– పంచాయతీలకు ఇంకా సాక్షి పత్రిక
– కూటమి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం రద్దు
– అయినా అమలు కాని సర్కారు ఆదేశాలు
– మంత్రివర్గ భేటీలో బాబు దృష్టికి తెచ్చిన మంత్రులు
– దానితో గ్రామ, వార్డు, సచివాలయ వాలంటీర్ల 200 రూపాయల కేటాయింపు రద్దు
– ‘నిఘా’ విభాగం మొద్దునిద్రపోతుందా?
-క్షేత్రస్థాయి నిజాలు తెలుసుకోదా?
– టీడీపీ సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు
– ఇది జగన్ ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వమా అని విసుర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ సర్కారులో ఆయన భార్య భారతీరెడ్డి చైర్మన్‌గా ఉన్న వైసీపీ అధికారపత్రిక సాక్షి పత్రిక.. ప్రతి పంచాయితీకి అధికారికంగానే వెళ్లేది. దానికి సర్కారు సొమ్మునే దానం చేసిన వైనం రచ్చయింది. అంటే వాలంటీర్లకు అదనంగా ఇచ్చిన 200 రూపాయల కేటాయింపును ప్రశ్నించింది. దానిపై టీడీపీ-జనసేన నేతలు భగ్గుమన్నారు. అసలు ప్రభుత్వ సొమ్మును సాక్షికి ఎలా నేరుగా ఇస్తారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కాకుండా వైసీపీ సాక్షినే ఎందుకు వేస్తున్నారంటూ దుయ్యబట్టింది.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే, పంచాయితీలకు వేస్తున్న సాక్షి పత్రికను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది. దానితో పంచాయతీలకు సాక్షి పత్రిక నిలిచిపోయిందని చాలామంది భావించారు. కానీ ఇప్పటికీ సాక్షి పత్రిక పంచాయతీలకు వెళుతున్న వైనం, టీడీపీ సోషల్‌మీడియా సైనికుల కన్నెర్రకు గురయింది. దానితో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, పంచాయతీలకు ఇంకా సాక్షి పత్రిక వెళుతోందన్న విషయం బయటకు పొక్కింది.
దీనిపై టీడీపీ సోషల్‌మీడియాలో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి.‘ జగన్‌కు బుద్ధి లేదు.. మాకు సిగ్గు లేదు. రాష్ట్రంలో ఉన్నది జగన్ ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వమా?.. ఇక మనం జగన్‌ను ఏమీ చేయలేం. అందుకే అతను ధైర్యంగా జనంలోకి వచ్చి, ప్రభుత్వంపై సవాళ్లు విసురుతున్నాడంటూ కామెంట్ల రూపంలో నిప్పులు కురిపిస్తున్నారు.
ఇదిలాఉండగా.. పంచాయితీలకు ఇంకా సాక్షి పత్రిక వెళుతోందంటూ.. మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఏడాదికి 204 కోట్ల రూపాయలు, పంచాయితీలకు సాక్షి పేపర్ వేయించుకునేందుకు కేటాయించారు. దానికోసం వార్డు, గ్రామ, సచివాలయ వాలంటర్లీకు 200 రూపాయలు అదనంగా కేటాయించింది. అంటే ఆ డబ్బును వాళ్లే చెల్లిస్తారన్నమాట. మున్సిపాలిటీల్లో సైతం ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పత్రిక వేయించుకోవాలని తీర్మానం చేశారు.
అంతేకాదు. జగన్ ప్రభుత్వం ఒక్క సాక్షికే 480 కోట్ల యాడ్స్ ఇస్తే, మిగిలిన అన్ని పేపర్లకు 400 కోట్ల యాడ్స్ ఇచ్చింది. బిల్లులు కూడా సాక్షికే ఇచ్చుకుంది. ప్రభుత్వం మారినా ఇంకా పంచాయతీలకు సాక్షి పత్రిక రావడం ఏమటని’ మంత్రులు, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.
దానికి స్పందించిన చంద్రబాబునాయుడు, సాక్షిని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. అదేవిధంగా సాక్షికి ఇచ్చిన ప్రకటనలపై విచారణ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అందులో భాగంగానే గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు నెలకు 200 రూపాయలు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను, ఉపసంహరించుకునే ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది.
కాగా.. టీడీపీలో చేరిన మాజీ వైసీపీ సర్పంచులున్న పంచాయితీల్లో మాత్రం.. సాక్షిని నిలిపివేశారని, మిగిలిన పంచాయతీల్లో ఆ పద్ధతి కొనసాగుతున్నట్లు మహానాడు సర్వేలో వె ల్లడయింది. ఎందుకంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. దానితో వైసీపీ సర్పంచులే ఏకగ్రీవం అయ్యారు. ఇప్పుడు ఆ పంచాయితీల్లోనే సాక్షి పత్రిక ఇంకా వస్తోంది.
కాగా.. అసలు ఇవన్నీ ముందుగానే తెలుసుకుని, ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన ఇంటలిజన్స్ వ్యవస్థ నిద్రపోతోందా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. నిఘా విభాగం తన పని తాను చేస్తుంటే, తాము సోషల్‌మీడియాలో ఎక్కాల్సిన అవసరం ఎందుకుంటుందని టీడీపీ సోల్జర్స్ ప్రశ్నిస్తున్నారు. ‘క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రులు పంచాయతీలకు ఇంకా సాక్షి వస్తుందని చెప్పేవరకూ సీఎంకు తెలియదంటే, ఇంటలిజన్స్ ఎంతబాగా పనిచేస్తుందో అర్ధమవుతోంది. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఏజీపీల నియామకంలో వైసీపీ వాళ్లనే నియమించారు. దానిపై కూడా నిఘా విభాగం సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు. చంద్రబాబునాయుడై అలిపిరిలో జరిగిన దాడి కేసులో పిటిషనర్ల తరఫున వాదించిన రాజారావు కోడలికి పోస్టు ఇచ్చారు. వైసీపీ కోసం పనిచేసిన లాయర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తారు? టీడీపీ కోసం పోరాడిన వారిని పట్టించుకోరా? సార్‌కు ముఖ్యులనుకునే ఆ ఇద్దరు ఎవరిని సూచిస్తే వారినే స్టాండింగ్ కమిటీ, పీపీలుగా నియమిస్తారా? అంటే దానిపై విచారణ ఉండదా?’ అని టీడీపీ సోషల్‌మీడియా సైనికులు దుయ్యబడుతున్నారు.