ఆమె ఓ మహిళ. ఆమె పేరు ఆబాది బానో బేగం. “అలీ సోదరులు”గా జాతీయోద్యమంలో విఖ్యాతులైన మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీల తల్లి ఆమె. ఆబాది బానో కూడా స్వాతంత్ర్య సమరయోధురాలు.
“నా దేశంలో కుక్కలు … పిల్లులు కూడా బ్రిటిష్ వారి దాస్యంలో ఉండడానికి వీలులేదు” అని గర్జించిన మహిళ. ఆమెను గాంధీజీ “అమ్మిజాన్” అని పిలువగా జాతీయోద్యమకారులు “బీబి అమ్మా ” అని గౌరవంగా పిలిచేవారు.
ఇక ” గాంధీ టోపీ ” విషయానికొద్దాం,
1919లో గాంధీజీ ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నవాబును కలిసేందుకు రాంపూర్ వెళ్లారు. రాంపూర్ సంస్థానంలో నవాబును కలవడానికి వచ్చే అతిధి ఎవ్వరైనా నెత్తిన టోపీ గాని తలపాగా గాని ధరించి నవాబు సయ్యద్ హమీద్ అలీ ఖాన్ దర్బారుకు రావడం ఆ సంస్థానం సంప్రదాయం. ఆ కారణంగా గాంధీజీ టోపీ కోసం ప్రయత్నించారు. గాంధీజీ కి సరిపడేట్టు ఉండే టోపీ కోసం ఆయన సహచరులు విఫల ప్రయత్నాలు చేశారు.
గాంధీజీ తలకు సరిపోయే టోపీ వారికి దొరకలేదట. అప్పుడు ఆబాది బానో బేగం రంగంలోకి దిగి గాంధీజీ కోసం స్వయంగా సరికొత్త టోపీని కుట్టారట. ఆ టోపీ ధరించి గాంధీజీ రాంపూర్ నవాబును కలుసుకున్నారు.
అప్పటి నుండి సౌకర్యంగా ఉండే ఆ తరహా టోపీని గాంధీజీ ధరించడం ఆరంభించారు. ఆ తరువాతి కాలంలో, ప్రధానంగా ఖిలాఫత్ – సహాయనిరాకరణ ఉద్యమ సమయంలో జాతీయోద్యమకారులు “గాంధీ టోపీ”ని ధరించటం ఆనవాయితి అయ్యింది.
ఆ విధంగా “గాంధీ టోపీ” ధరించడం కూడా ఆంగ్ల ప్రభుత్వాన్ని ధిక్కరించడంగా భావించిన ఆంగ్లేయులు “గాంధీ టోపీ”ని ధరించడాన్ని కూడా నిషేదించారు. అది సాధ్యం కాక పోవటంతో ఆంగ్ల ప్రభుత్వం మిన్నకుండి పోయిందట.
ఈ విధంగా “గాంధీ టోపీ” ఉనికిలోకి వచ్చిందని ప్రముఖ పాత్రికేయులు Mr. Oliver Fredrick 2018 October 20 నాటి Hindustan Times ఆంగ్ల పత్రికలో Lucknow News శీర్షిక క్రింద ఈ చారిత్రక కథనాన్ని పేర్కొన్నారు.