Suryaa.co.in

Andhra Pradesh

నిరుద్యోగుల ఆశలపై నిప్పులు పోశారు…!

వైకాపా పాలన తీరుపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య విమర్శ

నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగుల ఆశలపై వైకాపా ప్రభుత్వం నిప్పులు పోసిందని , రాష్ట్రంలో ప్రతి వంద మందిలో నలుగురు నిరుద్యోగుల ప్రాణాలు పోయాయని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదిక ప్రకారం నాలుగేళ్ళలో దాదాపు 1345 మంది మృతి చెందారని, 2022లో 8,908 మంది బలవన్మరణాలకు పాల్పడితే, అందులో 364 మంది నిరుద్యోగులేనని, వీరిలో పురుషులు 326 మంది, మహిళల 38 మంది మృతి చెందారని చెప్పారు.

ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించి, నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లారని, ఐదేళ్ళ పాలన పూర్తి కావస్తున్నా, డీఎస్సీ కానీ , గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్ట్ లు భర్తీ కానీ, ఆఖరికి పోలీస్ కానిస్టేబుళ్ళ పోస్ట్ లు కూడా ఇవ్వలేక పోయారన్నారు. ఇసుకను దూరం చేసి భవన నిర్మాణ కార్మికుల ఉపాధి అవకాశాలను, పరిశ్రమలను వెళ్ళ గొట్టి ప్రైవేట్ రంగ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చిదిమేశారన్నారు. ఫలితంగా అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని బీహార్, పశ్చిమ బెంగాల్ సరసన నిలబెట్టారన్నారు.

ఇప్పటికే వేలాదిమంది నిరుద్యోగులు రాష్ట్రం విడిచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తరలి పోయారని, కూలీలు పొట్టతిప్పల కోసం పాలమూరు లేబర్ లా వలసలు పోతూ, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని బాలకోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE