Suryaa.co.in

Telangana

నా చొక్కా పట్టుకుని లాగారు….నానా దుర్భాషలాడారు

– నా హక్కులను హరించిన పోలీసులపై చర్య తీసుకోండి
– కరీంనగర్ సీపీ సహా 4గురు పోలీసులపై లోక్ సభ స్పీకర్ కు బండి సంజయ్ ఫిర్యాదు

పార్లమెంట్ సభ్యునిగా తన హక్కులకు భంగం కలిగించడంతోపాటు, తనకున్న అధికారాలను ఉల్లంఘించిన కరీంనగర్ జిల్లా పోలీస్ కమీషనర్ సహా నలుగురు పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనను అరెస్టు చేసి పోలీస్ కస్టడి లో ఉన్న సమయంలో బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ కు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.

‘‘ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలకు విరుద్ధంగా జారీ చేసిన 317 ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం (జనవరి 2న) రాత్రి 7.30 గంటలకు కరీంనగర్ లోని నా కార్యాలయంలో జాగరణ (రాత్రంతా మేల్కొలుపు) చేసేందుకు సిద్ధమై పోలీసులకు సమాచారం

ఇచ్చాను. అందుకు అనుగుణంగా కొందరు నాయకులు జాగరణ చేస్తుండగా పోలీసు కమీషనర్ సత్యనారాయణ రాత్రి 7:30 గంటలకు పోలీసు బలగాలతో కలిసి పెద్ద సంఖ్యలో నా కార్యాలయానికి వచ్చారు. ఆఫీస్ లోపలి నుండి తాళం వేసి ఉండడంతో సీపీతోపాటు కొందరు అధికారులు నా కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి ఇనుప గ్రిల్స్ ను కత్తిరించి బలవంతంగా నా కార్యాలయంలోకి ప్రవేశించారు.’’అని పేర్కొన్నారు.

‘‘పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నా కాలర్‌ను పట్టుకుని లాగే ప్రయత్నం చేశారు. నేను ప్రతిఘటిస్తుంటే…. నా చొక్కా పట్టుకుని నన్ను లాగారు. మా పార్టీ కార్యకర్తలు నన్ను పోలీసుల బారి నుంచి విడిపించడానికి ప్రయత్నిస్తే….ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ వ్యక్తిగతంగా నన్ను దుర్భాషలాడారు. బెదిరింపులకు దిగుతూ అనుచితంగా ప్రవర్తించారు. జగిత్యాల ఏసీపీ ప్రకాశ్, కరీంనగర్ ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్ స్పెక్టర్ లక్ష్మీబాబు నన్ను బలవంతంగా ఎత్తుకుని పోలీసు వాహనంలోకి తోసి మానకొండూరు పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారు. ’’అని పేర్కొన్నారు.

‘‘నన్ను అరెస్టు చేసిన కారణాలను కూడా పోలీసులు తెలపలేదు. నాపై అక్రమంగా బూటకపు కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పార్లమెంటు సభ్యునిగా నాకున్న ప్రివిలేజెస్ ను ఉల్లంఘించిన పోలీస్ కమిషనర్ సహా ఆయా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’అని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE