టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా, నిరసన దీక్ష ప్రారంభించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు, ఉదయం నుంచి కార్యకర్తల సంఘీభావం పెరుగుతోంది. వైసీపీ శ్రేణులు ఎక్కడయితే విధ్వంసం సృష్టించారో, అక్కడే ఆయన దీక్షకు ఉపక్రమించారు. ఉదయం నుంచి వేలాదిమంది కార్యకర్తలు, మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చి వెళుతున్నారు. వారిని నియంత్రించడం పార్టీ నేతలకు సాధ్యం కాలేదు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించిన కార్యకర్తలు, యువన లోకేష్‌ను కలసి దీక్షకు మద్దతు ప్రకటించారు. వారితో లోకేష్ ముచ్చటించి గ్రామాల్లో ప్రజల రియాక్షన్ అడిగి తెలుసుకున్నారు. పార్టీ సీనియర్లు వివిధ జిల్లాల నుంచి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. వివిధ విద్యార్థి సంఘాలు కూడా చంద్రబాబు నిరసన దీక్షకు మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు.. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సీనియర్లను, అక్కడి స్పందనను అడిగి తెలుసుకున్నారు. గతంలో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్, డిల్లీ ఏపీభవన్‌లో కూడా చంద్రబాబు ఇదేవిధంగా నిర్వహించిన దీక్షలు మరోసారి గుర్తుకుతెచ్చాయి. ‘జరిగిన ఘటన తెలుసుకున్న కార్యకర్తలు స్వచ్ఛందంగా వేల సంఖ్యలో వస్తున్నారు. వారి ఆందోళన చూస్తే ప్రజల్లో వైసీపీ చర్యపై ఎంత ఆగ్రహం ఉందో స్పష్టమవుతోంది. పార్టీ ఆఫీసు పరిస్థితిని చూసిన కార్యకర్తలు భావోద్వేగానికి గురువుతున్నారు. దీక్ష తర్వాత చంద్రబాబు సహా పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లి కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలుస్తారు. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చనీయాంశం చేసి, వైసీపీ రాక్షసత్వాన్ని చాటతాం’’ అని చంద్రబాబు రాజకీయ సలహాదారు, జాతీయ పార్టీ సమన్వయకర్త టిడి జనార్దన్ చెప్పారు. కాగా.. దీక్ష ప్రారంభించిన స్థలంలోనే చంద్రబాబు నిద్రపోయారు. దీక్ష సందర్భంగా కోబ్బరినీళ్లు ఇచ్చినా బాబు నిరాకరించారు.