Suryaa.co.in

Andhra Pradesh

డోకిపర్రు మహాక్షేత్రంలో కన్నుల పండువగా కోటి వత్తికా దీపోత్సవం

డోకిపర్రు(గుడ్లవల్లేరు ):కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం కోటి వత్తికా దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది.

ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీవీ కృష్ణారెడ్డి, సుధ దంపతుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మకర్త సుధతోపాటు ఆయ నిర్వాహకులు పి. వీరారెడ్డి, విజయలక్ష్మి , కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు, సుమలత, ప్రసన్న ఇతర కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు , గ్రామ ప్రజలు, భక్తులు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కోటి వత్తికా దీపోత్సవంలో పాల్గొన్న వారికి అవసరమైన పూజా సామాగ్రిని ఆలయ ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధ దంపతులు ఉచితంగా అందచేశారు. కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని మహాక్షేత్రంలో శుక్రవారం ఉదయం అభిషేకం, అర్చన కైంకర్యాులు, ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మహాక్షేత్రంలో వైఖానస భగవత్‌శాస్త్రానుసారంగా కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి వత్తికా దీపోత్సవాన్ని వేద పండితులు నిర్వహించారు.

మహాక్షేత్రంలో నిత్య, పక్ష, మాస, అర్థ సంవత్సర, సంవత్సర ఉత్సవాలు ఆలయ ధర్మకర్తలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం వంటి ప్రత్యేక రోజుల్లో దేశం, రాష్ట్రంతోపాటు ప్రత్యేకంగా డోకిపర్రు పరిసర ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి, పంటలు అభివృద్ధి చెందాలని పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. కార్తీక మాసంలో శివుడు, విష్ణువును ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఎవరికి వారు తమ తమ గృహాల్లో ప్రత్యేకంగా దీపారాధన చేస్తుంటారు.

కార్తీక పౌర్ణమి రోజున తమ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఆయంలో కార్తీక దీపాన్ని ఒకసారి వెలిగిస్తే ప్రతిరోజూ వెయ్యి దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుందని ఆల య పూజారులు , వేద పండితులు వివరించారు. ఇలా చేయటం వల్ల భక్తులకు అష్ట ఐశ్వర్యలు సిద్ధిస్తాయని వేద పండితులు వివరించారు.

కార్తీకమాసం అంటే దీపం. దీపం అంటే దైవస్వరూపం. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా కోటిదీపాలు వెలిగించినట్లే. అందువల్లే కోటి వత్తికా దీపోత్సవాన్ని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఒక్కో ప్రమిదలో 365 వత్తులతో దీపోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. . కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అంకరించారు.

LEAVE A RESPONSE