బిజీ బిజీ!
దుబాయ్: దక్షిణాసియాకు ఆంధ్రాను ముఖ ద్వారంగా మారుస్తూ, చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో దూసుకెళ్తున్నారు. ఏపీలో భారీ వర్షాల మీద గురువారం రెండు సమీక్షలు చేసి అధికారులను అప్రమత్తం చేశారు. మరో వైపు ఏపీలో పెట్టుబడుల వర్షం కురిపించేందుకు పెట్రోలియం దిగ్గజాలు, అగ్రశ్రేణి టెక్ సంస్థల సీఈఓలను గురువారం (రెండో రోజు) కలుసుకున్నారు.
పెట్రోకెమికల్ పవర్‌హౌస్‌గా ఏపీ
అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధి అహ్మద్ బిన్ తలిత్‌తో సీఎం భేటీ అయ్యారు. ఏపీకున్న సుదీర్ఘ తీర ప్రాంతం, కృష్ణపట్నం, మచిలీపట్నం వంటి వ్యూహాత్మక ఓడరేవుల సమీపంలో పెట్రోకెమికల్, ఎల్ఎన్జీ, గ్యాస్ ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. అడ్నాక్ – ఆంధ్రప్రదేశ్ మధ్య సాంకేతిక సహకారం కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు.
టెక్ డెస్టినేషన్ దిశగా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’
సీఎం అబుదాబి చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, అలాగే ఏఐ దిగ్గజం జీ 42 సీఈఓ మాన్సూర్ అల్ మాన్సూరీతో సమావేశమయ్యారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా ఏపీ పయనిస్తోందని, రాజధాని అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సేవలకు కేంద్రంగా మారబోతోందని ప్రకటించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని వారికి ఆహ్వానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పనిచేసే జీ 42 సంస్థను ఏపీలో ఏఐ డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు.
టెక్ దిగ్గజాలతో నెట్వర్కింగ్ లంచ్: భవిష్యత్ ప్రాజెక్టులకు బీజం
అనంతరం, జీ 42 సీఈఓ మనుకుమార్ జైన్, పాలసీ బజార్ సీఈఓ యశిష్ దహియా, నూన్ సీఈఓ ఫరాజ్ ఖలీద్ సహా పలువురు అగ్రశ్రేణి టెక్ పారిశ్రామికవేత్తలతో సీఎం నెట్వర్కింగ్ లంచ్‌లో పాల్గొన్నారు. ఏపీని భారతదేశానికి టెక్ డెస్టినేషన్‌గా మార్చడం లక్ష్యమని వెల్లడించారు. ఏఐ-ఎంఎల్, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టాలని కోరారు. త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఏపీలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. యూఏఈలోని టెక్ కంపెనీలతో సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసి, భవిష్యత్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలనే ఆకాంక్షను సీఎం వ్యక్తం చేశారు.