Suryaa.co.in

Editorial

బీహార్‌ పర్యటన బూమెరాంగ్‌?

– కేసీఆర్‌ పర్యటనపై విపక్షాల విమర్శనాస్ర్తాలు
– కు.ని బాధితులను పరామర్శించే తీరిక లేదా?
– తెలంగాణ సొమ్ము బీహారీలకు ఎలా ఇస్తారన్న సంజయ్‌
– కోటి రూపాయల నష్టమపరిహారం ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్‌ డిమాండ్‌
– సర్కారు ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవని తేలిపోయిందన్న రేవంత్‌
– బాధితులను పరామర్శించకుండా బడాయి కోసం బీహార్‌కు వెళ్లారా?
– గతంలో ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చిన చెక్కులపైనా విమర్శనాస్త్రాలు
– అమరవీరుల కుటుంబాలను మర్చిపోయారంటూ ధ్వజం
– తొలుత తామే వచ్చామంటూ హరీష్‌ ఎదురుదాడి
– కేసీఆర్‌ పర్యటనపై విపక్షాల దాడి
( మార్తి సుబ్మ్రహ్యణ్యం)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీహార్‌ పర్యటన బూమెరాంగవుతోందా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని.. నలుగురు మృతి చెందిన సమయంలో జరిపిన కేసీఆర్‌ పర్యటనను విపక్షాలు ఆయుధంగా అందుకుంటున్నాయా? తెలంగాణలో మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయలు, గల్వాన్‌ ఘటనలో బాధితులకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఎలా ఇస్తారన్న మరో కొత్త వివాదం సర్కారుకు తలనొప్పి సృష్టించనుందా? మృతుల కుటుంబాలు, బాధితులను పరామర్శించకుండా కేసీఆర్‌ బీహార్‌ వెళ్లిన వైనం సీఎంను ఇరుకున పెడుతోందా? ప్రధానంగా… సర్కారీ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలున్నాయని ప్రచారం చేస్తున్న వేళ, బాధితులను కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేర్పించడంతో.. సర్కారు ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవని స్వయంగా సర్కారే అంగీకరించినట్టయిందా? తెలంగాణలో తాజాగా నెలకొన్న పరిస్థితి చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

వైద్యశాఖ తెలంగాణ సర్కారుకు శిరోభారంగా పరిణమించనుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు ఒక్కొక్కరుగా.. ఇప్పటివరకూ నలుగురు మహిళలు మృతి చెందిన వైనం కేసీఆర్‌ సర్కారుకు ఇరకాటంగా మారింది. ‘‘ఆపరేషన్లు చేయించుకున్న 34 మంది మహిళల్లో, ఇప్పటికే నలుగురు మృతి చెందగా, మరో 30 మంది అపోలో, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. వారి పరిస్థితి ఏమిటన్నది డాక్టర్లు చెప్పలేకపోతున్నారంటే.. చికిత్స పొందుతున్న వారు సీరియస్‌గా ఉన్నట్లు అర్ధమవుతోంద’ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సందేహం వ్యక్తం చేశారు. దీనితో వారి ఆరోగ్య పరిస్థితిపై మరింత ఆందోళన పెరిగింది.

‘ఆపరేషన్‌ చేసే సమయంలో మత్తు ఇవ్వలేదు. ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో బాధతో ఏడ్చాం. ఇప్పుడేమో ఇన్ఫెక్షన్‌తో అల్లాడుతున్నామ’ంటూ రోగులు, సంజయ్‌ వద్ద వాపోయిన వైనం పరిశీలిస్తే..bandi-sanjay-hospital కేవలం 5 నిమిషాల్లో పూర్తయ్యే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ను, డాక్టర్లు ఎంత క్లిష్టతరంగా నిర్వహించారో స్పష్టమవుతోంది. దానిపై విచారణ కొనసాగుతున్నందున, నివేదిక కోసం ఎదురుచూడాల్సిందే.

ఇంత విషాద పరిస్థితి నెలకొన్న సమయంలో.. సీఎం కేసీఆర్‌ రాజకీయాలు, చెక్కుల పంపిణీ కోసం బీహార్‌ పర్యటనకు వెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. గత మూడు రోజుల నుంచి ఈ వివాదం కొనసాగుతూ, బాధితులు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వారి కుటుంబాలను పరామర్శించకుండా.. రాజకీయ చర్చలు, గల్వాన్‌ బాధిత కుటుంబాలకు చెక్కులిచ్చేందుకు బీహార్‌ వెళ్లడంపై అటు విపక్షాలు, ఇటు సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులను పరామర్శించి వెళ్లి ఉంటే ఈ స్థాయిలో విమర్శలు వచ్చేవి కాదని అటు టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

‘ఇబ్రహీంపట్నంలోని హెల్త్‌ సెంటర్‌లో ల్యాప్రోస్కోపిక్‌ ఆపరేషన్లు విఫలమయి నలుగురు చనిపోయిన కేసులు ఈరోజే నమోదు కాలేదు. రోజుకొకటి జరిగింది. 30 మంది చికిత్స పొందుతూ ఆందోళనతో ఉన్నారు. ఒక బాధ్యత గల సీఎంగా కేసీఆర్‌ అక్కడికి వెళ్లి బాధితులు, మృతుల కుటుంబాలను పరామర్శించకుండా, బీహార్‌కు పోవడం బడాయికి కాక మరేమిటి? అయినా తెలంగాణ ప్రజల సొమ్ము బీహారోళ్లకు ఇవ్వడమేమిట’ని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు. ఆ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని విరుచుకుపడ్డారు.

కాగా రికార్డు కోసం, తమను బెదిరించి బలవంతంగా ఆపరేషన్లు చేయించారంటూ.. చికిత్స పొందుతున్న మహిళలు చెప్పిన మాటలను, సంజయ్‌ మీడియా సమక్షంలో బయటపెట్టడం కూడా సర్కారుకు సంకటంగా మారింది. ఈ నేపధ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ‘ఒక్కరోజు రికార్డు సృష్టి ’కోసమే, ఇంత భారీ సంఖ్యలో ఆపరేషన్లు చేశారా? అన్న సందేహాలు సహజంగానే తెరపైకి వస్తున్నాయి.

మరోవైపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ బాధితుల వ్యవహారం, అటు సర్కారు ఆసుపత్రుల వైఫల్యాన్ని చాటేందుకు కారణమయింది. కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు సమకూర్చామని, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ చేస్తున్న ప్రచారంలో, పస లేదన్న విషయం తాజా ఘటనతో తేలిపోయింది. సర్కారీ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నప్పుడు బాధితులను అక్కడ చేర్చకుండా, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఎందుకు చేర్పించారన్న విపక్షాల ప్రశ్నలు సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

revanth-reddy‘నిజంగా కేసీఆర్‌ చెబుతున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నప్పుడు బాధితులను అక్కడే చేర్చకుండా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఎందుకు చేర్పించారు? దీన్నిబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని కేసీఆర్‌ ప్రభుత్వమే అంగీకరించినట్టయింద’ని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కొత్త లాజిక్కును తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమయింది.

ఇదే అంశంపై అటు సోషల్‌మీడియాలో కూడా నెటిజన్లు ప్రశ్నలతో సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ‘‘సర్కారీ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవని ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇక ఆసుపత్రుల సౌకర్యాలపై జూటా మాటాలు కట్టిపెట్టండి’’ ‘‘ మొన్న కరోనాలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే కదా ట్రీట్‌మెంట్‌ చేయించుకుంది’’ అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

ఇక సీఎం కేసీఆర్‌ బీహార్‌ వెళ్లి గాల్వా బాధితులకు అందచేసిన చెక్కులపైనా వివాదం మొదలయింది. సైనిక కుటుంబాలకు సాయం చేయడాన్ని తప్పు పట్టకపోయినా, సికింద్రాబాద్‌ బాధితులకు 5 లక్షలు సాయం చేసి, బీహార్‌కు వెళ్లి పది లక్షలు ఇవ్వవడమేమిటన్న చర్చకు తెరలేచింది. కుటుంబ నియంత్రణ బాధితులకు 10 లక్షలు, మృతుల కుటంబాలకు కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌-బీజేపీ డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు సాయం చేసేందుకు చేతులు రాని సీఎం కేసీఆర్‌.. పంజాబ్‌, ఢిల్లీ, బీహార్‌లో ఉన్నవారికి మాత్రం సాయం చేస్తున్నారంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మూక్ముమడి దాడి చేస్తుండటంతో కేసీఆర్‌ సర్కారు ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

అయితే.. ఘటన జరిగిన తర్వాత ముందు ప్రభుత్వమే స్పందించిందని వైద్యశాఖ మంత్రి హరీష్‌ ఎదురుదాడి ప్రారంభించారు. ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేశామని గుర్తు చేశారు. బాధితుల ఇళ్లharish వద్దకు అంబులెన్సులు పంపామని,బాధితుల వద్ద ఉన్న సహాయకులకు 10 వేలు ఇస్తున్నామన్నారు. వైద్యులు మానటరింగ్‌ చేస్తున్నారని, రెండుమూడు రోజుల్లో బాధితులు డిశ్చార్జి అవుతారని హరీష్‌ ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ‘‘రాజకీయ పార్టీలు ఇప్పుడొచ్చి హడావిడి చేస్తున్నాయి. కానీ మేం ఘటన జరిగిన వెంటనే స్పందించి, చికిత్స అందిస్తున్నాం’ అని ఎదురుదాడి చేశారు.

LEAVE A RESPONSE