Suryaa.co.in

Telangana

బండి సంజయ్ ‘పాదయాత్ర’ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం

-ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ కు ఝలక్
-కేసీఆర్ ను గద్దె దించి 2023లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం
-బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చరిత్రలో లిఖించబడటం ఖాయమని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ అభిప్రాయపడ్డారు. తొలిదశ పాదయాత్ర సక్సెస్ తో బీజేపీ రాష్ట్రంలో మరింతగా బలపడుతోందన్నారు. బండి సంజయ్ పాదయాత్ర పరిణామాలు హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కారణమయ్యాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ నియంత, కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మలిదశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ సన్నాహక సమావేశం జరిగింది. బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తరుణ్ చుగ్ తోపాటు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు జి.ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శులు ప్రకాశ్ రెడ్డి, జయశ్రీ, ఉమారాణి, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, పాదయాత్ర సహ ప్రముఖ్ లు వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, కుమ్మరి శంకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మలిదశ పాదయాత్ర విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై తొలిదశ పాదయాత్రలో పాల్గొన్న పలువురు నేతలు పలు సూచనలిచ్చారు. వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి నవంబర్ 21 నుండి జనవరి 10 వరకు మలిదశ పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీని కలిసి పాదయాత్రకు అనుమతి కోరినట్లు తెలిపారు.
మలిదశ పాదయాత్రలో సగటును 10 నుండి 12 కి.మీల చొప్పున ప్రతిరోజు పాదయాత్ర కొనసాగుతుందని, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజులు పాదయాత్ర జరిపేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అనంతరం తరుణ్ చుగ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ‘దిగ్విజయ యాత్ర’ చేసిన శంకరాచార్యులు, మహాత్మాగాంధీ చరిత్రలో మహనీయులుగా నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి, నియంత, కుటుంబ పాలనను గద్దె దించేందుకు, బీజేపీని అధికారంలో తేవడమే లక్ష్యంగా బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర సైతం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
తొలిదశ పాదయాత్ర సక్సెస్ తోనే కేసీఆర్ కు ఝలక్ ఇవ్వడంతోపాటు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయేనని సంకేతాలు ప్రజలకు పంపగలిగామన్నారు. మలిదశ పాదయాత్రను సైతం ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకెళితే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. ఏదేమైనా ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి కావాలని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE