Suryaa.co.in

Editorial

చిక్కుల్లో భారతి?

– వివేకా హత్య వార్తపై మళ్లీ మొదలైన రచ్చ
– సాక్షి విలేకరి హత్యను వీడియో తీశాడన్న సునీత
– ఆ గది నుంచే సాక్షికి ఫోన్లు వెళ్లాయన్న ఆరోపణ
– గుండెపోటు ప్రచారం కూడా సాక్షిదేనన్న సునీత
– వివేకా హత్య అప్‌డేట్స్ భారతీకి ఎలా వెళ్లాయని సునీత ప్రశ్న
– సాక్షి చైర్మన్ భారతిని విచారించాలని డిమాండ్
– భారతిని సీబీఐ విచారిస్తుందని ఇటీవలే జోస్యం చెప్పిన గోనె ప్రకాష్
– గతంలో భారతి ఫోన్లు పరిశీలించాలని డిమాండ్ చేసిన టీడీపీ
– ఇప్పుడు మళ్లీ సునీత వంతు
– జగన్‌కు మోదీ అండదండలున్నాయని ఆరోపణ
– సునీత.. టార్గెట్ భారతి?
– భారతీరెడ్డి పాత్రను తెరపైకి తీసుకురావడమే సునీత లక్ష్యమా?
– పవర్‌పాయింట్ ప్రెజంటేషన్‌తో సుస్పష్టం
– ఎన్నికల ముందు ‘గొడ్డలి’ గత్తర
– వైసీపీలో గొడ్డలి గుబులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

వదిన భారతి లక్ష్యంగా మరదలు డాక్టర్ సునీత అడుగులు వేస్తున్నారా? తండ్రి వివేకా హత్య కేసులో దొరికిన ఆధారాలు, సీబీఐ సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా భారతిని, ఆమె చైర్మన్‌గా ఉన్న సాక్షి మీడియాను టార్గెట్ చేయబోతున్నారా? వివేకా గుండెపోటుతో చనిపోయారన్న వార్త నుంచి అవినాష్ ప్రకటనల వరకూ, సాక్షిలో వచ్చిన అబద్ధప్రచారాన్ని సునీత మరోసారి రచ్చ లాంటి చర్చకు కావాలనే తెర లేపారా? జగన్‌ను మోదీ కాపాడుతున్నారన్న ప్రచారంతో, అటు బీజేపీని సునీత సంకటంలో పడేశారా?.. ఒక నారీ వందతుపాకుల మాదిరిగా సునీత సంధిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు ఎన్నికల సమయంలో ‘ఫ్యాను’కు గాలి రాకుండా చెమటలు పట్టిస్తున్నాయి.

అందరూ మర్చిపోయిన వివేకా హత్య కేసును, ఆయన బిడ్డ డాక్టర్ సునీత మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారు. అటు పీసీసీ చీఫ్ షర్మిల కూడా.. తన ఎన్నికల ప్రచారంలో వివేకాను, వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డే హత్య చేయించారంటూ విరుచుకుపడతుండటంతో, జనం దృష్టి సహజంగా వివేకా హత్యపై మళ్లుతోంది. దానిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి.. ఎన్నికల్లో అదే ప్రధాన ప్రచారాంశం చేయాలన్న లక్ష్యంతో, ఆయన బిడ్డ డాక్టర్ సునీత గుండెధైర్యంతో వేస్తున్న అడుగులు, వైసీపీని హడలెత్తిస్తోంది. ఆమె తాజాగా లేవనెత్తిన ప్రశ్నలు, సందేహాలన్నీ జగన్ భార్య భారతీరెడ్డిని కేంద్రంగా చేసుకునే కావడం ప్రస్తావనార్హం.

అందులో భాగంగా ఇప్పటివరకూ అవినాష్‌రెడ్డిని లక్ష్యంగా విమర్శిస్తూ వస్తున్న సునీత, ఇప్పుడు హటాత్తుగా కొత్తకోణంలో.. జగన్ భార్య భారతీరెడ్డిని టార్గెట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. తండ్రి వివేకా హత్య నేపథ్యంలో, హైదరాబాద్ వేదికగా డాక్టర్ సునీత ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలిస్తే.. ఇకపై ఆమె లక్ష్యం భారతీరెడ్డి అన్నది స్పష్టంగా కనిపిస్తుంది.

అందులో సునీత ఇప్పటివరకూ ప్రస్తావించని భారతీరెడ్డి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. వివేకా హత్యను సాక్షి విలేకరి వీడియోతీశారన్న సునీత ఆరోపణ నిజానికి కొత్త కోణం. ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఎవరూ ప్రస్తావించలేదు. ఏ మీడియానూ రిపోర్టు కాలేదు. ‘‘సాక్షి విలేకరి తీసిన వీడియోను భాస్కర్‌రెడ్డికి పంపించారు. 2019 మార్చి 15న ఉదయం 7.44 నిమిషాలకు సాక్షిలో వివేకా గుండెపోటుతో మృతి అని ప్రసారం చేశారు’’ని సునీత బాంబు పేల్చి సాక్షి చైర్మన్‌గా ఉన్న భారతీరెడ్డిని ఇరుకున పెట్టింది.

దానికి కొనసాగింపుగా.. ‘‘వివేకా హత్య జరిగిన గది నుంచే సాక్షికి సమాచారం వెళ్లింది. సాక్షికి గుండెపోటు అని సమాచారం ఇచ్చింది ఎవరు? హత్యకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ సాక్షికి ఎవరిచ్చారు. అసలు దీనికి కారణమైన సాక్షి చైర్మన్ భారతిని సీబీఐ ఎందుకు విచారించలేదు? ఆమెను విచారించాలి కదా’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

నిజానికి కొద్దికాలం క్రితం కడపలో జరిగిన వివేకా వర్థంతి కార్యక్రమంలో సునీత కొన్ని కీలక అంశాలను మీడియా వద్ద ప్రస్తావించారు. ఆ సందర్భంలో డాక్టర్ సునీత.. సాక్షి చైర్మన్ భారతీరెడ్డికి కొన్ని ప్రశ్నలు వేసినా, అది ఏ కారణం వల్లనో పెద్దగా వెలుగుచూడలేదు.
‘మా తండ్రిని మేమే చంపించామని మీరు నా మీద-నా భర్త మీద రాస్తున్నారు కదా? అదే నిజమైతే ఇప్పటిదాకా మీరు ఆ ఆధారాలను పోలీసులకు గానీ, సీబీకి గానీ ఎందుకివ్వలేదు? ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా? ఇప్పటికయినా మీ వద్ద ఉన్న ఆధారాలు పోలీసు-సీబీఐకి ఇవ్వండి. లేదా పోలీసులు-సీబీఐ అధికారులే ఆమె వద్ద ఉన్న ఆధారాలు తీసుకోవాలని’’ సునీత అప్పుడే డిమాండ్ చేశారు.

మళ్లీ ఇప్పుడు కీలమైన ఎన్నికల ప్రచారంలో సునీత.. సాక్షి చైర్మన్‌గా ఉన్న తన వదిన భారతీరెడ్డి లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు, సంచలనం సృష్టిస్తున్నాయి. హత్య జరిగిన వైనాన్ని సాక్షి విలేకరి వీడియో తీశారని చెప్పడంతోపాటు, హత్య జరిగిన గది నుంచే సాక్షికి ఫోన్లు వెళ్లాయన్న సునీత ఆరోపణలు, ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

‘‘ఒక సాధారణ విలేకరి ఒక వ్యక్తిని హత్య చేస్తుంటే వీడియో తీసేంత ధైర్యం చేయడు. అలాంటిది ఆపని చేశారంటే, అతనికి వాళ్ల మేనేజ్‌మెంట్ భరోసా ఉండాలి. లేకపోతే ఆ సాహసం చేయరు. ఇప్పుడు సునీత ఆ విషయంతోపాటు, ఆ గదినుంచే సాక్షికి ఫోన్లు వెళ్లాయని చెప్పింది కాబట్టి, సాక్షిలో ఎవరికి ఫోన్లు వె ళ్లాయన్న సమాచారం సునీత దగ్గర ఉండే తీరాలి. ఆమె అవన్నీ ఎన్నికలకు ముందు, ఈవిధంగానే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి బయటపెడితే, సాక్షి యాజమాన్యం.. అంటే భారతీరెడ్డికి ప్రత్యక్షంగా ఇబ్బందులు తప్పకపోవచ్చ’’ని ఒక ఐపిఎస్ అధికారి విశ్లేషించారు. సునీత దగ్గర సీబీఐ విచారణకు సంబంధించిన అనేక వీడియో-ఆడియో ఆధారాలు చాలా ఉన్నందున, ఆమె వాటిని ఎప్పుడు, ఎలా బయటపెడతారోనన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో వెంటాడుతోంది.

దీన్నిబట్టి సునీత భవిష్యత్తు ప్రచారాంశమంతా.. భారతీరెడ్డి కేంద్రంగానే ఉండబోతోందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం షర్మిలతో కలసి ఎన్నికల ప్రచారం చేస్తున్న డాక్టర్ సునీత, ప్రతి వేదికపైనా తన తండ్రి వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రస్తావిస్తున్న సాక్షి విలేకరి వీడియో, హత్య జరిగిన గది నుంచే సాక్షికి ఫోన్లు వెళ్లడం, సాక్షికి గుండెపోటు అని ఎవరు చెప్పారన్న ప్రశ్నలే.. రేపటి సునీత ఎన్నికల ప్రచార ప్రధానాంశంగా కనిపిస్తోంది. దానితో భారతీరెడ్డి పాత్రను కూడా తెరపైకి తీసుకురావాలన్నదే, సునీత లక్ష్యమని స్పష్టమవుతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా ఎన్నికల తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ భారతీరెడ్డిని ప్రశ్నించడం ఖయమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.

అవినాషే హంతకుడంటూ ఆమె ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో బయటపెట్టిన ఆడియో-వీడియో ఆధారాలు, నిందితులతో ఎంపి అవినాష్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని రుజువుచేసే ఫొటో ఆధారాలు, అవినాష్‌రెడ్డి ఇతర నిందితుల ఫోన్‌కాల్‌డేటా అంతా అవినాష్ మెడకు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ, ఇప్పటికే దస్తగిరి వేసిన పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న విషయం తెలిలిసిందే.

అయితే డాక్టర్ సునీత ఈ సందర్భంగా జగన్‌ను బీజేపీ కాపాడుతోందంటూ చేసిన ఆరోపణ, బీజేపీకి నిస్సహందేహంగా నైతిక సంకటమే. ఇప్పటికే షర్మిలారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, జగన్ పరోక్షోంగా మోదీతో పొత్తు కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్డీఏతో పొత్తులో ఉన్నప్పటికీ.. మోదీ కేంద్రంగా బీజేపీపై ఇంకా జగన్‌తో బంధంపై విమర్శలు కొనసాగడమే ఆశ్చర్యం. ఈ విమర్శల వరద ఇలాగే కొనసాగితే అది బీజేపీకి సైతం నష్టం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

‘‘మోదీ-జగన్ బంధంపై ఇంకా ఆరోపణలు కొసాగడం దురదృష్టకం. ఇది ఒకరకంగా మా పార్టీకి నష్టం కలిగించేదే. మేం పోటీ చేస్తున్న చోట టీడీపీ-జనసైనికులు మాకు ఓటు వేకపోవచ్చు. అందువల్ల ఈ విమర్శలను తిప్పికొట్టాలంటే జగన్ ప్రభుత్వంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే జనం నమ్ముతారు. అలాంటి బలమైన నిర్ణయం తీసుకోకపోతే బీజేపీ-జగన్ మధ్య ఇంకా అనుబంధం కొనసాగుతోందని ప్రజలు అనుమానించే ప్రమాదం లేకపోలేద‘‘ని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE