్పుడు ఆయన దృష్టిలో విరిగిన ఇరుసు..
ఇంకోసారి గొప్ప మజా ఇచ్చే చేపల పులుసు..!
నీ పాటే కాదు కోడెనాగునే
అదుపు చేసిన
నీ మాటా సూపరే..!
మనసు గతి ఇంతే..
మనిషి బ్రతుకింతే..
మనసున్న మనిషికీ
సుఖములేదంతే..
ఏమయ్యా ఆత్రేయా..
రాసి జనాల్ని
రాయక నిర్మాతల్ని ఏడిపించావు కదయ్యా..
నీ రచన..
మహదేవుడి స్వరకల్పన..
ఘంటసాల వచన.…
నీ మాటలే ఆత్రేయ పాటలు..!
నిజానికి మనిషిలో
ఉనికే లేని
అవయవం మనసు..
పైగా దానికి గాయాలు..
వాటిపై ఎన్నో గేయాలు..
అలాంటి పాటలు రాయడంలో నిష్ణాతుడా
ఈ ఆత్రేయ..
మనసు పెట్టి..
మనసు కరిగేలా..
మనసు మీద సొగసుగా
పాటలల్లిన మనసు కవి..!
వినడానికి
సులభమనిపించే పాటలు..
వేనవేల భావాల మూటలు..
గుండెను పిండేస్తూ..
వింటుంటే
మనసు లోతు పొరల్లో
తెలియని కదలిక..
నీ పాట..నా పాటే
అనిపించేలా..
అప్పటికే బాధ..
అంతలోనే ఊరట..
ఆత్రేయ పాట..!
నిదర పట్టని ఓ రాత్రి..
రేడియోలో హాయిగా పలికే
మూగమనసులు..
ఆ పాటల్లో ఎన్నెన్ని ఊసులు…
మంద్రంగా ఘంటసాల గొంతు
సంద్రంలా భావాల హోరు..
పాటలోనే అగాథాల లోతులు..
మరచిపోలేని
ఎన్నో స్మృతులు..
మధురానుభూతులు..
నీ మనసులోని భావాలే..
నువ్వు నీలో అనుకుంటావు
ఆయన నీలో దూరిపోయి రాసేస్తాడు..
నీ భావాన్ని నీకంటే బాగా..
నువ్వే రాసినట్టుగా..
నువ్వే పాడుకుంటున్నట్టుగా!
కలలె మనకు మిగిలిపోవు
కలిమి చివరకు..
ఆ కలిమి కూడ దోచుకునే
దొరలు ఎందుకు..
దొరలంటే నిద్ర కూడా పట్టకుండా చేసే
దుర్మార్గులని..
ఇలా రాసే ఆత్రేయ
శైలే వేరని..!
పుట్టినరోజు మీద పాటా..
అందుకోసం నాకింత పాటా..
అని కొట్టిపారేసాడు కిలంబి
ఊరుకుంటాడా ఆత్రేయ..
Drive the devil out అని
ఇంగ్లీషు కూడా కలిపికొట్టి
మనిషి పుట్టకలోని
అర్థాన్ని..యధార్ధాన్ని..
అంతరార్ధాన్ని..పరమార్ధాన్ని
కాచి వడబోసి రాస్తే…
నేను పుట్టాను..
లోకం మెచ్చింది..
నేను ఏడ్చాను..
లోకం నవ్వింది..
నేను నవ్వాను..
ఈ లోకం ఏడ్చింది..
నాకింకా లోకంతో
పని ఏముంది..!
ఇది సినిమా పాటా..
జీవిత సత్యమా..
ఇలా రాయడం
ఆత్రేయకు నిత్యకృత్యమా..
వేరొకరికి సాధ్యమా..!
మనసున్న మనిషికీ
సుఖము లేదంతే..
తేల్చి చెప్పిన ఆత్రేయ..
ప్రేమించిన మనసు చెడి
బాధ పడితే పడ్డాడేమో గాని
బద్దలైంది పాటల గని..
మురిసిపోయింది అవని..!
ఎన్ని పాటలు రాసినా
తీరని దాహం..
ప్రేమపై ఆత్రేయ వ్యామోహం..
మనసుపై ఆయన మోహం..
నీ జ్ఞాపకాల నీడలలో
ఆత్రేయనెపుడూ చూస్తావు…
ఆయన నివురైపోయినా
ఎప్పటికీ ఆవిరైపోని గీతాలు
లేని మనసు ఉన్నంతకాలం
నిలిచి ఉండే
ఆత్రేయ పాటలు..
తెలుగు సినిమా మరచిపోలేని
అద్భుతమైన
చరిత్ర పుటలు..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286