Suryaa.co.in

Political News

కేంద్రం గుప్పెట్లోకి బెంగాల్!

పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర ప్రాంతమంతా బీఎస్ఎఫ్ ఆ ధీనంలోకి వెళ్ళిపోతోంది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజకీయ రంణరంగంగా మారిన ఈ ప్రాంతంలో తమ పార్టీకి అనుకూలంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ సరిహద్దు నుంచి 35 కిలోమీటర్ల వరకు ఉన్న బీఎస్ఎఫ్ పరిధిని 50 కిలోమీటర్లకు పెంచుతూ బీఎస్ఎఫ్ చట్ట సవరణ చేసింది.
ఫలితంగా పశ్చిమబెంగాల్ లోని ఉత్తర ప్రాంతమంతా, కేంద్రం అజమాయిషీలోకి వెళ్ళిపోతుంది. దీని వల్ల ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ దళాలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గాలింపు చర్యలు చేపట్టవచ్చు, ఎవరినైనా నిర్బంధించవచ్చు. నేపాల్, భూటాన్ కు ముఖద్వారం లాంటి సిలిగురి నగరం బెంగాల్ లో కలకత్తా తరువాత పెద్ద నగరం . కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పనిచేసే బీఎస్ఎఫ్ ఆధీనంలోకి, సిలిగురి సవరణ ద్వారా వెళ్ళిపోతుంది.
ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మాత్రమే 2,216.7 కిలోమీటర్ల అతి పెద్ద అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఈ రాష్ట్ర తూర్పు సరిహద్దు అంతా బంగ్లాదేశ్ తోనే ఉండడం వల్ల, డార్జిలింగ్ కొండలలోని కుర్సియాంగ్ నుంచి బంగాళాఖాతం వెంబడి ఉన్న సుందరబాన్స్ వరకు బీఎస్ఎఫ్ పరిధి విస్తరించింది. పాకిస్థాన్‌తో రాజస్థాన్‌కు 1,170 కిలోమీటర్లు, గుజరాత్ కు 506 కిలోమీటర్లు, పంజాబ్ కు 425 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్ తో అస్సాంకు కేవలం 267.5 కిలోమీటర్ల సరిహద్దు మాత్రమే ఉంది.
పశ్చిమ బెంగాల్ లో ఉన్న 23 జిల్లాలకు గాను, పది జిల్లాలకు బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 42 లోక్ సభ నియోజకవర్గాలలో సగం, అంటే 21 నియోజక వార్గాలకు బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది.
“బంగ్లాదేశ్ సరిహద్దుకు 50 కిలోమీటర్ల పరిధిలోనే బెంగాల్ లోని ప్రధానమైన పట్టణాలు, అనేక జిల్లా కేంద్రాలు ఉన్నందున వల్ల అవ్వన్నీ ఈ చట్ట సవరణ వల్ల బీఎస్ఎఫ్ పరిధిలోకి వెళ్ళిపోతాయి.
ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక రహస్య ఎజెండా ఉండబట్టే కేంద్ర ప్రభుత్వం ఒక సహేతుకమైన వివరణ ఇవ్వలేకపోతోంది” అని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ విప్, ఆపార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుకేందు శేఖర్ రాయ్ ఆరోపించారు.
“ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించినదైతే రాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించలేదు? భారతదేశం యూనిటరీ ప్రభుత్వం కాదు కదా! రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ చట్టసవరణను ఏ పార్లమెంటులో అయితే చేశారో, ఆ పార్లమెంటులోనే మేం దీన్ని వ్యతిరేకిస్తాం” అని ఆయన స్పష్ట చేశారు.
కేంద్రప్రభుత్వానికి, నాగా పీపుల్స్ ఫ్రంట్ కు మధ్య నడిచిన వివాదంలో సుప్రీంకోర్టు (1997 నవంబర్ 27) ఇచ్చిన తీర్పును ఆయన ఇలా గుర్తు చేశారు.
“కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలు రాష్ట్రాలలో ఏవైనా చర్యలు చేపట్టాలంటే అక్కడి పౌర పరిపాలనాధికారులతో సంప్రదించి, వారి సహాయ సహకారాలతోనే చేపట్టాలి”
“సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్ర పోలీసుల స్థానంలో సాయుధ పోలీసులను దించి రాష్ట్రానికి సంబంధించిన పౌర పరిపాలనాధికారులతో సంప్రదించడం లేదు.
ఇది భారత దేశ ఫెడరల్ విధానానికి హాని చేసే ఏకపక్ష నిర్ణయం” అని సుకేందు శేఖర్ రాయ్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, “ఇది ఫెడరలిజం పైన దాడి” గా అభివర్ణించారు.
“రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అభ్యంతరాలు చెపుతోందో కారణాలు నాకు అర్థం కావడం లేదు. దేశ అంతరంగిక, సరిహద్దు భద్రతను పెంచడానికి బీఎస్ఎఫ్ పరిధిని పెంచవచ్చు. ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే కాదు, అస్సాం, పంజాబ్ లో కూడా ఈ మార్పులు చేశారు” అని పశ్చిమ బెంగాల్ కూచ్ బిహార్ జిల్లాకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నితీష్ ప్రామాణిక అన్నారు.
పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర ప్రాంతమంతా బీఎస్ఎఫ్ పరిధిలోకి రావడం చెప్పుకోదగ్గ రాజకీయ పరిణామం. ఆరు నెలల క్రితం జరిగిన బెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుని అధికారాన్ని తిరిగి కైవసం చేసుకున్నప్పటికీ, ఉత్తర ప్రాంతంలో మాత్రం బీజేపీతో నువ్వా నేనా అన్నట్టు పోరాడాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్ ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే వాదనను పలువురు బీజేపీ నాయకులు లేవనెత్తుతున్నారు. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నిక‌ల అనంత‌రం భారీ మార్పులలో ఈ ప్రాంతంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచింది. రాష్ట్రం నుంచి నలుగురిని కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకోగా, వారిలో ఇద్దరు రాష్ట్రంలో అయిదవ వంతు మాత్రమే ఉన్న ఉత్తర ప్రాంతం నుంచి వచ్చినవారు.ఈ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు సుఖాంత్ మజుందార్‌ను, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.
అధికార దుర్వినియోగం
కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్నది. కేంద్రప్రభుత్వం తన ఏజన్సీల ద్వారా, రాష్ట్రంలోని అధికారులను, అధికార పార్టీ నాయకులను భయపెడుతోందని రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు రానున్న రోజుల్లో చెప్పుకోదగ్గ రాజకీయ ప్రభావాన్ని కలగచేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ కేసులు పెడుతోందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి ఈ మధ్యనే తీసుకెళ్ళింది . రాష్ట్ర పరిధిలో సీబీఐ చేపట్టే కేసులకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను కేంద్రం ఉపసంహరించుకుందని కూడా తెలిపింది.
“మా నాయకులను భయపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను, సీబీఐని ప్రయోగిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు బీఎస్ఎఫ్ కూడా తోడైంది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మా నాయకులను మాదక ద్రవ్యాలు, దొంగనోట్ల చలామణి కేసుల్లో బీఎస్ఎఫ్ అరెస్టు చేయబోతున్న విషయాన్ని కూడా మీరు చూస్తారు” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని త్రుణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఒక ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయిన్ని పలువురు పౌరసమాజ సభ్యులు విభిన్న కోణాలలో తప్పుపట్టారు. బీఎస్ఎఫ్ పరిధిని పెంచుతూ చట్టసవరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మానవ హక్కుల కార్యకర్త కిరీటీ రాయ్ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు లేఖ రాశారు.
“రక్షణ పేరుతో రాజ్యాంగం కల్పించిన హక్కులను బీఎస్ఎఫ్ కాలరాస్తోంది. దీని వల్ల తప్పుడు కేసులు, చిత్రహింసులు, చట్టవ్యతిరేకంగా అరెస్టులు పెరగవచ్చు” అని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
“గడచిన ఐదేళ్ళలో బీఎస్ఎఫ్ చట్టాన్ని అతిక్రమిస్తూ చిత్రహింసలు పెట్టి మొత్తం 240 కేసులు పెట్టింది. చట్టాన్ని అతిక్రమిస్తూ 60 మంది ప్రాణాలు తీసింది. ఎనిమిది మంది అదృశ్యమయ్యారు. ఈ కేసుల్లో 33 మంది మృతికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని మానవహక్కుల కమిషన్(ఎన్ఎస్ఆర్ సీ) ఆదేశించింది” అని కిరీటి రాయ్ గుర్తు చేశారు.
“కాల్పులలో మరణించిన అనేక సంఘటనల గురించి బీఎస్ఎఫ్ స్థానిక పోలీసులకు తెలపలేదు. స్మగ్లింగ్ కేసుల్లో పట్టుబడ్డ వారిని స్థానిక పోలీసులకు అప్పగించని సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక కేసులో వ్యక్తిని చిత్రహింసలతో చంపేసి, శవాన్ని నదిలోకో, సరిహద్దు ఆవలికో విసిరివేశారు. గాలింపు చర్యలు చేపట్టే అధికారం కనక బీఎస్ఎఫ్ కు అప్పగిస్తే, నిందితులను అరెస్టు చేసి, స్వాధీనం చేసుకుంటారు. అరెస్టు చేసే పద్ధతిని, గాలింపును, అరెస్టు చేశాక నిందితుడిని అప్పగించడం వంటి చర్యల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిర్దేశించిన పద్దతులన్నిటినీ అతిక్రమిస్తున్నారు” అని కిరీటీ రాయ్ ఆరోపించారు.
మౌసమ్ అనే స్వచ్ఛంద సంస్థ అధిపతిగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 1990 నుంచి కిరీటీ రాయ్ పనిచేస్తున్నారు. కేంద్రం చేపట్టిన ఈ చర్యలను తాము కూడా నిరసిస్తామని ‘బంగ్లా సంస్కృతి మంచ్’ అనే సామాజిక సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు షమిరుల్ ఇస్లాం స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో నివసించే ప్రజలను ఇప్పటికే బీఎస్ఎఫ్ చిత్రహింసలకు గురిచేస్తోందని, కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల, ప్రజలు ఇలాంటి మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.
“స్మగ్లింగ్ ను అరికట్టడంలో ఈ చర్యలు ఏమేరకు సత్ఫలితాలనిచ్చాయో తెలియదు. బీఎస్ఎఫ్ ను ప్రస్తుతమున్న చట్ట పరిధిలోనే ఉంచడం మంచిది. 2024లో వచ్చే సాధారణ ఎన్నికలలో జరగనున్న మార్పును ప్రభావితం చేయడానికి చేపట్టిన ప్రయత్నం అనడంలో అతిశయోక్తి లేదు” అని ఇస్లాం వివరించారు.
“రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో విఫలమవడం వల్లనే దొడ్డి దారి ద్వారా రాష్ట్రాన్ని అదుపుచేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నమే ఇది. బెంగాల్, పంజాబ్ లో గెలవడమే ఈ పథకం ప్రధాన ధ్యేయం. దాని అసలు ఉద్దేశ్యాన్ని కప్పిపుచ్చడానికి అస్సాం కేంద్ర ప్రతినిధిగా పనిచేస్తోంది.” అని ఇస్లాం ఆరోపించారు.
రాష్ట్ర పరిధిని కేంద్రం ఉల్లంగించడంగా దీనిని భావించరాదని కోల్‌కతాలోని బంగాబసి కాలేజీ రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు ఉదయన్ బందోపాధ్యాయ అన్నారు. “పోలీసుల స్థానంలో బీఎస్ఎఫ్ కు బాధ్యతలు అప్పగించడం వల్ల రాష్ట్రం సైద్ధాంతికంగా ఏమీ కోల్పోదు. వారు పోలీసులకు తోడుగా పనిచేస్తారు. జాతీయ భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది. స్థానిక పాలనా వ్యవస్థను సంప్రదించకుండా కేంద్ర ఏజన్సీలు అరెస్టులు చేయడం చర్చించాల్సిన విషయమే. ఇప్పటికే ఎన్ఐఏ ఆ అధికారాన్ని చెలాయిస్తోంది” అని ఆయన వివరించారు.
అవసరాల రీత్యా బీఎస్ఎఫ్ తన అధికారాన్ని ఉపయోగించుకుంటోదనే ఆరోపణ దాని పరిధిని విస్తరింపచేస్తోందని అన్నారు. బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం వల్ల దాని సామర్థ్యం దెబ్బతింటుందని ఉత్తర బెంగాల్ లోని విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకులు ప్రొఫెసర్ జెత సాంకృత్యాయన్ వ్యాఖ్యానించారు. సాంకృత్యాయన్ గతంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడుగా కూడా పనిచేశారు.
“పోలీసులను తమ కర్తవ్యాలను నిర్వర్తించేలా చేద్దాం. అక్రమ చొరబాట్లను అరికట్టడానికి, స్మగ్లింగ్ నిరోధించడానికి సరిహద్దు భద్రతపై బీఎస్ఎఫ్ ను దృష్టి సారించమందాం. అనవసరమైన గందరగోళం వల్ల పోలీసులతో ఘర్షణ తలెత్తుతుంది.” అని సాంకృత్యాయన్ హితవుపలికారు.

– రాఘవ వర్మ
‘ద వైర్’ సౌజన్యంతో
‘ మన తెలంగాణ ‘ లో వచ్చిన కథనం

LEAVE A RESPONSE