Suryaa.co.in

Editorial

జగన్‌కు మామ బాలినేని ఝలక్

  • వైసీపీలో బాలినేని బాంబు

  • వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

  • అవమానాల పాలయ్యానంటూ బాలినేని ఆవేదన

  • జనసేనలో చేరికకు రంగం సిద్ధం

  • పవన్‌తో భేటీ తర్వాత అధికార ప్రకటన

  • బాలినేని రాజీనామాతో ప్రకాశంలో వైసీపీ ఖాళీ

  • అజాతశత్రువు బాలినేని నిష్క్రమణతో ‘ప్రకాశం’ వైసీపీలో అంధకారం

  • బాలినేనికి చెక్ పెట్టేందుకే చెవిరెడ్డిని దింపిన జగన్

  • బాలినేని హెచ్చరికలు పట్టించుకోని జగన్

  • వైవి సుబ్బారెడ్డితో బాలినేనికి చెక్ పెట్టే జగన్ ఎత్తుగడ బూమెరాంగ్

  • మామనే ముంచిన జగన్ అల్లుడు

  • జగన్ నియంతృత్వం భరించలేకనే నిష్క్రమణ

  • బాలినేని రాజీనామాతో ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి

( మార్తి సుబ్రహ్మణ్యం)

బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఏపీ రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరిది. ఆయన అజాత శత్రువు. పార్టీలకు అతీతంగా ఆయనకు అంతా అభిమానులే. కష్టం ఉందని తెలిస్తే వారివద్దకే నేరుగా వెళ్లడం ఆయన నైజం. తనతో పని ఉందంటే.. కారు ఆపి మరీ బాధితుడి దరఖాస్తుపై, కారుదిగి సంతకం పెట్టేంత మాస్‌లీడర్ ఆయన. అందుకే శీనన్నంటే అందరికీ ఇష్టం.

అన్ని పార్టీలనేతలకు ఆయన అందరివాడు. అందుకే ఆయనంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బోలెడు క్రేజు. మోజు. పైగా ఆయన వైసీపీ అధినేత జగన్‌కు మామ వరస. అయినా దేని లెక్క దానిదే. నీ యవ్వారం సరిగ్గా లేదు అల్లుడూ అని నిర్మొహమాటంగా, అల్లుడు జగన్‌ను హెచ్చరించేంత చనువు. నీ నిర్ణయాల వ ల్ల మేమంతా నష్టపోయామని నిక్కచ్చిగా, అల్లుడినే కడిగేసేంత ధైర్యం ఆయన సొంతం.

అంత ఇమేజ్ ఉన్న బాలినేని.. ఇప్పుడు తన అల్లుడు జగన్ పార్టీ ఫ్యాను రెక్కలు పెడవిరిచి, జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఫలితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి నడిపించే నేతకు దిక్కులేని దుస్థితి. ఒక్క ముక్కల్లో చెప్పాలంటే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి దిక్కు దివాణం లేని విషాదం.

బాలినేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తన నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తానని హామీ ఇచ్చారు. అందుకు భూసేకరణకు 70 కోట్లు అవసరం. దానికోసం ఏళ్ల తరబడి జగన్, ఆయన కార్యదర్శి ధనంజయరెడ్డి చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎన్నికల ముందు ఆ నిధులు విడుదల చేస్తున్నట్లు జీఓ ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. అయితే ధనంజయరెడ్డి, లేకపోతే సజ్జల. అదీ అప్పట్లో బాలినేనికి మిగిలిన అవమానం.

పుండుమీద కారం చల్లినట్లు.. చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరె డ్డి భాస్కరరెడ్డికి ఒంగోలు ఎఐపీ టికెట్ ఇవ్వడం బాలినే ని ఆగ్రహానికి గురిచేసింది. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీ వైసీపీ సీటు, శిద్దా రాఘవరావుకు దర్శి సీటు ఇవ్వాలన్నది బాలినేని డిమాండ్ . చివరకు ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేనినే.. మార్కాపురం నుంచి పోటీ చేయాలని జగన్ ఇచ్చిన ఆదేశాలు, అల్లుడిపై మనసు విరిగేందుకు కారణమయ్యాయి. వైఎస్ జమానా నుంచి ప్రకాశం జిల్లాను శాసించిన బాలినేనిని రాజకీయంగా బలహీనపరిచి.. ఆయనతో ఉన్న శిద్దా రాఘరరావు కుటుంబానికి, ఒంగోలు సీటు ఇస్తానన్న జగన్.. విభజించి పాలించే రాజకీయంపై బాలినేని ఉలిక్కిపడిన వైనం.

అధికారం కోల్పోయిన తర్వాత సైతం.. తనకు అపాయింట్ మెఐట్ ఇవ్వని అవమానాన్ని బాలినేని భరించలేకపోయారు. రాజకీయాలు తెలియని సజ్జల, విజయసాయిరెడ్డితో తనతో జగన్ మాట్లాడించడాన్ని బాలినేని అవమానంగా భావించారు. పైగా తన భిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన.. మాజీ మంత్రి విడదల రజనీని దూతగా పంపిన జగన్ అహంకారం, బాలినేని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఫలితంగా తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేనాధిపతి పవన్ భేటీ తర్వాత, ఆయన జనసైనికుడి అవతారం ఎత్తనున్నారు. దీనితో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ అనాధగా మారనుంది.

LEAVE A RESPONSE