– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఆధారాల్లేని కేసులో ఐదు నెలలు జైలులో ఉంచడం బాధాకరమని, సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని రెండు రాజకీయ పార్టీల ఒప్పందంగా పేర్కొనడం కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని, ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని అన్నారు. కవిత కేసులో న్యాయవాది వృత్తిపరంగా వ్యవహరించారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు బయటపడి, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దానితో సంబంధం ఉందని తెలుస్తున్నా, కోట్ల రూపాయలు అక్రమంగా అనుమానాస్పద ఖాతాల్లోకి మళ్ళాయని ఆరోపణలు వస్తున్నా, ఇప్పటి వరకు ఈడీ చర్యలు తీసుకోక పోవడంతోనే ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి పనిచేస్తుందో అర్ధమవుతున్నదని విమర్శించారు.