Suryaa.co.in

Editorial

బీజేపీ బాసుపై బీసీ నేత తిరుగుబాటు

– నా పేరును తూర్పు కాపు కార్పొరేషన్‌లో ఎలా సిఫార్సు చేస్తారు?
– నేను కొప్పుల వెలమ.. మరి మరో కులంలో పదవి ఎలా ఇస్తారు?
– నా కులం మార్చి కార్పొరేషన్ పదవి ఎలా ఇస్తారు?
– తూర్పు కాపులకు ఎలా అన్యాయం చేస్తారు?
– పార్టీ ఓబీసీ చైర్మన్ కులమే మీకు తెలియకపోతే ఎలా?
– ఈ నిర్లక్ష్యానికి కారకులెవరో నాకు తెలియాలి
– మీ తప్పుడు నిర్ణయాలకు పదాధికారులకు అపఖ్యాతి
– అసలు మీ సిఫార్సులకు ప్రాతిపదిక ఏది?
– కార్పొరేషన్ పదవులపై పార్టీలో ఏనాడైనా చర్చించారా?
– నలుగురు ఎంపీలు, పదిమ మంది ఎమ్మెల్యేలుంటే చాలనుకుంటున్నారా?
– పార్టీ క్యాడర్‌ను నాశనం చేసినా ఫర్వాలేదా?
– కూటమి ప్రభుత్వం కళ్లు నెత్తికి ఎక్కిందంటూ ట్వీట్
– బీజేపీ సంఘటనామంత్రి మధుకర్‌రెడ్డిపై ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగొల గోపి శ్రీనివాస్ ఘాటు లేఖ
– బీజేపీ నాయకత్వ విధానాలను ఎండగట్టిన బీసీ నేత
– ‘కమలం’లో బీసీ నేత లేఖ కలకలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. ఇది మహేష్ సినిమాలో బీఎల్ నారాయణ డైలాగు. అచ్చంగా అలాంటి ప్రశ్ననే బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, తమ పార్టీ సంఘటనా మంత్రిపై సంధించారు. ‘దీనికి కారకులెవరో నాకు తెలియాల’ంటూ రివర్స్ దాడి చేస్తూ సంధించిన లేఖ, సోషల్‌మీడియాకు లీకై కమలంలో కలకలం రేపుతోంది.

స్వయంగా పార్టీ ఓబీసీ అధ్యక్షుడి కులమే తెలియకుండా.. నామినేటెడ్ పదవులకు, నాయకత్వం మరో కులం కార్పొరేషన్‌కు చేసిన సిఫార్సు, ఆ బీసీనేతకు కోపం తెప్పించింది. ‘‘నేను కొప్పుల వెలమ. మరి నన్ను తూర్పు కాపు కార్పొరేషన్‌లో డైరక్టర్ పదవికి ఎలా సిఫార్సు చేశారు? కీలకమైన ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడైన నాకే ఈ పరిస్థితి ఉంటే, ఇక రాష్ట్రంలో మిగిలిన నాయకుల పరిస్థితేమిటో అర్ధమవుతుంది. ఈ నిర్లక్ష్య ఒంటెత్తు పోకడ నిర్ణయాలకు బాధ్యులెవరో నాకు తెలియాలం’’టూ ఏపీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగొల గోపి శ్రీనివాస్ రాసిన ఘాటు లేఖకు, బీజేపీ నాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది.

స్వయంగా పార్టీ మోర్చా అధ్యక్షుడే తిరుగుబాటు చేయడంతో కమలదళం ఖంగుతినాల్సి వచ్చింది. ఇంతకూ శ్రీనివాస్ వాదన ఏమిటంటే.. కొప్పుల వె లమ కులానికి చెందిన తనకు తూర్పుకాపు కార్పొరేషన్‌లో డైరక్టర్ పదవి ఎలా సిఫార్సు చేస్తారు? దాని వల్ల ఒక తూర్పు కాపు సోదరుడికి నా వల్ల అన్యాయం జరిగినట్లే కదా? ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడి కులం తెలుసుకోకుండానే కార్పొరేషన్లకు పేర్లు ఎలా సిఫార్సు చేసి, పార్టీ పరువు తీస్తార’ని ఆయన వాదన.

సంఘటనా మంత్రి మధుకర్జీకి లేఖ రాయడంతో సరిపెట్టని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ మరూ ట్వీట్ కూడా చేసి, మరింత కలకలం రేపారు. ‘ క్షమించండి. ఈ నియామకంలో నాది బాధ్యత కాదు. కూటమి ప్రభుత్వం కళ్లు నెత్తికి ఎక్కి ప్రియమైన తూర్పు కాపు సోదరులకు ఇవ్వాల్సిన బాధ్యతలో నా పేరు పొరపాటున నమోదు చేసి ఉంటారు’ అని దానిని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సంఘటనా మంత్రి మధుకర్ నూకల, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కు ట్యాగ్ చేశారు. దానితో రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీసీ నేత ప్రశ్నలకు ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. చేసిన పొరపాటుకు చింతిస్తున్నామని చెబుతారా? లేక సంఘటనా మంత్రికి లేఖ రాసినందుకు ఆగ్రహించి వేటు వేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. కాగా దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా శ్రీనివాస్ ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు.

కులం మార్చి నాకు కార్పొరేషన్ ఎలా ఇచ్చారు

LEAVE A RESPONSE