జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుటిల రాజనీతిపై సుప్రీం కోర్టు చన్నీళ్ళు చల్లింది

అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుటిల రాజనీతిపై సుప్రీం కోర్టు చన్నీళ్ళు చల్లింది. అమరావతి రాజధాని వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి 3న తీర్పు ఇచ్చింది. నెల, మూడు నెలలు, ఆరు నెలల గడువుల్లో చేయాల్సిన నిర్మాణ పనులకు సంబంధించి నిర్ధిష్టమైన కార్యాచరణపై ఆదేశాలు జారీ చేసింది. తీర్పును శిరసావహించి, అమలు చేయడానికి కార్యాచరణ చేపట్టి, గడువు పెంచమని హైకోర్టుకు విన్నవించుకొని ఉండవచ్చు, లేదా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మార్చి నెలలోనే సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి, మధ్యంతర ఉత్తర్వులిమ్మని కోరిఉండవచ్చు. అలా చేయలేదు. హైకోర్టు విధించిన ఆరు మాసాల గడువు ముగిసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఒక సామాన్యుడిగా నాకొచ్చిన ధర్మ సందేహం: స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంలో ప్రభుత్వ ఆలస్యాన్ని మన్నించి, సుప్రీం కోర్టు అనుమతించడం వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ, నిర్మాణ పనుల విషయంలో హైకోర్టు విధించిన గడువు ముగిసిన తరువాత కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాట వరసకు కూడా హైకోర్టు తీర్పును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా! గడువును పెంచమని అడిగితే తిరస్కరించబడిందా! అని ఒక్క మాట కూడా అడగకుండా సుప్రీం కోర్టు “స్టే” మంజూరు చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. దీని వల్ల కోర్టు ధిక్కరణ కేసు నుండి రాష్ట్ర ప్రభుత్వం బయటపడవచ్చు. అంతే! అంతకు మించిన ఊరట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో లభించలేదు.

వికేంద్రకరణ చట్టం, సీఆర్డీఏ సవరణ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నదని, అమరావతే రాజధాని మరియు హైకోర్టు అమరావతిలోనే ఉన్నదని ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టులో విన్నవించడం జరిగింది. ఈ పూర్వరంగంలో ఈ కేసులో తీర్పు వచ్చేంత వరకు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వంలోని పెద్దలు, పాలక పార్టీ నేతలు – శ్రేణులు సంయమనం పాటిస్తే రాష్ట్రానికి మేలు.

టి. లక్ష్మీనారాయణ,
సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply