Suryaa.co.in

International

పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

సోషల్ మీడియా పిల్లలను తప్పుడు దోవ పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలన్న నిర్ణయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం ప్రకటించారు.

సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి కనీస వయస్సును నిర్దేశించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ సమాచారాన్ని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.

“సోషల్ మీడియా సామాజిక హాని కలిగిస్తోందని మాకు తెలుసు. ఇది పిల్లలను నిజమైన స్నేహితులు, నిజమైన అనుభవాల నుండి దూరం చేస్తోంది,” అని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పేర్కొన్నారు. రాష్ట్రాల‌తో చర్చ‌ల అనంత‌రం ఈ చట్టంపై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ఆయన వెల్లడించారు.

పిల్లలకు సోషల్ మీడియా వినియోగానికి కనీస వయస్సు 16 ఏళ్లు నిర్దేశించడమే తన అభిమతమని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.

ఇక ఆగస్టులో ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ABC) నిర్వహించిన సర్వే ప్రకారం, 61 శాతం మంది ఆస్ట్రేలియన్లు 17 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను పరిమితం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడైంది.

అదే సమయంలో, దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ పీటర్ మలినాస్కాస్ 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను సోషల్ మీడియా నుంచి నిషేధించడానికి చట్టపరమైన మార్గాల కోసం మాజీ ఫెడరల్ జడ్జి రాబర్ట్ ఫ్రెంచ్‌ను నియమించారు.

రాబర్ట్ ఫ్రెంచ్ సమీక్షను ఫెడరల్ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటుందని, ఈ చట్టంతో పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై గట్టి నియంత్రణలు అమలు చేయాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE