– బిల్లు ఆమోదం పొందే వరకు సీఎం ఢిల్లీ వదిలి రాకూడదు
– కేబినెట్ లో బీసీలకు ఆరు మంత్రి పదవులు ఇవ్వాలి
– 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి.
– మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: పదో తేదీన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం రిజర్వేషన్లు హామీ ఇచ్చారు. తూతూ మంత్రంగా కేంద్రానికి బిల్లు పంపి చేతులు దులిపేసుకున్నారు. ప్రభుత్వం కేవలం జీఓ ఇస్తే చట్టబద్దత ఎలా వస్తుంది?
అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పారు. సీఎం ఢిల్లీ తిరుగుతున్నారు. కానీ, బీసీలను పట్టించుకోవడం లేదు. బీసీలు భిక్షగాళ్లు కాదు. జీఓ ఇచ్చి ఎవరినో కోర్టుకు పంపి మోసం చేయడం తగదు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంగీకారం కాదు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి.
చిత్తశుద్ధి ఉంటే నామినేటెడ్ పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఉద్యమం తర్వాత బీసీ ఉద్యమమే. బీసీలకు ఎవరు కొట్లాడినా మద్దతు ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల కోసం భూకంపం సృష్టిస్తాం.
బీసీలకు ఒక్క హామీ నెరవేర్చలేదు: మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. కాంగ్రెస్ పాలన అంతా పలాయనం చిత్తగించడమే. 40 శాతం పాలనా గడువు ముగిసినా బీసీలకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బీసీలను మోసం చేస్తున్నారు. అడుగడుగునా నమ్మించి ద్రోహం చేసే పరంపర కొనసాగుతోంది. బిల్లు ఆమోదం పొంది వంద రోజులైనా ఉలుకు, పలుకు లేదు. చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది.
పైసల్లేని శాఖలు :మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బిల్లు ఢిల్లీకి పోకముందే ధర్నాల పేరిట హడావుడి చేశారు. బిల్లు వెళ్ళాక మాత్రం నోరు విప్పడం లేదు. బీసీలను మళ్లీ మోసం చేసేందుకు రిజర్వేషన్ల కోసం జీఓ అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని జీఓ ఇస్తే సరిపోతుందా? పైసల్లేని శాఖలు, ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చి బీసీలు అవమానపరచడం తప్ప ఇంకేమీ లేదు.ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారని మంత్రి శ్రీహరి స్వయంగా చెప్పారు.
అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి: మాజీ మంత్రి గంగుల కమలాకర్
శాస్త్రీయ పద్ధతిన వెళ్లాలని అసెంబ్లీ వేదికగా చెప్పాం. తమిళనాడు తరహాలో అందరమూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్పాను. తమిళనాడు తరహాలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పనిచేయడం లేదు? ప్రధాని వద్దకు ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి.
బిల్లు ఆమోదం పొందే వరకు సీఎం ఢిల్లీ వదిలి రాకూడదు. మేం సహకరిస్తాం. కేబినెట్ లో బీసీలకు ఆరు మంత్రి పదవులు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి అది చేసి చూపాలి. 32 జిల్లా పరిషత్ లలో 13 బీసీలకు కేటాయించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే వెళ్లాలి.లేదంటే రేవంత్ రెడ్డి సర్కార్ కబడ్డార్ అని హెచ్చరిస్తున్నాం.
రాష్ట్రపతిని కలవాలి: మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
బిల్లు పాస్ అయిందని సన్మానం చేయించుకున్నారు. తెల్లారి దిల్లీలో ధర్నా చేశారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గవర్నర్ బిల్లు ఆమోదించకుండా… ఆయన పేరిట ఉత్తర్వు ఎలా ఇస్తారు? ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలవాలి. ఇప్పటికైనా మాయమాటలు చెప్పకుండా అన్ని స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి
మరోమారు మోసం: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైంది. చేతిలో ఉన్న పదవులు కూడా ఇవ్వకుండా బీసీలకు మోసం చేస్తున్నారు. ప్రెస్ మీట్ లో కిషార్ గౌడ్ ,శుభ ప్రద్ పటేల్ ,పల్లె రవికుమార్ గౌడ్ ,బాలరాజు యాదవ్ ,సుమిత్రానంద్ తదితరులు పాల్గొన్నారు.