* వచ్చే నెల 8న రాష్ట్ర జయంతి కల్యాణదుర్గంలో నిర్వహణ
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* బీసీ హాస్టళ్లకు రూ.60 కోట్ల విడుదలపై హర్షం
* సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సవిత
అమరావతి : సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస జయంతిని వచ్చే నెల ఎనిమిదో తేదీన రాష్ట్ర జయంతిగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్ర జయంతిని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించనున్నామని, ఈ ఉత్సవానికి మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ మేరకు గురువారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు.
సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస తన కీర్తనలు, రచనలతో సమాజంలో అసమానతులపైనా, కుల వ్యవస్థపైనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కనకదాస చేసిన సేవలు శ్లాఘనీయమన్నారు. అటువంటి మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనందకరమన్నారు.
గతేడాది అనంతపురంలో భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయింతిని నిర్వహించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతిని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండ్రోజుల్లో కూటమి ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపారు.
వచ్చే నెల ఎనిమిదో తేదీన అన్ని జిల్లాల్లోనూ భక్త కనకదాస జయంతి నిర్వహించేలా ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొననున్నట్లు వెల్లడించారు. ఈసారి కల్యాణదుర్గంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంత్యోత్సవంలో మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారని మంత్రి సవిత తెలిపారు.
సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు
అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వం బీసీ హాస్టళ్లను గాలికొదిలేసిందన్నారు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించకపోగా, కనీసం హాస్టల్ మరమ్మతులకు కూడా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.
ఇప్పటికే హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంటిలో ఎంతమంది విద్యార్థులకు అందరికీ ఆ పథకాన్ని వర్తింపజేశామన్నారు. హాస్టళ్లలో భద్రతకు సీసీ కెమెరాలు, పరిశుద్ధమైన తాగునీటి కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తున్నామన్నారు.
గురుకుల పాఠశాలల్లో పే ఫోన్లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో విద్యార్థులకు ఫోన్ లో మాట్లాడే అవకాశం కల్పించామన్నారు. బీసీ హాస్టళ్ల నిర్మాణాలకు రూ.60 కోట్లు మంజూరు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు బీసీ పక్షపాతి అని మరోసారి రుజువైందని ఆ ప్రకటనలో మంత్రి సవిత తెలిపారు.