Suryaa.co.in

Editorial

బండి నోట బాబు మాట!

బీజేపీ-టీడీపీలో సానుకూల స్పందన
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయనేమో తెలంగాణ బీజేపీ దళపతి. ఈయనేమో తెలంగాణలో పార్టీ లేకున్నా, ఏపీలో జనాభిమానానికి తక్కువ లేని ఇంకో జాతీయపార్టీ(?)కి అధిపతి. ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, గత ఎన్నికల ముందువరకూ ఒకే గూటి పక్షులే. తర్వాతే విబేధాలొచ్చి విడిపోయాయి. మళ్లీ ఇప్పుడు తెలంగాణలోని బీజేపీ దళపతి నుంచి ఏపీ పార్టీ అధిపతికి ప్రశంసలు. ఇదే ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో హాట్‌టాపిక్.

తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న మత సంతుష్టీకరణ విధానాలపై విరుచుకుపడే బీజేపీ చీఫ్ బండి సంజయ్.. తన విమర్శల్లో భాగంగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రస్తావన తీసుకువచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ అంశంలో చంద్రబాబు-కేసీఆర్‌ను పోల్చారు. ‘‘ చంద్రబాబుగారు ఉన్నప్పుడు మత ఘర్షణలను కంట్రోల్ చేశాడు. రెచ్చగొట్టే పనులు చేసే అసదుద్దీన్ ఒవైసీ లాంటి వాళ్లను అదుపులో పెట్టేవాడు. బాబు ఎప్పుడూ కులం-మతం-ప్రాంతం అని రెచ్చగొట్టకుండా హుందాగా రాజకీయం చేశాడు. పొత్తైనా గొడవైనా ఓపెన్‌గా పెట్టుకుని దమ్మున్న రాజకీయం చేశాడే తప్ప, మిగతావారిలా చీకట్లో సందుల్లో పొత్తులు పెట్టుకుని పైకి కొట్టుకున్నట్లు నటించే చిల్లర రాజకీయం చేయలేదు’’- ఇదీ సంజయ్ టీడీపీ అధినేత చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతానికి టీడీపీ తమకు మిత్రపక్షం కాకపోయినప్పటికీ, సంజయ్ వాస్తవాలు మాట్లాడారని బీజేపీ నేతలు ప్రశంసిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో పొత్తుతోనే బీజేపీ డిప్యూటీ మేయర్, ఐదు అసెంబ్లీ సీట్లు గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల ముందు తమ పార్టీని సవాల్ చేసి విడిపోయిన బాబు, తర్వాత ఫలితం అనుభవించారని, అయినా అప్పటినుంచి ఇప్పటిదాకా తమ పార్టీపై పల్లెత్తు విమర్శ చేయలేదని బీజేపీ గుర్తు చేస్తున్నారు.

బాబు హయాంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించినందుకే, ఒక్క సంఘటన కూడా జరగలేదన్న వాస్తవాన్ని విస్మరించకూడదని చెబుతున్నారు. మహంతి నగర పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు మజ్లిస్ నేతలకు ముకుతాడు వేసిన ఘనత, టీడీపీదేనని బీజేపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా మజ్లిస్ పట్ల కఠినంగా వ్యవహరించారని వివరిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఏపీలో తమ పార్టీతో ఓపెన్‌గానే బాబు యుద్ధం చేశారని, రెండు సందర్భాల్లో పొత్తు విషయంలో ఎక్కడా దాపరికం లేకుండా వ్యవహరించిన టీడీపీ తమకు ప్రస్తుతం రాజకీయంగా విరోధి అయినప్పటికీ, ఆ పార్టీ అవలంబించిన విధానం మాత్రం మెచ్చదగినదేనని ఓ బీజేపీ రాష్ట్ర నేత వ్యాఖ్యానించారు. హిందువులను అణచివేస్తూ, మజ్లిస్ అనుకూల విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ బండారం బయటపెట్టే క్రమంలోనే, సంజయ్ ఆ వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఆ రకంగా సంజయ్ చేసిన పోలిక సరైనదేనంటున్నారు.

ఈ సమయంలో చంద్రబాబు విధానాలతో పోల్చడం, హిందువుల్లో తమ పార్టీ పట్ల మరింత నమ్మకం పెంచుతుందని చెబుతున్నారు. టీడీపీ-బీజేపీ పొత్తు ఉన్న సమయంలోనే మజ్లిస్‌ను నియంత్రించిన విషయాన్ని విస్మరించకూడదని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి వ్యూహంతోనే మజ్లిస్‌కు మేయర్ దక్కకుండా చేశామని చెబుతున్నారు.

అటు సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ టీడీపీలో కూడా హర్షం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు హయాంలో లా అండ్ ఆర్డర్ బాగుండేదన్న విషయం తాము మొదటి నుంచీ చెబుతున్నామని, ఇప్పుడు సంజయ్ కూడా అదే చెప్పారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘సంజయ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. ఆయన జరిగిందే చెప్పారు. మహంతి గారు సీపీగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఉమ్మడి రాష్ట్ర ప్రజలు చూశారు. ఒక్క
bjp-tdpకర్ఫ్యూ కూడా లేని పాలన అది. కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు కర్ఫ్యూలు పెట్టారో, వైఎస్ వల్ల మత ఘర్షణలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. అలాంటి హైదరాబాద్‌లో శాంతిభద్రల విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్లనే బాబు హయాంలో పెట్టుబడులు వరదలా వచ్చాయి. ఇప్పటి కీర్తికి అప్పటి బాబు కష్టమే కారణం. ఇప్పుడు తెలంగాణలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో మీడియాలోనే కనిపిస్తూనే ఉంది.

మాకూ-బీజేపీకి సైద్ధాంతిక విబేధాలు పక్కనపెడితే, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఒక హైదరాబాదీగా స్వాగతిస్తున్నా’నని టీ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన వ్యాఖ్యానించారు. సంజయ్ చెప్పినట్లు టీడీపీ ఎప్పుడూ రహస్యంగా ఏమీ చేయలేదని, పొత్తయినా, పోరాటమయినా ప్రజలకోసమే చేసిందన్నారు.కాగా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శివారు ప్రాంతాల్లోని డివిజన్లతోపాటు, నగరంలోని ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు బీజేపీకి పనిచేసిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE