Suryaa.co.in

Andhra Pradesh

పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి

-దేశంలో అవకాశాలు పుష్కలం
-నైపుణ్యాలు పెంచుకుని సద్వినియోగం చేసుకోండి
-దేశాభివృద్ధిలో భాగం కండి
-యువతకు భారత పూర్వ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు పిలుపు
-స్వావలంబి భారత్ అభియాన్ కార్యశాల ప్రారంభం

విజయవాడ: ఉద్యోగాల్లో స్థిరపడితే చాలని యువత సరిపెట్టుకోకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలో యువజనాభాకు, ప్రతిభావంతులకు కొదవ లేదని, వారికి పరిశ్రమల స్థాపన, వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించగలిగితే అద్భుతాలు చేసి చూపించగలరని చెప్పారు.

ఔత్సాహికులకు స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపన, వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో విజయవాడ సమీపంలో ఆత్కూర్ లోని స్వర్ణ భారత్ ట్రస్టులో రెండు రోజుల కార్యశాలను శనివారం వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు. స్వావలంబి భారత్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లోని 20 జిల్లాల నుంచి ఔత్సాహికులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తున్నామని, ఇందుకు నైపుణ్యాభివృద్ధి చాలా అవసరమని తెలిపారు. జ్ఞానాన్ని దైనందిన అవసరాలు తీర్చేలా ఆచరణాత్మకంగా మలుచుకోవడమే నైపుణ్యమని వివరించారు.

‘‘యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తే, ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. వారికి ఉద్యోగాలు లభించడంతో పాటు పారిశ్రామికవేత్తలుగానూ రాణించే అవకాశం ఉంది. స్కిల్ ఇండియా, స్వావలంబిభారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు ఇందుకు దోహదం చేస్తాయి. ఇటువంటి కార్యక్రమాలతో భారత్ త్వరలోనే ప్రపంచంలోనే గొప్ప శక్తిగా అవతరించగలదు.’’ అని చెప్పారు.

ప్రస్తుతం మనం స్వరాజ్య అమృత మహోత్సవాలను జరుపుకుంటున్నామని చెబుతూ 75 ఏళ్ళ స్వాతంత్ర్య భారతంలో ఇంకా కొన్ని సమస్యలు అలానే ఉండిపోవటం విచారకరమన్నారు. అయితే నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. ఉపాధి పరంగా చూస్తే యువతరం ఉద్యోగాల వైపు ఆకర్షితులౌతున్నారని, అందులో తప్పేం లేదని, అయితే తమ ప్రతిభకు నైపుణ్యాన్ని జోడించి, కొత్త ఆలోచనలతో తామే యజమానులుగా ఎదగగలమనే విషయాన్ని కూడా వారు గుర్తించాలని సూచించారు. ఈరోజు ప్రపంచంలో అగ్ర పారిశ్రామికవేత్తలుగా ఉన్న ఎంతో మంది పేద కుటుంబాల నుంచి వచ్చిన వారేనని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. వారి ప్రతిభ, నైపుణ్యం కారణంగా ప్రపంచం వారి గురించి చెప్పుకునే విధంగా ఎదిగారని తెలిపారు ‘‘మీరు ఉద్యోగాలు చేస్తే… మీ కుటుంబానికి మాత్రమే ఆసరాగా నిలబడగలరు. మీ నైపుణ్యంతో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే మరెంతో మందికి ఆసరాగా మారతారు. ఈ దిశగా యువత ఆలోచించాలన్నదే నా ఆకాంక్ష.’’ అని చెప్పారు.

మన దేశంలో ఎన్నో అవసరాలు ఉన్నాయని, వాటికి సంబంధించిన ఎన్నో వస్తువులను మనం దిగుమతి చేసుకుంటూనే ఉన్నామని చెబుతూ ఈ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఫలితంగా ఇటీవల కరోనా సమయంలో వైద్య రంగానికి సంబంధించిన ఎన్నో ఉపకరణాలను, వస్తువులను మన యువత దేశానికి అందించగలిగిందన్నారు.

‘‘అవకాశాలు ఇస్తే… కష్టపడే తత్వం ఉన్న యువతరం మన భారతదేశం సొంతం. అందుకే ఇప్పుడు ప్రపంచంలో అనేక పెద్ద పెద్ద సంస్థలు మన భారతీయుల చేతుల్లోనే ఉన్నాయి. క్రమంగా భారతదేశం మీద ప్రపంచ దేశాలకు పెరుగుతున్న నమ్మకం మరో కారణం.’’ అని తెలిపారు.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా యువత ఎదిగేలా స్వావలంబి భారత్ అభియాన్ ప్రోత్సహించటం ఆనందదాయకమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక నమూనాలను పరిశీలించి మేలైన వాటిని ఎంపిక చేసి, యువతలో స్ఫూర్తిని నింపటం గొప్ప ఆలోచన అని అభినందించారు. కేవలం ఆలోచనలను పంచుకోవడానికే పరిమితం కాకుండా యువతకు అండగా నిలబడటం ద్వారా స్వావలంబి భారత్ అభియాన్ భారతదేశ అభివృద్ధి గాథలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా ఇదే స్ఫూర్తితో రూపొందించారని, యువతకు చిన్నతనం నుంచే వివిధ నైపుణ్యాల మీద అవగాహన కల్పించటం, నేర్పించటం ద్వారా వారి భవిష్యత్ జీవితానికి చక్కని బాటలు పడతాయని తెలిపారు.

తమకు చిన్నతనంలో క్రాఫ్ట్ క్లాస్ అని ప్రత్యేకంగా ఉండేదని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. అందులో వివిధ చేతివృత్తులను నేర్పించే వారని, అదే విధంగా చదువుతో పాటు నైపుణ్యాన్ని యువతలో పెంచాలని సూచించారు. భారతదేశ గ్రామాలు కళలకు నిలయాలంటూ అనేక వృత్తుల వారికి ఆలవాలమని చెప్పారు. వారి జీవనం నుంచి ఎన్నో అంశాలను మనం నేర్చుకోవచ్చని, ముఖ్యంగా ఇతరుల మీద ఆధారపడకుండా గ్రామాలు మనుగడ సాగిస్తున్న విధానాలు మనకు ఆదర్శనీయమైనవని చెప్పారు.

మహాత్మా గాంధీ సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా చెప్పేవారని, గ్రామాలు ఆర్థికంగా పరిపుష్టం చెందినప్పుడే నిజమైన దేశాభివృద్ధి జరిగినట్లు అని చెప్పేవారన్నారు. ఈరోజు మనం చెబుతున్న అభివృద్ధి గ్రామాల వరకూ చేరాలని, గ్రామాలకు, పట్టణాలకు మధ్య ఉన్న అంతరాలు తొలగి, అవకాశాల కల్పన గ్రామాల నుంచే ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. ఈ మార్గంలో సాంకేతికత అత్యంత కీలకమైనది. ప్రస్తుతం రోబోటిక్స్, కృత్రిమమేథ , డ్రోన్లు వంటి వాటి ద్వారా ఖర్చులు తగ్గుతున్నాయని, వ్యవసాయం రంగంలో కూడా డ్రోన్ల వాడకం పెరుగుతోందని గుర్తు చేశారు.

ఇలాంటి వాటి మీద యువత దృష్టి కేంద్రీకరించాలని, ముఖ్యంగా భారతదేశానికి ప్రధానమైన వ్యవసాయం రంగంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను తగ్గించే ఉపకరణాల మీద పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రయోజనాన్ని అందిస్తూ ముందుకు వచ్చే నూతనత్వాన్ని ప్రపంచం ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంటుందని చెప్పారు. అందుకే తమదైన ప్రత్యేకతతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో సానుకూల మార్పులకు బీజం వేసే ఉత్పత్తులను తీసుకొచ్చే విధంగా పరిశోధనాత్మకంగా యువత నూతన పరిశ్రమలను ప్రారంభించాలన్నారు.

యువతను పారిశ్రామికంగా ప్రోత్సహిస్తున్న స్వావలంబి భారత్ చొరవను అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ చంద్రమౌళి, స్వావలంబి భారత్ అభియాన్ నుంచి అంజనీ శ్రీనివాస్, లింగమూర్తి, కాకాని పృథ్వీరాజు, లఘు ఉద్యోగ భారతి నుంచి అన్నే కృష్ణ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE