– చంద్రబాబు అరెస్టుపై పెదవి విప్పని సినీ పరిశ్రమ
– బాబు అరెస్టును ఖండించిన నిర్మాత నట్టికుమార్
– సినీ ప్రముఖులు ఎందుకు మాట్లాడరన్న ప్రశ్న
– బాబును సనీ పరిశ్రమ వాడుకుందన్న వ్యాఖ్యలు
– బాబు అరెస్టును ఖండించిన తమిళ హీరో విశాల్
– గతంలో బాబుపై విశాల్ కుప్పంలో పోటీ చేస్తారన్న ప్రచారం
– బాబు ప్రశ్నలకు జగన్ దగ్గర జవాబులు లేవన్న వ్యాఖ్య
– బాబు లాంటి వారికే సామాన్యుడి పరిస్థితేమిటన్న ఆవేదన
– బాబుకు బాసటగా నిలిచిన పవన్ కల్యాణ్
– లోకేష్‌కు రజనీకాంత్ ఫోన్
– చిరంజీవి, నాగార్జున, మహేష్, ప్రభాస్, కల్యాణ్‌రామ్
– గతంలో చిరంజీవి సమస్యను పరిష్కరించిన చంద్రబాబు
– పవన్-పరిటాల రవి వివాదానికి తెరదించిన బాబు
– అయినా బాబు అరెస్టుపై చిరంజీవి మౌనంపై ఆశ్చర్యం
– పెదవి విప్పని పెద్ద దర్శక-నిర్మాతలు
– సినిమా రేట్లు, షోల కోసం మౌనంగా ఉన్నారా?
– జగన్‌కు భయపడి పెదవి విప్పడం లేదా?
– వ్యాపార అవసరాల కోసమే మౌనరాగమా?
– జూనియర్ కంటే విశాల్ మిన్న అన్న ప్రశంలు
– ఎన్టీఆర్‌కు అన్నగారి పేరు చెప్పే అర్హత లేదన్న వ్యాఖ్యలు
– సినీ పరిశ్రమ మౌనంపై సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం
( మార్తి సుబ్రహ్మణ్యం)
సినిమావాళ్లది ఏదైనా అతి వ్యవహారమే. అయితే అతివృష్టి. లేకపోతే అనావృష్టి. అవసరం వస్తే అతుక్కుపోతారు. లేకపోతే అటువైపే కన్నెత్తిచూడరు. అట్లుంటది సినిమావాళ్లతోని! తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన.. టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యవహారంపై, తెలుగు సినీపరిశ్రమ మౌనరాగం ఆలపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తమిళ హీరో హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్‌లోని తెలుగు హీరోల బేలతనాన్ని వెక్కిరించడం హాట్‌టాపిక్‌గా మారింది.
చిరంజీవి, నాగార్జున, మహేష్, ప్రభాస్ వంటి స్టార్లు బాబు అరెస్టు అంశంపై పెదవి విప్పలేదు. బాబుకు మేనల్లుడైన జూనియర్ ఎన్టీఆర్ మౌనరాగంపై అన్నగారి అభిమానులు- టీడీపీ శ్రేణులు- కమ్మ సామాజికవర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఒకవైపు తాత పెట్టిన టీడీపీ కార్యకర్తలంతా, రాజమండ్రి బాట పడుతుంటే.. జూనియర్ మాత్రం కుటుంబంతో కలసి, దుబాయ్ వెళ్లడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
చివరకు ఆయన సోదరుడైన కల్యాణ్‌రామ్ కూడా మౌనంగా ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. వారి సోదరి సుహాసిని మాత్రం, బాబుకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. కొన్ని ఆందోళనా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఆవిధంగా ఒకే కుటుంబంలో ఇద్దరు సోదరులు ఒకవైపు.. సోదరి ఇంకోవైపు ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇక ప్రముఖ దర్శక-నిర్మాతలు కూడా, బాబు అరెస్టు అంశంతో తమకు పనిలేదన్నట్లు ఉండటం ఆసక్తికరంగా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో తోపులు అని చెప్పుకునే స్టార్లు మౌనంగా ఉన్న నేపథ్యంలో, తెలుగువాడైన తమిళ హీరో విశాల్ హటాత్తుగా తెరపైకొచ్చి.. బాబు అరెస్టును ఖండించడం, బడా స్టార్లను ఖంగుతినిపించింది. అది ఒకరకంగా తెలుగు స్టార్లకు అవమానమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్న కామెంట్లు.. తెలుగు హీరోల డొల్లతనాన్ని సూచిస్తున్నాయి. అంతకంటే ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా లోకేష్‌కు ఫోన్ చేసి, తన సంఘీభావం ప్రకటించి యుద్ధం కొనసాగించమని చెప్పడం విశేషం.
తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన విశాల్.. చంద్రబాబు అరెస్టుపై ఎవరూ ఊహించని విధంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు వంటి ప్రముఖుడి పరిస్థితే ఆవిధంగా ఉంటే, ఇక తనలాంటి సామాన్యుడి పరిస్థితి ఏమిటని భయం వేసిందన్న విశాల్ వ్యాఖ్యపై కామెంట్లు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తన అరెస్టుకు సంబంధించి వేసిన ప్రశ్నలకు, జగన్ సర్కారు దగ్గర జవాబులు లేవని వ్యాఖ్యానించడం సాహసోపేతమేనంటున్నారు.
తాము తెరపైన నటించినప్పటికీ, ఇంటికివెళ్లిన తర్వాత మామూలు వ్యక్తుల మాదిరిగానే ఆలోచిస్తామన్న విశాల్ వ్యాఖ్య.. తెలుగు సినీ హీరోలకు చెంపదెబ్బలాంటివేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తమిళనాడులో ఓటు హక్కు ఉన్న విశాల్ వంటి వర్ధమాన హీరోనే ధైర్యం చేసి, బాబు అరెస్టుపై తన వాదనను కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్‌లో ఓటున్న తెలుగుహీరోలు..జగన్‌కు భయపడి కలుగులో దాక్కోవడమే వింతగా ఉందంటూ, సోషల్‌మీడియాలో నెటిజర్లు సెటైర్లు వేస్తున్నారు.
ప్రధానంగా పెద్ద హీరోలు, బడా దర్శక-నిర్మాతలు జగన్‌కు భయపడే మౌనంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కొత్త సినిమాలు విడుదలైనప్పడు పెద్ద హీరోల సినిమాలకు.. ప్రభుత్వం నుంచి అదనపు షోలు, అదనపు రేట్లు అవసరం. వాటితోనే సినిమా పెట్టుబడి చాలావరకూ వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి అనుమతిస్తేనే ఈ అదన పు రేట్లు-షో సౌకర్యం లభిస్తుంది. ఈ భయం-వ్యాపార లౌక్యంతోనే బడా స్టార్లు, దర్శక-నిర్మాతలు, చంద్రబాబు అరెస్టుపై మౌనంగా ఉంటున్నట్లు స్పష్టమవుతుంది.
చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయనను.. తమ సినీపరిశ్రమ విపరీతంగా వాడుకుందని, నిర్మాత నట్టికుమార్ గుర్తు చేశారు. ఎప్పుడంటే అప్పుడు బాబును కలిసే వెసులుబాటు ఉండేది. కానీ బాబు కష్టాల్లో ఉంటే సినీ పరిశ్రమ కనీస స్పందన లేకుండా ఉండటం దారుణమన్న ఆయన వ్యాఖ్యలకు, సోషల్‌మీడియాలో సానుకూల స్పందన లభిస్తోంది. ప్రధానంగా చిరంజీవికి చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో ఆయనతో సత్సంబంధాలు ఉండేవి. చిరంజీవి కొందరికి టీడీపీ ఎమ్మెల్యే సీట్లు కూడా, సిఫార్సు చేసేవారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉండేది. ప్రజారాజ్యం పెట్టిన తర్వాత కూడా శత్రువులుగా భావించలేదు.
చిరంజీవి కూతురు సుస్మిత-హీరో ఉదయ్‌కిరణ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో, సికింద్రాబాద్‌లోని తెలుగుదినపత్రికకు చెందిన ఫొటోగ్రాపర్-సినిమా రిపోర్టర్‌పై బౌన్సర్లు దాడి చేశారు. సినిమా రిపోర్టర్‌పై స్వయంగా పవన్ కల్యాణ్ చేయిచేసుకున్నారు. అందుకు నిరసనగా జర్నలిస్టులు అర్ధరాత్రి వేళ, పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేయడం సంచలనం సృష్టించింది. అల్లు అరవింద్, శ్యాంప్రసాద్‌రెడ్డి అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి, జర్నలిస్టులను సముదాయించారు. ఈ వార్త అప్పట్లో హల్చల్ చేసింది.
తర్వాత చిరంజీవి అభ్యర్ధనతో ఆ సమస్యను, స్వయంగా అప్పటి సీఎం చంద్రబాబు పరిష్కరించారు. బాబు ఆదేశాలతో అప్పటి సమాచారశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రంగంలోకి దిగి, చిరంజీవి కుటుంబానికి-పత్రిక యాజమాన్యానికీ రాజీ కుదిర్చారు. పవన్‌కల్యాణ్-పరిటాల వివాదాన్ని కూడా, చంద్రబాబునాయుడు పరిష్కరించిన వైనాన్ని గుర్తు చే స్తున్నారు. అలాంటి చిరంజీవి కూడా, చంద్రబాబు అరెస్టుపై మౌనంగా ఉండటంపై సినీపరిశ్రమలో విస్మయం వ్యక్తమవుతోంది.
తాజాగా తమిళహీరో విశాల్ తెరపైకొచ్చి, బాబు అరెస్టును ఖండించిన నేపథ్యంలో.. అన్నగారి అభిమానులు-కమ్మ వర్గం జూనియర్ తీరును మాటలతో ఎండగట్టేస్తున్నారు. ఎన్టీఆర్ కంటే విశాల్ మిన్న.. జూనియర్ విశాల్‌ను చూసి సిగ్గుతెచ్చుకో.. అన్నగారి పేరు పెట్టుకునే అర్హత నీకు లేదంటూ సోషల్‌మీడియాలో విసుర్లు విసురుతున్నారు.
అటు తెలుగుహీరోలు దద్దమ్మలంటూ, విశాల్ ఫొటో పెట్టి మరీ తెగ వ్యంగ్యాస్తాలు సంధిస్తున్నారు. ‘జగన్‌కు భయపడి కలుగులో దాక్కున్న హీరోల’ని, ‘కొత్త సినిమాలకు ఎక్స్ట్రా రేట్లు పెంచుకునేవాళ్లు ఎక్స్‌ట్రాలు అవుతారే తప్ప హీరోలు కాద’ంటూ.. అందరి హీరోల ఫొటోలు పెట్టి కామెంట్లు చేస్తుండటం, తెలుగుహీరోలకు ప్రాణసంకటంలా పరిణమించింది.
కాగా వచ్చే ఎన్నికల్లో హీరో విశాల్ కుప్పం నుంచి వైసీపీ అభ్యర్ధిగా చంద్రబాబుపై పోటీ చేస్తాడని కొద్దిరోజుల క్రితం సోషల్‌మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని తర్వాత విశాల్ ఖండించారు. ఇప్పుడు అదే విశాల్ వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం విశేషం.