– ఆర్టీసీ సమ్మె పాపం కాంగ్రెస్ సర్కార్‌దే
– తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమ్మె పరిస్థితులపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ ఇవాళ అస్తవ్యస్తంగా తయారైందంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు వైఖరే.
ఎన్నికల వేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కార్మికులకు ఆశ చూపి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి గారు.. అధికారంలోకి వచ్చాక వారిని నడిరోడ్డుపై నిలబెట్టారు. ఏడాది కాలంగా కార్మికులు తమ సమస్యల కోసం మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా, ఇప్పుడు సమ్మెకు దిగగానే ‘కమిటీల’ పేరుతో కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఇది కార్మికులను మోసం చేయడం కాదా?
ఉచిత బస్సు పథకం అని గొప్పలు చెప్పుకున్న రేవంత్ సర్కార్.. ఆ పథకానికి రావాల్సిన రూ.400 కోట్ల బకాయిలను ఆర్టీసీకి విడుదల చేయకుండా సంస్థను కావాలనే దివాలా తీయిస్తోంది. ఇవాళ బస్సులు లేక సామాన్య మహిళలు, గర్భిణీలు, వృద్ధులు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో పడుతున్న అవస్థలు చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేని ఈ చేతకాని ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలతో, ప్రయాణాలతో చెలగాటమాడుతోంది. కరీంనగర్లో జరిగిన బస్సు ప్రమాదమే దీనికి నిదర్శనం.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యను పరిష్కరించాల్సింది పోయి, అహంకారంతో మాట్లాడుతున్నారు. చర్చల పేరుతో పిలిచి మళ్ళీ గడువు అడగడం అంటే కాలయాపన కాక మరేమిటి? కార్మికులపై ఆంక్షలు పెట్టడం, యూనియన్లను అణచివేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడానికి మీకు ఎందుకు అంత భయం?
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎన్నికల హామీ ప్రకారం ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి.
పెండింగ్‌లో ఉన్న 400 కోట్ల బకాయిలను విడుదల చేసి సంస్థను ఆదుకోవాలి. అద్దె బస్సు డ్రైవర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి. కార్మికులారా.. మీరు చేస్తున్న ఈ ధర్మపోరాటానికి బిజెపి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మొండివైఖరి వీడి వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకొని సమ్మెను విరమింపజేయాలి.