Suryaa.co.in

Telangana

బీజేపీ సర్పంచ్ ఉన్నాడని మా ఊరిపై కేసీఆర్ కక్ష కట్టారు

-పెన్షన్లు లేవు, ఇండ్లు లేవు
-బండి సంజయ్ ఎదుట సంతాపూర్ గ్రామస్తుల ఆవేదన
– అంగన్ వాడీ కేంద్రానికి రూ.5 లక్షలు ప్రకటించిన బండి సంజయ్

సార్… మా ఊరిలో పెన్షన్లు ఇవ్వడం లేదు.. రేషన్ కార్డుల్లేవ్.. ఇండ్లు ఇస్తలేడు.. కేసీఆర్ వచ్చినప్పటి నుండి పైసా పని చేయడం లేదు.. మా ఇళ్లు కూలిపోతే సర్పంచ్ ఇంట్ల పోయి తలదాచుకున్నం…. మేం చేసిన పాపమేంది?. బీజేపీ సర్పంచ్ గా ఎన్నికైనమని చెప్పి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది.’’ బండి సంజయ్ ఎదుట సంతాపూర్ గ్రామస్తుల ఆవేదన ఇది…

‘‘అన్నా… మా ఊర్లో డ్రైనేజీ, రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అస్సలు సహకరించడం లేదు. ఇక్కడి ప్రజలు ఎంతో సహకరిస్తున్నారు. కానీ వాళ్లకు అర్హత ఉన్నా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇండ్లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. అంగన్ వాడీ స్కూల్ లేదు. ఒక్క పథకం అందడం లేదు.. ఇంతకంటే దుర్మార్గం ఏముంది?’’అని బండి సంజయ్ ఎదుట సంతాపూర్ సర్పంచ్ బి.అంజయ్య వ్యక్తం చేసిన ఆవేదన ఇది…

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 28వ రోజు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని సంతాపూర్ గ్రామ ప్రజలతో రచ్చ బండ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా తమ సమస్యలను బండిసంజయ్ ఎదుట ఏకరవు పెట్టారు. బీజేపీ నాయకులను సర్పంచ్, ఉప సర్పంచ్ లుగా ఎన్నుకున్నామనే అక్కసుతో టీఆర్ఎస్ ఫ్రభుత్వం తమ గ్రామంపై కక్ష కట్టి ఏ ఒక్క పథకం అమలు కాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ఇండ్లు కూలిపోతే సర్పంచ్ ఇంట్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. భర్త చనిపోయిన మహిళలు ఎంతో మంది ఉన్నా… అర్హత ఉన్న వ్రుద్దులు చాలా మంది ఉన్నా… వారికి మాత్రం పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదన్నారు. ఈ గ్రామానికి అంగన్ వాడీ కేంద్రం కూడా లేదని వాపోయారు.

గ్రామస్తుల సమస్యలను విన్న బండి సంజయ్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. సంతాపూర్ గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం కోసం తన ఎంపీ ల్యాడ్స్ నుండి రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ఫ్రభుత్వం ఉన్నంత కాలం ఇక్కడి ప్రజల పరిస్థితి బాగుపడే అవకాశమే లేదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోతేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. అన్ని పార్టీలకు అవకాశమిచ్చారని… ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు.

LEAVE A RESPONSE