Suryaa.co.in

Editorial

ఎన్టీఆర్‌ ఫ్యామిలీలో బీజేపీ ‘బొమ్మ’ పంచాయతీ

– ఎన్టీఆర్‌ బొమ్మతో వందరూపాయల నాణెం
– 28న నాణెం విడుదల చేయనున్న కేంద్రం
– ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు ఆహ్వానం
– బాబు, బాలకృష్ణ, పురందేశ్వరి, జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానాలు
– తననెందుకు పిలవేలదన్న అన్న రెండో భార్య లక్ష్మీపార్వతి
– తాను ఎన్టీఆర్‌నే అని గుర్తు చేసిన లక్ష్మీపార్వతి
– తననూ ఆహ్వానించాలని ఆర్ధికమంత్రికి లేఖ
– పిలవని పేరంటానికి వెళ్తానంటున్న పార్వతి
– కేంద్రం లక్ష్మీపార్వతిని ఆహ్వానిస్తుందా? లేదా?
– లక్ష్మీపార్వతి వస్తే ఎన్టీఆర్‌ వారసులరాలు ఆమెనే అన్న సంకేతాలు
– లక్ష్మీపార్వతిని పిలిస్తే ఎన్టీఆర్‌ ఫ్యామిలీ వెళుతుందా?
– పురందేశ్వరితోనే పరిమితం చేస్తుందా?
– ఎన్టీఆర్‌ పేరుతో ఫ్యామిలీలో కొత్త పంచాయతీకి తెరలేపిన బీజేపీ
– అందరి చూపూ నిర్మలమ్మ వైపు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్టీఆర్‌ ఫ్యామిలీలో పువ్వు పార్టీ కొత్త పంచాయితీకి తెరలేపింది. దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ బొమ్మ ఉన్న వంద రూపాయల నాణేన్ని ముద్రించిన బీజేపీ నాయకత్వంలోని కేంద్రం, ఎన్టీఆర్‌ అభిమానుల పెదవులపై చిరునవ్వులు పూయించింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మసామాజికవర్గాన్ని మెప్పించింది. అంతవరకూ బాగానే ఉంది.

ఎన్టీఆర్‌ బొమ్మ ఉన్న వంద రూపాయల నాణేన్ని.. ఈనెల 28న ఢిల్లీలో విడుదల చేయాలని, కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు జరిగే కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అల్లుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఎన్టీఆర్‌ కూతురైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, ఆయన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్‌ కొడుకు బాలకృష్ణ, మనుమడు జూనియర్‌ ఎన్టీఆర్‌, లోకేష్‌ తదితరులంతా ఆరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆమేరకు వారికి ఆర్ధికశాఖ నుంచి ఆహ్వానం అందింది. ఎన్టీఆర్‌ కుటుంబం కూడా అదేరోజు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

అయితే ఈలోగా ఎన్టీఆర్‌ రెండవ భార్య లక్ష్మీపార్వతి, ర ంగప్రవేశం చేయడంతో రచ్చ మొదలయింది. ఎన్టీఆర్‌ భార్య అయిన తనను ఆహ్వానించడం ఎలా మర్చిపోయారంటూ ఆమె, ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఒక లేఖ రాశారు. ‘‘బహుశా అధికారుల పొరపాటుతో నా పేరు మర్చిపోయి ఉండవచ్చు. కాబట్టి నాకూ ఆహ్వానం పంపే ఏర్పాట్లు చేయండి. మా ఆయన బొమ్మతో నాణెం విడుదల చేస్తూ, నన్ను పిలవకపోతే ఎలా’’ అని లక్ష్మీపార్వతి.. పిలవని పేరంటానికి, తననూ పిలవాలని కోరుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ కేంద్రంలోని బీజేపీ వ్యూహకర్తలు ఆ కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని పిలిపిస్తే, కథంతా అడ్డం తిరిగి రక్తికట్టే అవకాశాలు లేకపోలేదు. నిజంగా లక్ష్మీపార్వతికి బీజేపీ సర్కారు ఆహ్వానం అందిస్తే.. ఆమె మాత్రమే ఎన్టీఆర్‌ వారసురాలన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న లక్ష్మీపార్వతి తరచూ చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

నిజంగా లక్ష్మీపార్వతిని బీజేపీ సర్కారు ఆహ్వానిస్తే.. అప్పుడు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమెతో వేదిక పంచుకునేందుకు ఇష్టపడని చంద్రబాబు, బాలకృష్ణ, భువనేశ్వరి తదితరులు.. అసలు ఢిల్లీకే వెళ్లకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఎన్టీఆర్‌ కూతురు పురందేశ్వరి మాత్రం, హాజరుకావడం అనివార్యంగా కనిపిస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా, కేంద్ర నిర్ణయాన్ని ధిక్కరించే అవకాశం ఆమెకు లేదు.

ఇప్పుడిప్పుడే టీడీపీ-బీజేపీ బంధం బలపడుతోంది. ఈ సమయంలో ఎన్టీఆర్‌ నాణెం విడుదల కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని పిలిచి, టీడీపీని దూరం చేసుకుంటుందా? లేక లక్ష్మీపార్వతిని ఆహ్వానించడం ద్వారా, ఆమెనే అన్న వారసురాలన్న సంకేతాలిస్తుందా చూడాలి.

కాగా నాణెం విడుదల సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ఎవరెవరిని ఆహ్వానించాలన్న అంశంపై కేంద్రం, ఈపాటికే అన్న కుమార్తె పురందేశ్వరిని సంప్రదించిందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఆమె సూచనలు తీసుకున్న తర్వాతనే ఆహ్వానాలు రూపొందించిందని బీజేపీ నేతలు వివరించారు.

అయితే ఆ సమావేశానికి లక్ష్మీపార్వతిని కూడా పిలిచేందుకు, వైసీపీ సీనియర్‌ ఎంపీ కేంద్ర ఆర్ధికమంత్రిని సంప్రదించారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. నిరంతరం ఆర్ధికమంత్రితో టచ్‌లో ఉండే సదరు నేత.. తమ పార్టీలో ఉన్న లక్ష్మీపార్వతిని ఆహ్వానించాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ రకంగా కేంద్రం కూడా.. తమ పార్టీలో ఉన్న లక్ష్మీపార్వతినే, వారసురాలిగా గుర్తించిందన్న ప్రచారం చేసుకునే వ్యూహమే ఇందులో కనిపిస్తోంది.

LEAVE A RESPONSE