-ఏం చేయకుండానే అంతా తానే చేశానని చెప్పుకోవడం బాబుకు అలవాటే
-వైద్య ఆరోగ్య రంగానికి చంద్రబాబు చేసిందేమీ లేదు
-చరిత్ర హీనులుగా మిగిలిపోవాల్సిందే
-ఎయిమ్స్ ను తాము తెచ్చినట్లు చెప్పుకోవడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనం
-నెల్లూరు, తిరుపతి పద్మావతి మెడికల్ కళాశాలలకు ఆలోచన చేసింది వైఎస్సే
-పద్మావతి మెడికల్ కళాశాలలో 23 సీట్లు అమ్ముకోవచ్చంటూ టీడీపీ జీవో
-దేవుడి కళాశాలతో వ్యాపారం చేశారు కాబట్టే వారికి అవే 23 అసెంబ్లీ సీట్లే ఇస్తూ దేవుడు శిక్ష
-విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
చంద్రబాబు మాటలన్నీ బూటకాలేనని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని నిప్పులు చెరిగారు. మెడికల్ కళాశాలలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గుంటూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలల గురించి టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మెడికల్ కళాశాలల విషయంలో చంద్రబాబునాయుడుతోపాటు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వారిది అజ్ఞానం అనాలో, లేక కావాలనే అబద్ధాలు ఆడుతున్నారని ఆనాలో అర్థంకావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తిగా అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేయాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నాయకుల మోసపూరిత ప్రచారాలను, కుట్రపూరిత చేష్టలను ప్రజలు ఎప్పటికీ నమ్మరని స్పష్టంచేశారు.
టీడీపీ నాయకుల గోబెల్ ప్రచారం
టీడీపీ నాయకుల గోబెల్స్ ప్రచారం చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. అసెంబ్లీలో తమ నాయకుడు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి టీడీపీ తీసుకొచ్చిన ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ఏవీ లేవని చెప్పారు. చంద్రబాబునాయుడు, ఆయన అనునాయులు ఎయిమ్స్ తామే తీసుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. ఈ ఎయిమ్స్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అని, కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన వైద్య కళాశాల అని తెలిపారు.
దీనికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. అయినా సరే ఈ ఎయిమ్స్ ను చంద్రబాబు ఎలా తీసుకురాగలిగారో ఆయనకే తెలియాలన్నారు. అసలు ఈ ఎయిమ్స్ రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, దీన్ని కచ్చితంగా నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర పునర్విభజన చట్టం చెబుతోందని, ఆ చట్టం ప్రకారమే కేంద్రం ఈ వైద్య కళాశాల నిర్మాణం చేపట్టిందని స్పష్టంచేశారు. అసలు తమ నాయకుడు జగనన్న అలుపెరగని పోరాటాల వల్లనే ఈ రాష్ట్రానికి ఎయిమ్స్ వచ్చిందన్నారు. బీజేపీతో పొత్తుతో ఉన్న టీడీపీ కేంద్రంపై పోరాటాన్ని ఆపేయడంతో జగనన్న తీవ్రస్థాయిలో విభజన చట్టం అమలు కోసం పోరాడారని గుర్తుచేశారు. ఆ ఫలితంగానైనా కనీసం ఎయిమ్స్ అయినా మనకు దక్కిందని చెప్పారు.
ఆలోచనలు చేసింది వైఎస్సారే..
తిరుపతిలో పద్మావతి మెడికల్ కళాశాలను మహిళల కోసం నిర్మించాలని తలచింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారేనని చెప్పారు. నెల్లూరులోనూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించగలిగాము అంటే అది కూడా వైఎస్సార్ గారి ఆలోచనేనని తెలిపారు. ఈ రెండు చోట్ల మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారు అంచనాలు రూపొందించారని, ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపులూ చేశారని వివరించారు.
2013 చివరి నాటికి ఈ కళాశాలలకు అనుమతులు, భవనాల నిర్మాణం అన్నీ పూర్తయ్యాయని తెలిపారు. 2014 ఆగస్టులో వీటిల్లో అడ్మిషన్లు చేపట్టారని చెప్పారు. అలా ఈ రెండు కళాశాలలు వైఎస్సార్ గారి దయ వల్లనే ఈ రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. 2014 జూన్ 7వ తేదీన చంద్రబాబునాయుడు గారు సీఎం గా ప్రమాణస్వీకారం చేశారని, మరో నెలకే ఈ రెండు కళాశాలలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కేవలం రెండు నెలల్లో భూ సేకరణ, శంకుస్థాపన, నిర్మాణం, అనుమతులు… ఇలా ఇవన్నీ ఈ కాలేజీలకు ఎలా వచ్చాయో టీడీపీ నాయకులకే తెలియాలని ఎద్దేవా చేశారు.
ఏమీ చేయకుండానే తామే చేసినట్లు ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబునాయుడు సిద్ధ హస్తుడని తెలిపారు. పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకోవచ్చని పేర్కొంటూ 23 సీట్లను ఎన్ ఆర్ ఐ కోటాకు ఇస్తూ టీడీపీ ప్రభుత్వమే జీవో ఇచ్చిందని, ప్రభుత్వ కళాశాలల్లో అసలు ఎన్ ఆర్ ఐ సీట్లు ఉంటాయా అని ప్రశ్నించారు. ఒకవైపు వాళ్లే ఈ కళాశాలను ప్రభుత్వ కళాశాల అని అంటారు… మరో వైపు వాళ్లే ఎన్ ఆర్ ఐ కోటాలో జీవోలు ఇస్తారు.. అని ఆరోపించారు. వెంకటేశ్వరుడి ఆధ్వర్యంలో నడిచే కళాశాలలో సీట్లు అమ్ముకోవడం దర్మార్గమని, అందుకే వాళ్లు ఎన్ని సీట్లైతే అమ్ముతూ జీవో ఇచ్చారో.. దేవుడు అన్ని సీట్లలో మాత్రమే వారు గెలిచేలా ఎప్పటికి గుర్తుండి పోయే శిక్ష వేశారని తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు 11 మాత్రమే
తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారు అసెంబ్లీలో ప్రకటిచినట్లుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలు 11 మాత్రమే అని స్పష్టంచేశారు. కాదు 13 ఉన్నాయంటూ టీడీపీ నాయకులు గోబెల్స్ ప్రచారానికి తెగబడ్డారని ఆగ్రహ వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిమ్స్ ను, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పద్మావతి మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వీరికి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
వైద్యరంగం అనగానే గుర్తొచ్చేది వైఎస్సార్, జగనన్న మాత్రమే
ఈ రాష్ట్రంలో వైద్య రంగం అంటే గుర్తొచ్చేది వైఎస్సార్‌తోపాటు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రమే అని మంత్రి స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, మెడికల్ కళాశాలలు లాంటి సంస్కరణలు చేపట్టి వెఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో గొప్ప నాయకుడిగా మిగిలిపోయారని తెలిపారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖలో వసతుల కల్పన కోసం ఏకంగా రూ.16వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.