గవర్నర్‌ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్

గవర్నర్ వీడ్కోలు సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

విజయవాడ: గవర్నర్‌ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని అన్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఒక తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని ప్రశంసించారు. గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. గవర్నర్‌ విద్యావేత్త, న్యాయ నిపుణులు, స్వాతంత్ర్య సమరయోధులని గుర్తు చేశారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒడిశా బార్‌ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారని ప్రస్తావించారు. గవర్నర్‌ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రజలు, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు.

వైయ‌స్ జ‌గ‌న్ చూపిన గౌరవం, ఆప్యాయత మరువలేనివి: గ‌వ‌ర్న‌ర్‌
సీఎం వైయ‌స్ జగన్‌ చూపిన గౌరవం, ఆప్యాయత మరువలేనివని గవర్నర్‌ తెలిపారు. గవర్నర్‌, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ అందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. ‘ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రారంభంలో అడిగా. దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్‌ చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది.

ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం ఎంతో అద్భుతమైనది. కరోనా కాలంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. సీఎం జగన్‌ను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నా రెండో ఇల్లు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను’ అని గవర్నర్‌ ప్రసంగించారు.

Leave a Reply