– మోదీ అండతో అదానితో అవినీతి ఒప్పందాలు చేసుకున్న వైసీపీ ప్రభుత్వం పై విచారణ చేయాలి
– అదానీ ఒప్పందాలను, స్మార్ట్ మీటర్లను, భూముల కేటాయింపులను రద్దుచేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి
– అదానీ అరెస్టు, ఒప్పందాల రద్దు, స్మార్ట్ మీటర్ల నిలిపివేత కోరుతూ విజయవాడలో సిపిఎం నిరసన, ధర్నా
– ధర్నాలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు
విజయవాడ: కుంభకోణాల అడానిని వెంటనే అరెస్టు చేయాలని, అదానీ అవినీతికి, మోడీ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి ఒప్పందాలు చేసుకున్న వైసిపి ప్రభుత్వం పై విచారణ చేసి, న్యాయ విచారణ జరిపి శిక్షించాలని, స్మార్ట్ మీటర్లను తక్షణమే ఆపాలని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదానీ ఒప్పందాలను రద్దుచేసి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని కోరుతూ నేడు విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్ లో ఆందోళన నిర్వహించారు. ధర్నా జరిగింది అదానీ చిత్రపటాన్ని కటకటాలతో ఉంచి, సంకెళ్ళను వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్లే కార్డులు ప్రదర్శించారు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బాబురావు, డి కాశీనాథ్ మాట్లాడుతూ…అదానీ అవినీతి మరోసారి బట్టబయలైంది, అంతర్జాతీయ స్థాయిలో కుంభకోణాలు రుజువయ్యాయి, అరెస్టు వారెంట్లు విడుదలయ్యాయి. మోడీ బిజెపి ప్రభుత్వ అండతో అదానీ. దేశాన్ని కొల్లగొట్టారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్, సిమెంట్ తదితర అనేక రంగాలను కబళించారు, సహజ సంపదను దోచేశారు. భూములు, బొగ్గు, సూర్య రశ్మీ నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు.. ఇలా సహజ సంపదను దోచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మోడీ ఆదేశాలకు లొంగి 7వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని వైసీపీ, జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నది. 1750 కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలతో రుజువయ్యింది. ఈ ఒప్పందం వలన 25 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారం పడ బోతున్నది ,రాష్ట్రానికి నష్టం జరుగుతున్నది. ఈ పాపానికి మోడీ ,జగన్ ప్రభుత్వాలు బాధ్యత వహించాలి, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి, బాధ్యులైన వారిని శిక్షించాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా మోడీ జగన్ ప్రభుత్వాలు కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలను కొనసాగించడం శోచనీయం. పైపెచ్చు అదానీ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టును కొనసాగిస్తూ స్మార్ట్ మీటర్లను శరవేగంగా కూటమి ప్రభుత్వం బిగిస్తూ ఉండటం సిగ్గుచేటు. డేటా సెంటర్, విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాలను కూటమి ప్రభుత్వం కట్టబెడుతున్నది. కూటమి ప్రభుత్వం అదానీ తో గ్రీన్ ఎనర్జీ పేరుతో ఒప్పందాలను కొనసాగిస్తున్నారు జగన్ ప్రభుత్వ అవినీతి ఒప్పందాలను కూటమి ప్రభుత్వం కొనసాగించడం సిగ్గుచేటు.
అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా ఒప్పందాల రద్దు పై ప్రకటన చేయాల్సిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోరుమెదపక పోవటం అనుమానాలకు ఆస్కారం కలిగిస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, స్మార్ట్ మీటర్లు ఆపాలి, విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి. భూముల కేటాయింపులు నిలిపివేయాలి, ఆడానిని బ్లాక్ లిస్టులో పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం, మోడీ ,అదానీ తో కుమ్మక్కైన బండారం బట్టబయలైంది, అవినీతిపరులకు కొమ్ము కాస్తున్న బిజెపి నిజస్వరూపం మరోసారి రుజువయ్యింది.
బిజెపితో జతకట్టి తెలుగుదేశం ,జనసేన.. మోడీ, అదాని అవినీతిపై నోరు మెదపలేకపోతున్నాయి, అడ్డగోలు ఒప్పందాలను కొనసాగిస్తున్నాయి. సిపిఎం తొలి నుండి సోలార్ విద్యుత్ ఒప్పందాల బండారాన్ని పలుసార్లు నియంత్రణ మండలి ముందు లేవనెత్తింది, వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు ఒప్పందాలపై నిలదీసింది, పోరాడింది. ఈనాడు అదానీ, జగన్, మోడీ బండారాలు బట్టబయలు అయ్యాయి.అవినీతి అదాని స్మార్ట్ మీటర్లను ప్రతి ఇంటిలో, సంస్థలలో ప్రజలే అడ్డుకోవాలి.
ఆదాని వంటి కంపెనీలతో గత ప్రభుత్వ అడ్డగోలు, అవినీతి ఒప్పందాల పేరుతో డిసెంబర్ నుండి విద్యుత్ ట్రూ అప్ చార్జీలను కూటమి ప్రభుత్వం పెంచుతున్నది, 6072 కోట్ల రూపాయల భారం, తదుపరి మరో 11862 కోట్ల రూపాయల భారం మోపటానికి రంగం సిద్ధం చేశారు. తక్షణమే ఈ భారాలు ఆపాలి. తమ చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలి. స్మార్ట్ మీటర్లను అడ్డుకొని, విద్యుత్ ఛార్జీల పెంపుదలను తిరస్కరించి ప్రజలు.. మోడీ – అదానీ – జగన్ – చంద్రబాబు ప్రభుత్వాలు కుమ్మక్కైన తీరును ఎదుర్కోవాలి. ఈ ఆందోళనలో సిపిఎం నేతలు బోయి సత్యబాబు, బి. రమణ రావు, .దుర్గారావు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.