-నితిన్ జైరామ్ గడ్కరీ
-వేడుకగా విజ్ఞాన్స్ వర్సిటీ 10వ స్నాతకోత్సవం
విద్యార్థులందరూ పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సెంట్రల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ జైరామ్ గడ్కరీ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో పదో స్నాతకోత్సవాన్ని గురువారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ జైరామ్ గడ్కరీ మాట్లాడుతూ వచ్చే దశాబ్ధ కాలాన్ని ‘‘టెకేడ్’’గా పిలుస్తారని… విద్యార్థులు అందులో బెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలన్నారు.
దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై విద్యార్థులు దృష్టిని కేంద్రీకరించాలన్నారు. దేశ అభివృద్ధికి పరిశోధనలు, ఆవిష్కరణలనేవి మూల స్తంభాలని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం మీ తెలివిని, జ్ఞానాన్ని, ఆలోచలనలను సరైన దిశలో అన్వయించడం విద్యార్థుల బాధ్యతని తెలియజేసారు. జ్ఞానాన్ని సంపదగా మార్చడం, వ్యర్థాలను సంపదగా మార్చడం అనే రెండు సిద్ధాంతాలను తాను నమ్ముతానని పేర్కొన్నారు. సరైన నాయకత్వం, దార్శనికత, సాంకేతికతతో వ్యర్థాలను సంపదగా మార్చగలమన్నారు.
విద్యార్థులందరూ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నిర్మాణాత్మక మార్గంలో ఉపయోగించాలన్నారు. విద్యార్థుల వినూత్నమైన ఆలోచనలు, సృజనాత్మకతతో ప్రతి రంగంలోను మార్పును తీసుకురాగలమన్నారు. మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ సంస్థకు మీరు గ్రోత్ ఇంజిన్‌గా ఉండాలన్నారు. వైఫల్యాల నుంచిఅనుభవాలను పొంది కొత్త ఆశలతో నిజాయితీగా ముందుకు సాగాలన్నారు. ప్రపంచం చాలా వేగంగా మారుతుందని… భవిష్యత్ ఆవశ్యకతను అర్థం చేసుకుని తదనుగుణంగా మనం నడుచుకోవాలన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కిల్ డెవలప్‌మెంట్‌లలో దేశం మరింత ముందుకు వెళ్లాలన్నారు.
విద్యార్థులందరూ వ్యాపారవేత్తలుగా ఎదిగి ప్రజలకు ఉపాధి కల్పించాలన్నారు. సమీప భవిష్యత్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ ఇండియా, ఈ–గవర్నెన్స్, ఈ–కామర్స్ వ్యాపారం, ఐటీ టెక్నాలజీ మరియు తయారీ రంగాలను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. స్టార్టప్‌లు, వ్యాపారం, ఇండస్ట్రీ ఎకో సిస్టమ్‌లను నెలకొల్పడానికి భారతదేశం అనుకూలమైన గమ్యస్థానమని తెలియజేసారు.
స్టార్టప్‌ల పరంగా మనదేశం టాప్–3లో ఉందని పేర్కొన్నారు. నేడు 100 కంటే ఎక్కువ యూనికార్న్ స్టార్టప్‌లను కలిగి ఉన్నామని… ఒక్కొక్కటి 1 బిలియన్ యూఎస్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయన్నారు. మన దేశ ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించాలన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునన్నారు.
నలుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు
స్నాతకోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్ల, ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ నమ్మల్వార్ కిడాంబీ, హైదరాబాద్‌లోని ఆస్త్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ ఎంవీ.రెడ్డి, హైదరాబాద్‌లోని సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరక్టర్ ఎం.ఎం,కీరవాణిలకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ డాక్టరేట్‌లు ప్రదానం చేసింది.
1842 మందికి డిగ్రీలు : విజ్ఞాన్స్ వర్సీటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ 10వ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 1842 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసారు. వీటితోపాటు 49 ( అకడమిక్ గోల్డ్ మెడల్స్–20, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డులు–21, చైర్మన్స్ గోల్డ్ మెడల్–1, ఎండోమెంట్ అవార్డులు–3, బెస్ట్ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, సోషల్ ఎంగేజ్‌మెంట్–1, బెస్ట్ లీడర్ అవార్డు–1, ఎగ్జెంప్లరీ అవార్డు–1, సోషల్ ఎంగేజ్‌మెంట్ కేటగిరీ–1) మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేసారు.
పరిశోధనలపై దృష్టిసారించాలి : హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్ల
ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలపై దృష్టిసారిస్తే అద్భుత ఫలితాలను రాబట్టవచ్చునని హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్ల వెల్లడించారు. విద్యార్థులు పరిశోధనలు కొనసాగించాలంటే ఆలోచన శక్తి, విశ్లేషణాత్మక పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, టీం వర్కు, ఓర్పు, నేర్పులతో పాటు తాజా ఆవిష్కరణలపై అవగాహన ఉండాలన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే డబ్బు సంపాదించడం కాదని సమాజిక సమస్యలను పరిష్కరించడమని తెలియజేసారు.
దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలి : హైదరాబాద్‌లోని ఆస్త్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ ఎంవీ.రెడ్డి
యువత తన శక్తి, యుక్తులను వెలికితీసి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని హైదరాబాద్‌లోని ఆస్త్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ ఎంవీ.రెడ్డి అన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే యువత బాధ్యత తీసుకోవాలని, పరిజ్ఞానాన్ని మన దేశాభివృద్ధికే దోహదపడేలా పరిశోధనలు చేయాలని పేర్కొన్నారు. మారుతున్న శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి విజన్‌తో ముందుకెళ్లాలని, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు.
క్రీడాకారులు మాత్రమే వరల్డ్ చాంపియన్స్ : ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ నమ్మల్వార్ కిడాంబీ
క్రీడాకారులు మాత్రమే వరల్డ్ చాంపియన్స్ అవ్వగలరని ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ నమ్మల్వార్ కిడాంబీ పేర్కొన్నారు. క్రీడల్లో రాణింపుతోనూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునని అన్నారు. శారీరక శ్రమ కలిగే విధంగా ఆటలు ఆడటం వల్ల విద్యార్థులకు ఆరోగ్యం లభిస్తుందన్నారు. క్రీడల ద్వారా ఎంతోమంది ఉన్నత స్థానాలకు వెళ్లి దేశ ప్రతిష్టను పెంచారన్నారు. తరగతి గదులకే పరిమితం కాకుండా సమాజంలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్నారు.
అంబరాన్నింటిన సంబరం
డిగ్రీలు చేతబట్టుకున్న వేళ విద్యార్థుల సంబరం అంబరాన్ని అంటింది. కేరింతలతో వర్సిటీ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. నాలుగేళ్ల తమ అనుభవాలను విద్యార్థులు ఒకరికొకరు పంచుకున్నారు. తరగతి గదుల్లో గడిపిన క్షణాలను నెమరువేసుకున్నారు. విశ్వవిద్యాలయంతో తాము పెంచుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సరదగా గడిపిన గడియలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ సంతోషంగా గడిపారు. గుర్తుగా సెల్ఫీలు దిగారు. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిన బూనారు. విద్యార్థులంతా తలపాగా, కండువా వేసుకుని అచ్చతెలుగు పెద్ద మనుషుల్లా కనిపించారు. సంస్కృతీ సంప్రయాదాలు ప్రతిబింబిస్తూనే సాంకేతిక విద్యా సర్టిఫికెట్లను పొందారు.
కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ , రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, స్నాతకోత్సవం ప్రధాన కన్వీనర్ డీ.విజయక్రిష్ణ, బోర్డు ఆఫ్ మేనేజిమెంట్ సభ్యులు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.