• జగన్ ప్రభుత్వాన్ని సొంత కుటుంబ సభ్యులతోపాటు ఎవరూ విశ్వసించడం లేదు
• కబ్జా చేసిన భూములు రేట్లు పెంచుకోవడానికి విశాఖ రాజధాని అంటూ ప్రచారం
• పరదాలు, బారికేడ్లు లేకపోతే ముఖ్యమంత్రి బయటకు రాలేరు
• హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం జరగదనే వివేకానంద రెడ్డి హత్య కేసును సుప్రీం కోర్టు తెలంగాణకు బదిలీ చేసిందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ పేర్కొన్నారు. సొంత బాబాయి కేసు పక్క రాష్ట్రానికి బదిలీ అయినందుకు జగన్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేని అసమర్థరీతిల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు.
మంగళవారం హైదరాబాద్ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో బైట్ ఇచ్చారు. ఈ సందర్భంగా సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ “జగన్ రెడ్డి నీ, ఆయన ప్రభుత్వాన్ని సొంత కుటుంబ సభ్యులతోపాటు ఎవరూ నమ్మడం లేదు. కోడికత్తి డ్రామా కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదని చెప్పి హైదరాబాద్ లో ఎలా అయితే చికిత్స చేయించుకున్నారో… ఆయన కుటుంబ సభ్యులు కూడా జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేదని సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కూడా జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక తెలంగాణ సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసును బదిలీ చేసింది.
రేపు… ఎల్లుండు… అని రెండేళ్ల నుంచి చెబుతున్నారు
రేపటి నుంచి విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తాం. విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని రెండేళ్లుగా చెప్పడం తప్ప… ఇక్కడ నుంచి పాలన మొదలైన పాపాన పోలేదు. మీరు కబ్జా చేసిన భూములకు రేట్లు పెంచుకోవడానికి విశాఖ రాజధాని అని చెప్పడం, ఆ తరువాత వాయిదా వేయడం మామూలే. విశాఖపట్నం రాజధాని పేరిట నాయకులు అందరూ కలిసి ప్యాకేజీలుగా విభజించి దోచుకున్నారు. దసపల్లా భూములు, రుషికొండ, ఆంధ్రా వర్సిటీ భూములు… ఇప్పుడు లేటెస్టుగా వన విహార్ భూములు ప్యాకేజీలుగా విభజించి దోచుకున్నారు. కబ్జా చేసి దోచుకున్న భూముల్లో రాజధాని కోసం బిల్డింగులు కడతారా? లేక బెదిరించి లాక్కున్న భూముల్లో రాజధాని నిర్మిస్తారో నాయకులే చెప్పాలి.
ఆయన పరదా రెడ్డి
వైసీపీ నాయకులు మాట్లాడితే… వాళ్ల అధినాయకుడిని సింహంతో పోల్చుకుంటున్నారు. సింహం సింగల్ గా వస్తుందని మాట్లాడుతున్నారు. ఆయన సింహం కాదు పరదా రెడ్డి. పరదాలు, బారికేడ్లు లేకుంటే బయటకు రాని మీ నాయకుడే సింహం అయితే పోలీసులు అడ్డుకున్న ఇప్పటంలో తిరిగిన మా నాయకుడిని ఏమంటారు? కనీసం సొంత నియోజకవర్గంలో కూడా పరదాలు, బారికేడ్లు లేకుండా ముఖ్యమంత్రి పర్యటించగలరా? ముఖ్యమంత్రిని తప్ప వైసీపీ నుంచి గెలిచిన 150 మందిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రజలకు ప్రతినిధులా? లేక జగన్ రెడ్డి అడుతున్న అబద్ధాలకు వంతపాడే నాయకులా? ప్రజలకు సమాధానం చెప్పాలి.
కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అంబటి, అమర్ నాథ్ లకు పవన్ కళ్యాణ్ ని తిట్టడం తప్ప మరో పని లేనట్లు ఉంది. తిట్టడానికే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చినట్లు ఉంది. వాళ్ల శాఖలో చేయాల్సిన పనులను కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ని మాత్రమే తిట్టడం పనిగా పెట్టుకున్నారు. వీళ్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే? కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల ఆడియోలు, వీడియోలే ఎందుకు బయటకు వస్తున్నాయి? మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన నాయకుల వీడియో, ఆడియోలు ఎందుకు బయటకు రావడం లేదు? విజయసాయిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి అవి ఎందుకు బయటకు రావడం లేదో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్క సారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఏళ్లు మేము అధికారంలో ఉండాలి అనే ఆలోచించే పార్టీ జనసేన కాదు. ప్రజల కోసం ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ జనసేన. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను నాశనం చేయాలని మీరు టార్గెట్ గా పెట్టుకుంటే… రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దాలనే సంకల్పంతో వచ్చిన పార్టీ జనసేన పార్టీ. రేపు కచ్చితంగా అధికారంలోకి వచ్చే తీరుతాం. రాష్ట్రానికి బంగారు భవిష్యత్తును అందిస్తాం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ మనీలో దూసుకుపోతుంటే… మన రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ సొమ్ము రాత్రికి కట్టలు కట్టి.. బాక్సుల్లో ఎవరెవరికీ ఎంత ప్యాకేజీ వెళ్లాలో అంత వెళ్లిపోతుంది. మద్యపాన నిషేధం అని పెద్ద మాటలు చెప్పిన జగన్ రెడ్డి… రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నార”ని చెప్పారు.