– రాజీవ్ గాంధీ బతికుంటే రేవంత్ రెడ్డి పాలనను చూసి కన్నీరుమున్నీరు అయ్యేవారు
– రూ.41వేల కోట్లతో రుణమాఫీ అని చెప్పి రూ.22వేల కోట్లతో చేశారు
– సినీ ఇండ్రస్ట్రీతో బేరం కుదుర్చుకున్నరు
– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకొని మరో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ప్రజలు గంపెడాశలతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మోసపోయామని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఇది ప్రభుత్వమేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
75 వ రాజ్యాంగ సవరణలో పార్లమెంటుకు ఎంత అధికారం ఉంటదో గ్రామపంచాయతీకి కూడా అంతే అధికారం ఉంటదని రాజీవ్ గాంధీ చెప్పారు. కానీ, కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణలో రాజీవ్ గాంధీ మాటకు విలువలేకుండా పోయింది. రాజీవ్ గాంధీ బతికుంటే రేవంత్ రెడ్డి పాలనను చూసి కన్నీరుమున్నీరు అయ్యేవారు.
రాష్ట్రాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవికాలం ముగిసినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం లేదు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పాలన చేస్తున్నారు. కార్యదర్శులు వాళ్ల సొంత డబ్బులతో గ్రామాల్లో చిన్నచిన్న పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడా చూసినా కూడా చెట్లు ఎండిపోతున్నాయి. మురికి కాలువల నుండి మురుగు వాసన, దోమలతో ప్రజలు అనారోగ్యానికి గురైతున్నారు.
ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో చూస్తే ఏవిధంగా ఉందో కనబడుతలేదా..? బిల్లులు రాక మాజీ సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుధ్ది ఉంటే గ్రామపంచాయతీలకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామన్నరు. ప్రజల బాగోగులు చూసే ఖాళీలు చాలా ఉన్నాయి. వాటినెందుకు భర్తీ చేస్తలేరు.?
సంక్రాంతి లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. సంక్రాంతికి ఇంకా 13రోజులే ఉంది. ఇప్పటివరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అతీగతీ లేదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాఆగ్రహానికి రేవంత్ రెడ్డి గురైతడని భయపడుతున్నడు. ప్రజాసమస్యలను ప్రక్కద్రోవ పట్టించడానికి రేవంత్ రెడ్డి రోజుకోఆట ఆడుతున్నాడు.
అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది….అధికారంలోకి వచ్చాక అవినీతిసొమ్మును కక్కిస్తా అని చెప్పాడు. ఇప్పటివరకు జరిగిందేమీ లేదు. రూ.41వేల కోట్లతో రుణమాఫీ అని చెప్పి రూ.22వేల కోట్లతో చేశారు. జనగామ జిల్లా నిడిగొండ గ్రామంలోని పరపతి సంఘం కోఆపరేటివ్ సోసైటీలో అర్హులైన 300మంది రైతులకు రుణమాఫీ జరగలేదు.
ఎందుకు జరగలేదని ఆరా తీస్తే ఒక్కొక్క ఆధార్ కార్డుతో నలుగురు రైతులకు లింక్ పెట్టి అధికారులు అవినీతి చేశారు. రైతులంతా కలెక్టర్ కి అప్లికేషన్ ఇచ్చినా ఇప్పటివరకు వారికి న్యాయం జరగలేదు. పరపతి సంఘం సొసైటీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులే అవినీతి చేస్తున్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామన్నరు. మొదటి దఫా, రెండవ దఫాతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.26వేల కోట్లు బాకీ ఉంది.
ఎన్నికల ముందు ఓఆర్ఆర్ క్రాంటాక్టు రద్దు చేస్తామని చెప్పిండ్రు.. అధికారంలోకి వచ్చాక క్రాంటాక్టర్ తో బేరం కుదుర్చుకొని రద్దు చేయలేదు. హైడ్రా పేరుతో అతలాకుతలం చేసి బడా క్రాంటాక్టర్లను బెదిరించి గజానికి రూ.55 కమీషన్లు తీసుకొని కమీషన్ల ప్రభుత్వంగా పేరు మార్చిండ్రు. హైడ్రా పేరుతో ఒక్క చెరువుకైనా హద్దులు వేసిర్రా? సినిమా హీరో మీద అటాక్ చేసిర్రు. సినీ ఇండ్రస్ట్రీతో బేరం కుదుర్చుకున్నరు. పదవి కాపాడుకోవడం కోసం పార్టీ హైకమాండ్ కు కప్పం కట్టాలి కాబట్టి…. రేవంత్ రెడ్డి బేరాలు కుదుర్చుకొని బేరాల సంస్కృతికి తెరలేపిండ్రు.
ఎమ్మెల్సీ కవిత బీసీల గురించి గొప్పగా మాట్లాడుతున్నరు. బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద దీక్షలు చేస్తానని చెప్పిండ్రు. మరి, బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు ఎంత ప్రాధాన్యత ఉందో కవిత చెప్పాలి. దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్నరు చేయలే. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లను మైనారిటీలకు కలిపితే దాన్నే కొనసాగించిండ్రు.
ఎన్టీరామారావు బీసీలకు 33శాతం రిజర్వేషన్లను పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కుదించింది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టిండు. పార్లమెంటు పరిధిలో రెండు ఎమ్మెల్యే సీట్లను బీసీలకు కేటాయిస్తమని చెప్పి ఇవ్వలే. నామినేటెడ్ పోస్టులను బీసీలకే ఎక్కవ ఇస్తమని చెప్పి 56 పోస్టులల్లో 11పోస్టులే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిండ్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని డ్రామా ఆడుతున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయకుండా దగా చేసిర్రు. పీవీ నరసింహరావు ని అవమానపరచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…ఇప్పుడు వారి మీద ప్రేమ చూపుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోతే ప్రధాని నరేంద్రమోదీ గారు కేబీనేట్ తో చర్చలు జరిపి.. వారి కుటుంబంతో మాట్లాడి దహన సంస్కారాలు నిర్వహించారు. దానిని కూడా రాజకీయాలు చేస్తున్న నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది.
సంతాప దినాలు ప్రకటిస్తే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం వారి నాయకుడి పట్ల ఉన్న ప్రేమ, అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు, చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే కొత్త సంవత్సరంలోనైనా ప్రజల గురించి ఆలోచన చేసి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని సలహా ఇస్తున్నాం. లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు.
భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల పక్షాన కొట్లాడుతాం. వచ్చే సంవత్సరం మొత్తం ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీల అమలుకు ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. ప్రజలకు న్యాయం జరిగేవరకు కొట్లాడుతం. ఈ మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు వెంకట్ రెడ్డి , రాణి రుద్రమ , బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు.