Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై కక్ష సాధింపు దుర్మార్గం

-జగన్ రెడ్డి నడుపుతోంది ప్రభుత్వమా లేక ప్రైవేటు సైన్యమా?
– తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానని మాయ మాటలు
-అంగన్వాడీల న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చాలి
– బోండా ఉమా మహేశ్వరరావు, పంచుమర్తి అనురాధ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత

ఎన్నికల ముందు అంగన్వాడీలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి మోసం చేశారని టీడీపీ మహిళా నేతలు అన్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న అంగన్వాడీల నిరసనలలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా పార్లమెంట్ కమిటీ సభ్యులు పాల్గొని సంఘీభావం తెలిపారు

. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ…..న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై కక్ష గట్టి ఉక్కుపాదం మోపడం జగన్ రెడ్డి నిరంకుశ, పెట్టుబడిదారీ విధానాలకు నిదర్శనం. అంగన్వాడీలు చేసిన తప్పేంటి? జగన్ రెడ్డికి అంగన్వాడీలపై లాఠీచార్జ్ లు, అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంగన్వాడీ సెంటర్లు బద్దలు కొట్టే అధికారం జగన్ రెడ్డికి ఎవరిచ్చారు? జగన్ రెడ్డి నడుపుతోంది ప్రభుత్వమా లేక ప్రైవేటు సైన్యమా? తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానని మాయ మాటలు చెప్పి తీరా అధికారంలోకి రాగానే మాట తప్పిన జగన్ రెడ్డిని అంగన్వాడీలు ప్రశ్నించడం తప్పెలా అవుతుంది?

అంగన్వాడీలకు జీతాల పెంచిన ఘనత చంద్రన్నదే
తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ చంద్రబాబు అంగన్వాడీలకు జీతాలు పెంచి సంక్షేమం అందించారు. 2014 నాటికి అంగన్వాడీల జీతం రూ. 4,200లు కాగా రూ. 10,500కు పెంచారు. అంటే ఏకంగా రూ. 6,300 పెంచి వారికి ఆర్థిక చేయూత అందించారు. చంద్రబాబు కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ జగన్ రెడ్డి అంగన్వాడీలను మోసం చేశాడు. కేవలం రూ. 1000 పెంచి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణలో అంగన్వాడీల జీతం రూ. 13,650 కాగా ఏపీలో రూ. 11,500లు. పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతం పెంచకపోగా ఆదాయ పరిమితి అస్త్రంతో అంగన్వాడీలకు సంక్షేమంలోనూ కోత పెట్టాడు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలు సంక్షేమానికి పూర్తిగా దూరమయ్యారు.

ఆదాయ పరిమితి నిబంధనతో సంక్షేమ పథకాల్లో కోత పెట్టాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆదాయ పరిమితి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించి సంక్షేమం అమలు చేయగా జగన్ రెడ్డి రూ.10 వేల లోపు ఆదాయం ఉన్న వారికే సంక్షేమ పథకాలు అమలు నిబంధనతో వారిని ఇబ్బందుల్లోకి నెట్టాడు. నవరత్నాల అమలుకు రూపొందించిన నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించరాదు.

ఈ నిబంధన వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 51,299 మంది అంగన్వాడీలు పథకాల ఆర్థిక సాయం కోల్పోతున్నారు. అలాగే పించను, అమ్మఒడి సాయం, ఇళ్ల పట్టాలు,నిర్మాణ రాయితీలు అందడంలేదు. జగన్ రెడ్డి అంగన్వాడీల న్యాయబద్దమైన డిమాండ్లు పరిష్కరించాలని టీడీపీ నేతలు అన్నారు.

LEAVE A RESPONSE