– ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వర రావు
– సంతోష్ రావు హయంలోనే ఈ అవినీతి
– ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్‌కు ఫిర్యాదు
తిరుపతి: ఎస్పీడీసీఎల్లో అవినీతి వల్లే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయని మాజీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఈ అవినీతిపై ఆయన తిరుపతిలో ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్‌కు ఫిర్యాదు చేశారు.
ఒక రూపాయి వస్తువును మూడు రూపాయలకు కొని అవినీతికి పాల్పడితే, ఆ భారం వినియోగదారుడు ఎందుకు మోయాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నియమించిన సంతోష్ రావు హయంలోనే ఈ అవినీతి మొదలైందని ఆరోపించారు. ఈ అవినీతిపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరినా, 12 సార్లు అప్పీళ్లు చేసినా సమాచారం ఇవ్వలేదని తెలిపారు.
2023 నుంచి ఎస్పీడీసీఎల్లో అవినీతి కట్టుదిట్టంగా వ్యవస్థీకృతమైందని, అధికారులు, కంపెనీలు అవినీతి సొమ్మును పంచుకున్నారని ఆరోపించారు. అవినీతిని అరికడితే తప్ప విద్యుత్ చార్జీలు తగ్గవని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరిగి, దిద్దుబాటు జరగాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. సమగ్రమైన వివరాలతో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.