Suryaa.co.in

Telangana

మత్స్యకారులకే పూర్తి హక్కులను కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే

– ప్రతి సంవత్సరం ఫిష్ పుడ్ ఫెస్టివల్
– మంత్రి తలసాని

మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకే పూర్తి హక్కులను కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా దీటి మల్లయ్య బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

దీటి మల్లయ్యను వైస్ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అబినందన సభలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే అన్ని వర్గాల ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉన్నారని, పక్కా ప్రణాళికతో వివిధ వృత్తుల అభివృద్దికి కృషి చేస్తున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతోనే మత్స్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్ట్ ల నిర్మాణంతో పాటు మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువులను పునరుద్దరించడంతో భారీ ఎత్తున నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని వివరించారు. రాష్ట్ర ఆవిర్బావానికి ముందు 1.98 లక్షల టన్నుల వరకు మత్స్య సంపద ఉత్పత్తి ఉండగా, నేడు 4.24 లక్షల టన్నులకు పెరిగిందని అన్నారు.

ఏడాది పొడవునా మత్స్యకారులకు ఉపాది లభిస్తుందని, దీంతో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. మత్స్య సంపద ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని చెప్పారు. మత్స్యకారులు చేపల విక్రయాలు జరుపుకోవడానికి సబ్సిడీపై మోపెడ్ లు, ట్రాలీ ఆటోలు వంటి పలు వాహనాలు అందించడం జరిగిందని అన్నారు.

అదేవిధంగా చేపలు, చేపల వంటకాలు అమ్ముకొనే విధంగా ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను కూడా సబ్సిడీ పై అందించినట్లు చెప్పారు. చేపల వంటకాలపై మహిళా మత్స్యకారులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని, మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించి వివిధ రకాల చేపల వంటకాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని వెల్లడించారు. చేరువులలోని చేపలను తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని కోరారు. పంచాయితీ రాజ్ పరిధిలో ఉన్న చెరువులన్నీ మత్స్యశాఖ పరిధిలోకి తీసుకొచ్చి వాటిపై కూడా మత్స్యకారులకే హక్కులు కల్పించినట్లు చెప్పారు. మత్స్యకారులకు మెరుగైన పలు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మత్స్య మీ సేవ యాప్ ను ప్రారంభించినట్లు వివరించారు.

ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యరంగం పూర్తి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి కులవృత్తుల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారుల సొసైటీలలో ఈ వృత్తి తో సంబంధం లేని వారికి సభ్యత్వం కల్పించారని అన్నారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు మాత్రమే సోసైటీలలో సభ్యత్వం కల్పిస్తున్నట్లు చెప్పారు.

సంపద సృష్టించాలి పేదలకు పంచాలి అనే ముఖ్యమంత్రి లక్ష్యం మేరకు ప్రతి ఒక్క మత్స్యకారుడికి లబ్ది చేకూర్చేందుకు నూతనంగా 18 సంవత్సరాలు నిండిన లక్ష మంది మత్స్యకారులకు మత్స్య సోసైటీలలో సభ్యత్వం అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ మత్స్య సొసైటీలలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించిన విషయాన్ని ఈ సందర్బంగా మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ MLA ముఠా గోపాల్, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, వివిధ జిల్లాలకు చెందిన మత్స్యకారులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE