Suryaa.co.in

Entertainment

మూడు షెడ్యూల్స్ లో ఆటో రజిని సినిమా చిత్రీకరణ

– కెమెరా స్విచ్ ఆన్ చేసిన మంత్రి కొడాలి నాని
– తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న చిత్రం
హైదరాబాద్, అక్టోబర్ 6: తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఆటో రజిని సినిమా చిత్రీకరణ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్ జరగనుంది. శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీమహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో సావిత్రి. జే నిర్మిస్తున్న ఆటో రజిని చిత్రానికి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ, రాజకీయ అతిరథుల సమక్షంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ముహూర్తపు సన్నివేశానికి జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తాలపై క్లాప్ కొట్టారు. రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మధుసూదనరెడ్డి, సిద్ధారెడ్డి, గౌతమ్ రెడ్డి తదితరులు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ మూవీస్ ఆధ్వర్యంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో జొన్నలగడ్డ సావిత్రి నిర్మాణంలో వారి తనయుడు హరికృష్ణ హీరోగా మొదలైన ఆటో రజిని సినిమా మంచి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కాగా ఈ సినిమా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ నెల 15 వ తేదీ నుండి విజయవాడలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరగనుంది. వచ్చే నవంబర్ నెల్లో వైజాగ్లో, ఆ తర్వాత హైదరాబాద్లో షెడ్యూల్స్ను పూర్తి చేయనున్నారు. ఆటో డ్రైవర్ అయిన ఓ రజనీకాంత్ అభిమాని ఏం చేశాడనే కథతో సినిమా తీస్తున్నామని, ఈ నెల 15 న చిత్రీకరణ ప్రారంభించి వచ్చే నెలాఖరుకు పూర్తి చేస్తామని చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ చెప్పారు.

LEAVE A RESPONSE