– హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం
– బీజేపీ గెలిచాక పాతబస్తీలో ’ఘర్ వాపసీ’ అమలు చేస్తాం
– అధికారంలోకి వస్తే అధికారికంగా గణేష్ నిమజ్జనోత్సవాలు
– రాష్ట్రాన్ని ఎంఐఎంకు తాకట్టు పెడుతున్న కేసీఆర్
– ముస్లిం మహిళలు ఓట్లు వేయకుండా ఫత్వా జారీ చేసే కుట్ర జరుగుతోంది
– పాతబస్తీ అందమైన నగరంగా మారాలా? మురికి కూపంగానే కొనసాగాలా… ఆలోచించండి
– హిజాబ్ గురించి మాట్లాడే కుహానా లౌకికవాదులు ‘హర్ష’ను హత్యచేస్తే నోరెత్తరెందుకు?
– ఓట్ల కోసం మసీదు, చర్చ్ లకు వెళ్లే ప్రసక్తే లేదు
– హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సదస్సులో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ గడ్డ… ఇక కాషాయం అడ్డా కాబోతోంది… హైదరాబాద్ పార్లమెంట్ ను బీజేపీ కైవసం చేసుకోబోతున్నం…..అందుకే ఇక్కడి నుండే శంఖారావం పూరిస్తున్నాం. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయబోతున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాతబస్తీలో ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్నిఅమలు చేస్తాం. గణేష్ నిమజ్జనోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం.’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
నగరంలోని చంపాపేట మినర్వా గార్డెన్స్ లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సదస్సు జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, మంత్రి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి సహా పలువురు సీనియర్ నాయకులతోపాటు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
అందులోని ముఖ్యాంశాలు… పాతబస్తీ ఎంఐఎం అడ్డా అట …అక్కడ సభలెందుకని ఆనాడు పోలీసులు చెబితే… మన దమ్మేందో చూపినమా? లేదా? పాతబస్తీలో ఒకనాడు కన్నడ, మరాఠా, గుజరాతీలు ఉండేవాళ్లు. ఇది మినీ భారత్ గా ఉండేది. ఎంఐఎం ఆగడాలు తట్టుకోలేక వాళ్లంతా మూసీనది అవతలకు వెళ్లిపోయారు.
కార్వాన్ లో కాషాయ జెండాను రెపరెపలాడించిన నాయకుడు బద్దం బాల్ రెడ్డి. నిరంతరం హిందూ ధర్మ రక్షకుడు రాజాసింగ్ గోషామహల్ లో జెండాను రెపరెపలాడిస్తుండు. గతంలో మలక్ పేటలో ఇంద్రసేనారెడ్డి గారు గెలిచిండ్రు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోలో నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే సత్తా బీజేపీకి ఉంది. అట్లాంటప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడం పెద్ద కష్టమా? కానేకాదు.
కాశ్మీర్ లో పండిట్లపై ఉచకోత కోసి కొందరు కాశ్మీర్ ను ఆక్రమించుకున్నరు. పాతబస్తీలోనూ అదే మారణకాండను కొనసాగించి హిందువులను వెళ్లగొడుతున్నరు.బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక…. ఎంఐఎం గూండాల అరాచకాలకు భయపడి వెళ్లిన వారందరినీ తిరిగి పాతబస్తీకి తీసుకొస్తాం. వాళ్ళ ఆస్తులను వాళ్లకు అప్పగించేలా చేస్తాం. ఘర్ వాపసీ కార్యక్రమం పాతబస్తీ నుండే స్టార్ట్ చేస్తాం.
దారుస్సలాం ఎవరిది…. రజాకార్లను తరిమికొట్టే తరుణంలో దారుస్సలాంను సర్దార్ వల్లభాయ్ పటేల్ సీజ్ చేసిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో సలావుద్దీన్ ఒవైసీ వెళ్లి దారుస్సలాం అప్పగిస్తే, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తానని చెబితే..నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి దారుస్సలాం భవనాన్ని ఎంఐఎంకు అప్పగించిండు. తెలంగాణను మొదటి నుండి అడ్డుకున్న పార్టీ ఎంఐఎం, ఆగడాలకు పాల్పడ్డ పార్టీ ఎంఐఎం.
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ చంకలోకి ఎక్కే పార్టీ ఎంఐఎం. ఓట్ల కోసం అల్లా గురించి తెల్వకపోయినా మసీదులకు పోయి రాజకీయ నేతల గురించి జాగ్రత్తగా ఉండాలి. నేను మసీదు, చర్చ్ లకు వెళ్లను. వాటి పవిత్రతను దెబ్బతీయలేను. ఎందుకంటే అల్లా, ఏసు క్రీస్తు గురించి నాకు తెల్వదు.
పాతబస్తీని న్యూసిటీలాగా మార్చాలన్నదే బీజేపీ తాపత్రయం. అధికార పార్టీతో చెట్టాపట్టాలేసుకునే ఎంఐఎం ఎందుకు ఇన్నేళ్లుగా పాతబస్తీని అభివ్రుద్ది చేయలేదో ఆలోచించలేదు. మెట్రో లేదు. రోడ్లు సరిగా లేవు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు.
నేనడుగుతున్నా… ఈ కుహానా శక్తులు ఒక ముస్లిం అమ్మాయి కాలేజీ యూనిఫాం వేసుకోవాలని అక్కడి విద్యార్థులు చెబితే… వేసుకోనని నినాదాలు చేస్తూ వెళ్లిపోతే భేష్ అన్న వాళ్లంతా…. యూనిఫాం వేసుకోవాల్సిందేనని పోస్ట్ చేస్తే నా తమ్ముడు హర్షను కత్తులతో పొడిచి చంపితే నోరెందుకు మూసుకున్నారు? మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్న వాళ్లను నేనడుగుతున్నా. 12 శాతం ఓట్లున్న ముస్లిం గురించి అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయో… మరి 80 శాతం ఓట్లున్న హిందువుల గురించి ఎందుకు ఆలోచించరు? హిందువులు చేసిన తప్పేంది?
హైదరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని తీరతాం. తద్వారా హైదరాబాద్ పార్లమెంట్ పై కాషాయ జెండాను రెపరెపలాడించి ఎంఐఎం కోటను బద్దలు కొడతాం. నిఖార్సయిన హిందువని ఫోజులిస్తున్న కేసీఆర్ ను, టీఆర్ఎస్ నేతలను నేనడుగుతున్నా… ముస్లిం పండగలొస్తే… రంజాన్ శుభాకాంక్షలని ఫ్లెక్సీలు కడుతూ శుభాకాంక్షలు చెబుతారే… హిందూ పండగలప్పుడు ఎందుకు ‘హిందూ బంధువులకు దసరా శుభాకాంక్షలు’’అని ఎందుకు ఫ్లెక్సీలు పెట్టరు?
హిందువులు తాము హిందువులని చెప్పుకుంటే మతతత్వమంటారా? దీనికి కారణం మన చేతగానమే. కేసీఆర్ హిందుగాళ్లు…బొందుగాళ్లని అంటే కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్ ను అక్కడ బొంద పెట్టినం. భయపడే ప్రసక్తే లేదు…. కరీంనగర్ లో హిందువుల ఓట్లనే నేను గెలిచిన. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ గెలిచింది ఏ ఓట్లతో? మీరు ఒక్కసారి ఆలోచించండి.
ముస్లిం మహిళల వెనుకబాటు తనానికి ప్రధాన కారణం ట్రిపుల్ తలాఖ్ మూఢత్వ విధానమే కారణం.అందుకే నరేంద్రమోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేస్తే ఎంఐఎం, టీఆర్ఎస్ సమర్ధించడం లేదు. ఇట్లనే ఉంటే ముస్లిం మహిళలు ఓట్లు వేయకుండా ఎంఐఎం ఫత్వా జారీ చేసే ప్రమాదం ఉంది.అందుకే ప్రజలంతా టీఆర్ఎస్, ఎంఐఎం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నరు. ఏ సర్వే చూసినా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారనే తేలిపోయింది. కేసీఆర్ చేసుకున్న సర్వేల్లోనూ ఇదే వెల్లడైంది. అందుకే బీజేపీని బదనాం చేయడానికే హత్య కుట్ర కేసు అంటూ టీఆర్ఎస్ డ్రామాలు చేస్తోంది.
టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు. బీజేపీ కార్యకర్తలంతా జైలుకు వెళ్లేందుకు, లాఠీ దెబ్బలు తినేందుకు సిద్ధం. కేసీఆర్?.. నీ బడ్జెట్ లో జైళ్ల కోసం, అదనపు లాఠీల కోసం నిధులు కేటాయించుకుంటే బెటర్…
1400 మంది యువకులు బలిదానం చేసి సాధించుకున్న తెలంగాణ ఎవరి కోసం.. ఈ అవినీతి, నియంత, కుటుంబ పాలన కోసమా? ప్రజలంతా ఆలోచించాలి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఇదే చివరి ఉద్యమం కావాలి. టీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకలించాలి.
కేసీఆర్ ఇంట్లో సీఎం సీటు కోసం టీవీలు పగులుతున్నయ్. మనవడొచ్చి మా అయ్యను సీఎంను ఎప్పుడు చేస్తవని గోల చేస్తుండట. ప్రజలు తిరగబడుతున్నరు. మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదని తేలిసే… కొడుకు సీఎం చేయాలని కేసీఆర్ ఇంట్లో పెద్ద గోల మొదలైంది. అందుకే ప్రజలను దారి మళ్లించేందుకు, తానేదో దేశ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు కేసీఆర్ డ్రామా చేస్తుండు.
ఎవరూ పిలవకపోయినా తానే ఇతర రాష్ట్రాలకు పోతున్నడు. స్టాలిన్ పుస్తకావిష్కరణ సభకు కూడా కేసీఆర్ ను పిలవలేదు. రాంచీ వెళితే కేసీఆర్ మాట్లాడుతుంటేనే అక్కడి సీఎం సోరెన్ లేచి వెళ్లిపోతుంటే..బలవంతంగా కూర్చోపెట్టిన ద్రుశ్యాలు మీరు చూసే ఉంటారు. కేసీఆర్ మాటలు నమ్మేవాళ్లెవరూ లేరు. నెంబర్ వన్ ద్రోహి. నెంబర్ వన్ అవినీతి పరుడు. ఆప్ ఎమ్మెల్యే కూడా కేసీఆర్ ను నెంబర్ వన్ అవినీతిపరుడు ఆయన మాటలు నమ్మేది లేదని మాట్లాడుతుండు.
తెలంగాణ సమాజం కేసీఆర్ ద్రోహాన్ని గుర్తించింది. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారం ఇచ్చి డబుల్ ఇంజిన్ పాలనను స్వాగతిస్తున్నరు. అసలు కేసీఆర్ ఫాలనలో చేస్తున్నదేమిటి? కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు… ఇవి మాత్రమే ఇంతకు మించి కేసీఆర్ చేసిందేమీ లేదు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో రోడ్లు నిర్మిస్తోంది. గ్రామాలను అభివ్రుద్ధి చేస్తోంది. కిలోకు రూ.29లు ఖర్చు చేసి పేదలందరికీ రేషన్ బియ్యం కేంద్రమే ఇస్తోంది. టాయిలెట్లు, రైతు వేదికలు నిర్మిస్తోంది బీజేపీ. లైట్ల కోసం, హరిత హారం కోసం డబ్బులిస్తోంది బీజేపీనే.
చివరకు కోవిడ్ వస్తే 130 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ కోసం నిధులిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే. అయినా తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదంటూ బదనాం చేస్తూ టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. దీనిని అడుగడుగునా అడ్డుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది.
కేసీఆర్ అవినీతి అందరికీ తెలిసిపోయింది. ఆయన జైలుకు పోవడం ఖాయం. అందుకే జైలుకు వెళ్లకుండా, సానుభూతి సంపాదించేందుకు ఇతర రాష్ట్రాలకు పోతున్న వ్యక్తి కేసీఆర్. ఏడేళ్లుగా ప్రగతి భవన్, ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను రోడ్ల మీదకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దే.
నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులుసహా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ బీజేపీ. 317 జీవో సవరణకు ఉద్యమిస్తే నా పార్టీ కార్యాలయంపై దాడి చేసి జైలుకు పంపింది నిజం కాదా? ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తే టీఆర్ఎస్ గూండాలతో దాడులు చేయించింది టీఆర్ఎస్.
బీజేపీ అధికారంలోకి వస్తే ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించే బాధ్యత తీసుకుంటాం. ఈ హామీలు నేను ఆషామాషీగా ఇస్తున్నది కాదు.నా పాదయాత్రలో విద్య, వైద్యం అందక ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశాను. కేసీఆర్ ఫాలనలో ఇవి అందక కన్నీళ్లు పెడుతున్న ద్రుశ్యాలు చూశాను. అందుకే బీజేపీ పక్షాన ఈ హామీలిచ్చిన.
అంబేద్కర్ జయంతి రోజున పాదయాత్ర రెండో దశ చేయబోతున్నా. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించాలనుకున్నామో… ఆ గొల్లకొండ ఖిల్లా కార్వాన్ని యోజకవర్గంలోనే ఉంది. ఈ నియోజకవర్గంపై కాషాయ జెండా ఎగరేసే అద్బుత సన్నివేశాన్ని త్వరలోనే చూడబోతున్నం.
కేసీఆర్ అవినీతి, నియంత, మూర్ఖత్వ, కుటుంబ పాలన పోవాలనే లక్ష్యంతోనే పోరాడుతున్నం. పాతబస్తీలో బీజేపీ మీటింగ్ పెట్టొద్దా? కాంగ్రెస్, టీఆర్ఎస్ లెక్క భయపడతమా? టైం, ప్లేస్ చెప్పి మరీ పాతబస్తీ అడ్డమీదకొచ్చి జై శ్రీరాం అని గర్జించిన పార్టీ బీజేపీ.
బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరం మాదిరిగా… భాగ్యనగర్ లో భాగ్యలక్ష్మీ ఆలయాన్ని పునర్నిర్మించి తీరుతాం. భాగ్యలక్ష్మీ అమ్మవారు అత్యంత శక్తి వంతమైనది. ఆ తల్లిని దర్శిస్తే వైబ్రేషెన్స్ వస్తాయి. స్వార్ధం లేకుండా కోరే కోర్కెలన్నీ తీర్చే మహాతల్లి.
పాతబస్తీలో బీజేపీ గెలిస్తే మెట్రో నిర్మించి తీరుతాం. హైటెక్ సిటీ మాదిరిగా అందమైన నగరంగా తీర్చిదిద్దుతాం.మురికి కూపాలుగా ఉండాలని కోరుకుంటారా? అందమైన నగరం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి. హిందువుల ఓట్లను తొలగించే కుట్ర ఎంఐఎం చేస్తోంది. ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటింటికీ తిరిగి హిందూ ఓట్లు ఓటర్ లిస్టులో ఉండేలా చూడాలి. ప్రజలారా… నిజాం రజకార్ల పాలన కావాలా? రామరాజ్యం కావాలా? తేల్చుకోండి. టీఆర్ఎస్, ఎంఐఎం తెలంగాణను సర్వనాశనం చేస్తూ రజాకార్ పాలనను తెస్తున్నయ్. అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదాను ఎంఐఎంకు ఇచ్చారు. మండలి ఛైర్మన్ పదవిని కూడా ఎంఐఎంకు ఇచ్చారు. ఇట్లనే చేస్తే రాష్ట్రాన్ని కూడా టీఆర్ఎస్ మజ్లిస్ కు తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అడ్డుకట్ట వేస్తాం. టీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలను బద్దలు కొడతాం. బీజేపీని అధికారంలోకి వస్తాం. రామరాజ్యం తీసుకొస్తాం. బీజేపీ చేసే ఈ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా…