అయోధ్య శ్రీరాముడి అక్షింతలు అద్భుతం. అక్షింతలు పంపిణీ కార్యక్రమం ఓ విప్లవం. క్షతం కానివి అంటే నాశనం కానివి అక్షింతలు అని అందరికీ తెలుసు. అక్షింతలు శుభానికి సూచికలు. హిందువులందరినీ ఏకం చేసిన రాముల వారి అక్షింతల గురించి తలుచుకుంటేనే మదిలో తెలియని గర్వం కలుగుతుంది.
అయోధ్య శ్రీ రామచంద్రుడి భవ్య దివ్య నవ్య రామమందిర నిర్మాణంలో ప్రతి పౌరుడుని పాల్గొనేలా చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టి అద్భుత విజయం సాధించింది. ప్రతి హిందువులో స్వాభిమానం రగిలించింది. 2024 జనవరి ఒకటో తారీకు నుంచి 15వ తారీకు వరకు అద్భుత కార్యక్రమాలు చేపట్టి చరిత్రలో నిలిపింది.
న భూతో న భవిష్యత్ అనే రీతిలో అయోధ్య అక్షింతల కార్యక్రమం చరిత్ర సృష్టించింది.
అయోధ్య శ్రీ రాముడి పాదాల చెంత పవిత్ర పూజలు చేసుకున్న అక్షింతలను ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలలో పంపిణీ చేశారు. ప్రతి హిందువును, ప్రతి పౌరుడు ని తట్టి లేపిన మహా యజ్ఞం అది.
చూస్తుండగానే అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అక్షింతలు పంపిణీ చేసి ఏడాది పూర్తి అవుతున్న సందర్భం తలుచుకుంటే అపురూపమైన అనుభూతి కలిగిస్తోంది.. మదిని పులకింపచేస్తోంది. చిన్నా పెద్ద.. పేద ధనిక.. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అయోధ్య శ్రీ రామ జన్మభూమి ప్రాణప్రతిష్టకు ఆహ్వానం పలికిన కార్యక్రమము అది. ఆకాశమంత పందిరి వేసి భూమండలమంతా పండగ చేసిన శుభ సందర్భంగా ఏ నోట విన్నా ..ఈటీవీ చూసినా..ఏ పత్రిక చదివినా.. ఏ ఒక్కరిని కదిలించినా అయోధ్య అక్షింతలు.. అయోధ్య అక్షింతలు.! ఇదే మాట.. ఇదే ముచ్చట..!
ప్రతి పౌరుడు ని కదిలించిన యజ్ఞం అది. స్వయంగా శ్రీరామచంద్రుడే తమకు ఆహ్వానం పంపాడు అనేలా ప్రతి ఒక్కరిని భక్తిపారవశంలో ముంచేసింది. భక్తి శ్రద్ధలతో అక్షంతలను ఆనందంగా అందుకున్న విశేష పర్వం అద్భుతం.. మహాద్భుతం. అత్యంత సంపన్నులు నివాసముండే గేటెడ్ కమ్యూనిటీలు మొదలుకొని, అత్యంత పేదల నివసించే గుడిసెల వరకు అక్షింతలను అదే భావనతో, అదే స్వాభిమానంతో అందించిన ఘనత కరసేవకులది. మది మదిలో రాముడిని తలుచుకుంటూ మురిపెంగా సాగిన మహా అద్భుత కార్యము అది.
ఇంటింటికి కరపత్రము, అక్షింతలు అందజేసి, ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం సృష్టించిన అపురూప ఘట్టం అది. సమయం సరిపోక కొంతమందికి అక్షింతలు అందకపోతే ..”మా కాలనీకి, మాగేటెడ్ కమ్యూనిటీకి , మా ఇంటికి అక్షింతలు రాలేదు.. వచ్చి అందివ్వండి “అంటూ స్వయంగా భక్తులు ఫోన్లు చేసి అక్షింతలు అందుకున్న తీరు ఎంత చెప్పినా తక్కువే. ఈ కార్యక్రమం ఓ చరిత్ర. ఒక విప్లవం. సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహా కార్యం.
గొప్ప హిస్టరీ. భక్తులకు భేదాలు ఉండవని, పేద, ధనిక, నిమ్న అగ్ర, జాతి, రీతి ఏదీ లేకుండా అందరినీ సమానంగా.. అందరికీ ఒకే తరహా అక్షింతలు అందజేసి రాముడి కార్యంలో పాలుపంచుకునేలా చేసిన ఘనత శ్రీ రామచంద్ర శ్రీరామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ నిర్వాహకులదే. మనం నివాసముండే ప్రతి గుడిలో అక్షింతల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, అందజేసి ప్రతి భక్తుడిని, ప్రతి మహిళను, పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఆబాల గోపాలం ఆనందంగా రామయ్య తండ్రి అక్షింతల కార్యక్రమంలో అలుపు సొలుపు లేకుండా పాల్గొన్న తీరు చరిత్ర.
అయోధ్య రామ జన్మభూమి లో పవిత్ర పూజలు చేసి అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలు, ఖండాలు దాటి అయోధ్య అక్షింతలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి గడపకు చేరాయి. అక్షింతలు వచ్చిన సందర్భంలో విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్ ల నుంచి పండుగ వాతావరణం తలపించింది. నృత్యాలు చేస్తూ.. కోలాటాలు ఆడుతూ.. రామ భక్తులు చేసిన కోలాహలం అంతా ఇంతా కాదు.
పార్టీలు, కులమతాలు, రాజకీయ భేదాలు పక్కన పెట్టి అక్షింతలు తలపై పెట్టుకుని మురిసిపోయిన మధుర క్షణాలు చిరస్మరణీయం. ఎన్నటికీ తరగని ఆనందం. దేశంలోని ప్రతి పల్లె, ప్రతి ఇల్లు కు అక్షంతలు చేర్చాలనే సంకల్పంతో కర సేవకులు ఆయా దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించి పవిత్రమైన అక్షింతలను వృద్ధి చేశారు. ఆలయాలు, మఠాలు, మందిరాల కేంద్రంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో స్థానికంగా వృద్ధి చేసుకొని ప్రతి ఇంటికి అక్షింతలను అందజేశారు.
ఎవరికి వారే అందమైన ప్యాకెట్లతో అక్షింతలు అందజేసి అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. దీంతో ప్రజలంతా స్వయంగా శ్రీరామచంద్రుడే తన మందిర ప్రాణప్రతిష్టకు ఆహ్వానం పలికినట్లు తరించిపోయారు. ఇంటికి అక్షింతలు తీసుకువచ్చిన కర సేవకులకు మంగళ హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. కొన్ని ప్రదేశాలలో భాజా భజంత్రీలతో అక్షింతలను ఊరేగించారు. మరి కొన్ని ప్రదేశాలలో ప్రతి ఇంటి నుంచి ఒకరు కదిలి వచ్చి మన ఊరికి అక్షింతలు వస్తున్నాయి అనడంతో ఊరు ఊరంతా వెళ్లి ఎదురు వెళ్లి అక్షింతలను మురిపెంగా అందుకొని ఊరేగింపుగా ఆయా దేవాలయాలకు చేర్చుకున్నారు.
భజనలు చేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి, బొట్టు పెట్టి మరి అక్షింతలు అందజేశారు. పుర ప్రముఖులు, స్వామీజీలు, సాధువులు , అనేక హిందూ సంఘాలు, అయ్యప్ప ,శివ స్వామి, వెంకటేశ్వర స్వామి వంటి మాల ధారణ చేసే భక్తులు , యువజన సంఘాలు ,భజన సంఘాలు, భజన మండలిలు, మహిళా సంఘాలు.. ఒకరేమిటి అందరూ ఆప్యాయంగా ఈ అక్షింతల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. భక్తి లో మునిగితేలారు.
రాజకీయ, క్రీడా ,చలనచిత్ర, మీడియా, పారిశ్రామిక ,ఉద్యోగ, కార్మిక, ధార్మిక రంగాలు.. ఇలా ఏది వదలకుండా అన్ని వర్గాల ప్రముఖులను, ప్రజలను కలిసి అక్షింతలు అందజేయడం మహా అద్భుతమైన ఘట్టం. రాష్ట్రపతి నుంచి మొదలుకొని, గ్రామాలు, తండాలు, పల్లె సీమ, గిరిజన ప్రజలతో పాటు కొండ కోనల్లో నివసించే చిట్టచివరి పౌరుడి వరకు ఎవరిని వదలకుండా అందరిని అయోధ్య రాముల వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానిస్తూ అక్షింతలు అందజేశారు. రామభక్తులు ఎంతటి భక్తితో అక్షింతలు అందజేశారో .. అంతకు రెట్టింపు స్థాయిలో ఆయా ప్రజలు అక్షింతలను అందుకోవడం విశేషం.
పవిత్రతకు భక్తికి ప్రసిద్ధిగా నిలిచిన అక్షింతలు ఒక సందర్భంలో రాజకీయ ప్రకంపనలు రేపాయి. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాన్ని వేడెక్కించాయి. అప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్ తోపాటు చిన్నాచితక నేతలు అక్షితలపై అవాకులు చవాకులు పేలారు. “అవి అక్షింతలు కాదు కంట్రోల్ బియ్యం” అని ఒకరు.. “దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారు.l, అక్షింతలను అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు” అని రేవంత్ రెడ్డి..”పసుపు బియ్యం తీసుకురావాలి. కలపాలి. పంచాలి. ఓట్లు అడగాలి.” అంటూ కేసిఆర్.. ఇలా ఒకరిని మించి ఒకరు పోటీపడి అక్షింతలపై విమర్శలు గుప్పించారు. తమ హిందూ వ్యతిరేకతను ప్రదర్శించి ఓట్ల రాజకీయంలో పోటీపడి రాముడిని, రాముడి అక్షంతలను అవమానపాలు చేసే విధంగా గత లోక్ సభ ఎన్నికల ప్రచారం సాగింది.
మొత్తంగా హిందుత్వం అంటే గిట్టని వారు, అయోధ్య రాముడిని అసహ్యించుకునే వారి నిజస్వరూపం గత ఎన్నికల ప్రచారంలో బయటపడింది. ఏకంగా ప్రతి సభలో అయోధ్య అక్షింతలను రాజకీయాలతో ముడిపెట్టి ప్రసంగాలు చేయడాన్ని తెలంగాణ ప్రజలు అసహ్యించుకున్నారు. చివరకు రాముడి అనుగ్రహం వారికి లభించలేక ఒక పార్టీ పార్లమెంటులో కాలు పెట్టలేకపోయింది. అప్పుడే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన కాంగ్రెస్ పార్టీ మంచి కాక మీద ఉండటంతో రాష్ట్రమంతా గెలుస్తామని బీరాలు పలికింది. తీరా బొటాబొటి సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఏది ఏమైనా అయోధ్య అక్షింతలు అనేవి ఒక చరిత్ర. సువర్ణ అక్షరాలతో లిఖించదగిన గొప్ప కార్యం. ఈ కార్యములో పాల్గొన్న ప్రతి కరసేవకుడు, ప్రతి స్వయంసేవకుడు, ప్రతి రామభక్తుడి జన్మ ధన్యమైంది. చిరస్థాయిగా ప్రతి ఏడాది మురిపెంగా , అపురూపంగా ఆ అద్భుత కార్యక్రమం గురించి కథలు కథలుగా చెప్పుకొని సంతోషించవలసిన ఈ కార్యక్రమానికి ఏడాది పూర్తి కావడం ఆనందదాయకం.
రాముడి అనుగ్రహం ప్రతి భారతీయుడికి , ప్రతి పౌరుడికి ఉండాలి. ఇంకా అయోధ్య రాముడి దర్శన భాగ్యం కలగని వారు వీలు చూసుకుని రాముడి దర్శించి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము.
(అక్షింతలు పంపిణీ చేసి ఏడాది గడిచిన సందర్భంగా )
జైశ్రీరామ్
– పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముక్
విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010