Suryaa.co.in

Telangana

తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట

-దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించాం
-వచ్చే క్యాబినెట్ సమావేశంలో స్పోర్ట్స్ పాలసీని ఆమోదానికి కృషి
-తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది
-క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా స్పోర్ట్స్ పాలసీని రూపొందించాం
-తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ హబ్ గా రూపొందిస్తున్నాం
-ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిక్కత్ జరీన్ కు హైదరాబాదులోని ఎంతో విలువైన జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ అందుకు సంబంధించిన పత్రాలను అందజేసిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
-త్వరలో డీఎస్పీ ఉద్యోగ నియామక పత్రాలను నిక్కత్ జరీన్ అందజేస్తాం
-రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని రవీంద్ర భారతి లోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ కు రాష్ట్ర క్రీడా శాఖ తరపున హైదరాబాదులోని ఎంతో విలువైన జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ అందుకు సంబంధించిన పత్రాలను నిక్కత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ కు రాష్ట్ర క్రీడా పర్యాటక & సంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ తో కలసి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు . దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో క్రీడా స్టేడియంను నిర్మిస్తున్నమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి క్రీడా పాలసీ నీ రూపొందించామన్నారు. క్రీడా పాలసీని వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా చర్యలు చేపట్టామన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తెలంగాణ రాష్ట్రంలో రూపొందించామన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోoదన్నారు. అలాగే, క్రీడారంగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా క్రీడా పాలసీని రాష్ట్రంలో రూపొందించామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా రూపొందిస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్న నిక్కత్ జరీన్ కు సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు 2 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇప్పటికే అందించామన్నారు. త్వరలో గ్రూప్ -1 పోస్ట్ అయిన డీఎస్పీ ఉద్యోగాన్ని నిక్కత్ జరీన్ కు అందజేస్తామన్నారు. ఆమె సూచనల మేరకు ఇంటి స్థలాన్ని ఆమె తండ్రి మహమ్మద్ జమిల్ అహ్మద్ కు అందించామన్నారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ నిక్కత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఇప్పటికే క్రీడా శాఖ తరపున ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఈషా సింగ్ కు 2 కోట్ల రూపాయల నగదు బహుమతి తో పాటు 600 గజాల విలువైన ఇంటి స్థలం జూబ్లీహిల్స్ లో కేటాయించి అందుకు సంబంధించిన పత్రాలను అందించమన్నారు. షూటింగ్ క్రీడాకారిని ఈషా సింగ్ కు గ్రూప్ – 1 స్థాయి ఉద్యోగాన్ని త్వరలో అందజేస్తామన్నారు. వీటితోపాటు పద్మశ్రీ కిన్నెర మొగలయ్య కు ఒక 1 కోటి రూపాయలు నగదు తో పాటు 600 గజాల విలువైన ఇంటి స్థలాన్ని అందజేశామన్నారు.

ఈ సందర్భంగా నిక్కత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ… బాక్సింగ్ క్రీడలో అద్భుతమైన ప్రతిభ ను కనబరుస్తున్న నిక్కత్ జరీన్ ప్రతిభ ను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  పిలిచి భోజనం పెట్టి అభినందించారన్నారు. అలాగే, రెండు కోట్ల రూపాయల నగదు బహుమతి తో పాటు, హైదరాబాద్ లోని ఎంతో విలువైన జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలాన్ని కేటాయించినందుకు, డీఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ , క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా కు కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A RESPONSE