Suryaa.co.in

Features

అత్యాచార భారతం.. బెయిల్ బాగోతం..

– వద్దంటే వద్దు..!

విశాఖలో లా కళాశాల విద్యార్థిని గ్యాంగ్ రేపు కేసులో మొన్న నవంబర్ 18 న అరెస్టయిన నలుగురు నిందితులకు బెయిల్ ఇప్పించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రాకూడదని విశాఖ బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ నిర్ణయం..

ఇలాంటి కేసులలో ఇది ఒక మంచి ఆరంభం కావాలని..ఈ తరహా నేరాలు ఎక్కడ ఎప్పుడు జరిగినా బెయిల్ ఇప్పించడం. నిందితుల తరపున కేసులు వాదించడం తదితర కార్యక్రమాలకు లాయర్లు దూరంగా ఉంటే బాధితులకు ఖచ్చితంగా సత్వర న్యాయం లభించడమే గాక ఇలాంటి అకృత్యాలకు తెగబడ్డానికి జనం భయపడే పరిస్థితులు ఏర్పడి ఈ తరహా నేరాల సంఖ్య కొంతైనా తగ్గు ముఖం పడుతుందనడంలో సందేహం అవసరం లేదు. నిందితులకు ఈ నిర్ణయం చెంపపెట్టు కావాలి..

ఇక్కడొక మాట..విన్నపం కూడా..విశాఖ ఉదంతంలో బాధితురాలు లా విద్యార్థి గనక న్యాయవాదులు సంఘీభావంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చు..ఇంతకంటే ఘోరమైన నేరాలు..ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దేశంలో ఎక్కడా కూడా నిందితుల తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయరాదని..కేసు వాదించకూడదని న్యాయవాదులు నిర్ణయం తీసుకోవడం జరగడం లేదు.వ్యక్తిగతంగా నిబద్ధత ఉన్న లాయర్లు..లేదా కేసులో నిందితులను బయట పడేసే అవకాశం లేక న్యాయవాదులు దూరంగా ఉంటున్నారు.

మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఎలాంటి నేరం చేసినా మొదట దొరక్కుండా తప్పించుకోవచ్చు.. దొరికి అరెస్టు అయినా బెయిల్ తెచ్చుకుని మళ్ళీ కేసు ముగిసే వరకు యధేచ్చగా బయట తిరగవచ్చు..ఆ క్రమంలో బాధితుల కుటుంబాలను బెదరించడమో .. డబ్బులు ఇచ్చి లొంగదీసుకుని కేసు ఉపసంహరించుకునేలా చేసుకోవడం ఈ పరిపాటైపోయింది.

ఇలా బెయిల్ పిటిషన్ వేయకూడదని లాయర్లు నిర్ణయించడం ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో జరిగినా అది ఇంతవరకు ఒక సంప్రదాయం..లేదంటే ఖచ్చితమైన నియమనిబంధనగా మారింది లేదు.ఇప్పుడు విశాఖలో ఈ తరహా నిర్ణయం ఏకగ్రీవంగా జరిగి నిర్ద్వంద్వంగా అమలవుతున్న నేపథ్యంలో ఇదే స్ఫూర్తి దేశం మొత్తానికి అంది అన్ని చోట్ల ఇలాంటి సంప్రదాయం అమల్లోకి వస్తే అది స్వతంత్ర భారతంలోనే అత్యంత చారిత్రక నిర్ణయంగా..
పరిగణించవచ్చు..!

అలా జరిగేనా..ఇది సాధ్యమేనా?

అత్యాచారం..మానభంగం అనే కాదు ఎంతటి తీవ్రమైన నేరాల విషయంలోనైనా పాలీసులు అరెస్టు చేసిన తర్వాత క్షణాల మీద లాయర్లు రంగంలోకి దిగి నిందితులను బెయిల్ పై బయటకు తీసుకురావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో టెర్రరిస్టు కేసులు కూడా మినహాయింపు కాదు.సరే..ఇదంతా న్యాయవాదుల వృత్తిపరమైన అంశంగా భావిస్తూ మరీ లోతుకు వెళ్లకుండా వారి విచక్షణకే విడిచిపెడదాం. ఇప్పుడు అంశం అత్యాచార కేసుల్లో నిందితులకు బెయిల్ ఇప్పించడం..

నిర్భయ.. దిశ వంటి తీవ్రమైన కేసులు ..సంచలన ఉదంతాల్లో కూడా అత్యంత పేరు ప్రతిష్టలు కలిగిన లాయర్లు రంగంలోకి దిగి నిందితులకు బెయిల్ ఇప్పించడమే గాక వారిని కేసుల నుంచి విముక్తి చెయ్యడం కోసం తమ శక్తి యుక్తుల్ని ఉపయోగించి వాదించటం మనం చూస్తూనే ఉన్నాం.కొన్ని సందర్భాల్లో అదే న్యాయవాదులు గెలుస్తున్నారు కూడా.. ఇలాంటి కేసుల్లో ఎలా గెలుస్తున్నారు.. లోపల ఏం జరుగుతోంది అన్న మూలాల్లోకి ఇప్పుడైతే వెళ్ళబోవడం లేదు.

ఇలా జరుగుతూ ఉంటే బాధితులకు న్యాయం జరిగేదెలా .. నేరాలు ఆగేది ఎలా.. ఈ వేద భూమిలో ఆడకూతుర్లకి రక్షణ ఎక్కడ? ధైర్యంగా తిరిగే ఆరోజు వచ్చేది ఎప్పుడు? ఒక్క న్యాయవాదులనే కాదు.. న్యాయమూర్తులు.. న్యాయనిపుణులు.. ప్రభుత్వాలోని పెద్దలు.. చట్ట సభలు..మొత్తం జాతి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది..

లేదంటే 2021 నాటికే ..గంటకు 96 రేప్ కేసులు..49 ఇతర నేరాలు మహిళల పట్ల జరుగుతున్న ఈ వేదభూమిలో వర్తమానం ఇంకెంత దుర్భరంగా మారి ఉందో.. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఊహించడానికే భయం వేస్తోంది.. ఇది చాలదన్నట్టు ఇటీవలి కాలంలో ప్రపంచమే తెలియని చిన్నారులపై కూడా అకృత్యాలు పెరిగిపోతూ ఉండడం మరీ పెరిగిపోతున్న విపరీత ధోరణి.

ఇదే పైశాచికం కొనసాగితే బాపూజీ అప్పుడెప్పుడో చెప్పినట్టు అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరగడం మాట అటుంచితే, పట్టపగలు కూడా రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉండదు. అంతే కాదు.. పిల్లలు..వృద్ధ మహిళలకు సైతం రక్షణ ఉండని దారుణమైన రోజులను భావి తరాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
తస్మాత్ జాగ్రత్త..!.
(న్యాయవాదులకు క్షమాపణలు.. ఆవేదనతో)

– సురేష్
జర్నలిస్ట్
9948546286

LEAVE A RESPONSE