Suryaa.co.in

Telangana

మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నవా?

– రాష్ట్రపతి ప్రతినిధిని, రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా?
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం దారుణం. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మంట కలిపేలా ఉంది.

మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నవా? రాష్ట్రపతి ప్రతినిధిని, రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా?సీఎం కేసీఆర్ కు పోయే కాలం దాపురించింది. వినాశకాలే విపరీత బుద్ది. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న శాసనసభ సంప్రాదాయాలు, గౌరవాన్ని మంట కలుపుతున్నారు. సాంప్రదాయాలను, చట్టాలను గౌరవించలేని వ్యక్తికి నైతికంగా ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదు.

రాజ్యాంగానికి లోబడి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారే తప్ప యుద్దం చేసి గెలవలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగంపై నమ్మకం లేనోడు రాజ్యాంగ ప్రతినిధిని గౌరవిస్తాడనుకోవడం అత్యాశే అవుతుంది. రాజ్యాంగంపై నమ్మకం లేకపోతే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి.

శాసనసభలో గవర్నర్ తన ఉపన్యాసంలో ‘మై గవర్నమెంట్’ అని మాత్రమే ఉచ్చరిస్తారే తప్ప, కేంద్ర పథకాలనో, సొంత వ్యాఖ్యానాలను జోడించబోరనే సోయి కూడా సీఎం కేసీఆర్ కు లేకపోవడం శోచనీయం. పంద్రాగస్టు, గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపే ప్రసంగ పాఠంలో మార్పులు చేర్పులు చేసుకుని మాట్లాడే అవకాశం గవర్నర్ కు ఉంటుంది.. కానీ బడ్జెట్ ప్రసంగం విషయంలో ఆ వెసులుబాటు ఉండదు. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని మాత్రమే చదువుతారనే సంగతి కేసీఆర్ కు తెలియదా?

టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన అభివ్రుద్ధి ఏమీ లేనందునే గవర్నర్ ప్రసంగాన్ని దాటవేస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు కన్పిస్తోంది. ఇప్పటికైనా కేసీఆర్ రాజ్యాంగంపై నమ్మకం ఉంచి సభా సాంప్రదాయాల ప్రకారం వ్యవహరించాలి.

కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా… బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమైనా ఉంటే గవర్నర్ ద్వారా సభలో చెప్పించి ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి. టీఆర్ఎస్ శాసనసభ్యులారా…కేసీఆర్ నియంత పోకడలపై మీరైనా ఆలోచించండి. ప్రజాస్వామ్యవాదులారా… కల్వకుంట్ల రాజ్యంగం కావాలా? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా?… ఒక్కసారి ఆలోచించండి.

LEAVE A RESPONSE