– ఈసీ తీరును తప్పుపట్టిన కలకత్తా హైకోర్టు
కలకత్తా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బిజెపి చేస్తున్న నిరాధార ప్రకటనలపై కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. జూలై 4వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే ఎలాంటి ప్రకటనలను ప్రచురించకూడదని జస్టిస్ సబ్యసాచి భట్టాచార్యతో కూడిన సింగిల్ బెంచ్ ఆదేశించింది.
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ లక్ష్యంగా మీడియాలో బిజెపి చేస్తున్న ప్రకటనల ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఈసీ విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తృణమూల్‌పై బిజెపి చేసిన నిరాధార ప్రకటనలు… భారతదేశ పౌరుల స్వేచ్ఛా, ఎన్నికల ప్రక్రియను, హక్కును ఉల్లంఘించేవిగా ఉన్నాయని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై సోమవారం కలకత్తా న్యాయస్థానం స్పందిస్తూ… బిజెపి ప్రకటనలు మోడల్ కోడ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు రెండింటినీ ఉల్లంఘించాయని తెలిపింది. పిటిషనర్ లేవనెత్తిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడంలో భారత ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైంది అని న్యాయస్థానం ఈసీని తప్పుబట్టింది.
ఎన్నికల తర్వాత అందిన ఫిర్యాదులను ఈసీఐ నేటివరకు పరిష్కరించకపోవడంపై కోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియ చాలా దశలు ఇప్పటికే ముగిశాయని, అయినా ఇంతవరకు ఫిర్యాదులను పరిష్కరించడంలో ఈసిఐ ఘోర వైఫల్యం చెందిందని కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వవలసి వస్తుందని హెచ్చరించింది. జూన్ 4వ తేదీలోగా ఫిర్యాదులను పరిష్కరించాలని జస్టిస్ భట్టాచార్య తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వాటిని ప్రచురించవద్దు : హైకోర్టు
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, ప్రింట్ మీడియా మార్గదర్శకాల ప్రకారం … ఎన్నికల సమయంలో నేరుగా లేదా పరోక్షంగా ఎవరైనా అభ్యర్థి లేదా రాజకీయ పార్టీపై నిరాధారమైన ఆరోపణలను ప్రచురించకూడదు. ఎన్నికల సంఘం జారీ చేసిన మోడల్ కోడ్‌ను ఉల్లంఘించే విధంగా వున్న ప్రకటనలు ఏ రూపంలోనూ ప్రచురించకూడదని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.