– బీజేపీ డాన్స్ బేబీ డాన్స్!
– మార్కాపురం బీజేపీ సభలో రికార్డింగ్ డాన్సుల కోలాహలం
– ఊ అంటావా మావా ఊహూ అంటావా అంటూ చిందులు
– ‘పువ్వు’ సభలో వికసించిన డాన్సుపాపలు
– మార్కాపురం టౌన్ జాతరలో రికార్డింగ్ డాన్సర్ల జాతర
– కమలదళాలు అప్‌డేట్ అవుతున్నాయా?
– కమల‘ శృంగార నైషధం’తో పునీతులైన మార్కాపురం వాసులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీ సిద్ధాంతాలు అనే మడికట్టుకున్న పార్టీ. భారతీయ సంస్కృతి, జాతీయవాదం దానికి రెండు కళ్లు. సందర్భోచితంగా వాడుకునే హిందుత్వ కార్డు అదనపు త్రినేత్రం. కమలాన్ని చేయి పట్టుకుని నడిపించి, దానికి మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్ అడుగుజాడల్లో నడిచే పార్టీ అన్న పేరు. మరి అలాంటి సిద్ధాంతాల మడి కట్టుకునే బీజేపీ సభలు ఎంత పవిత్రంగా ఉండాలి? ‘సంస్కారవంతమైన త్రిబుల్ ఎక్స్ సబ్బు’ మాదిరిగా ఇంకెంత సంస్కారంగా ఉండాలి?
ఆర్‌ఎస్‌ఎస్ గీతమయిన ‘‘ నమస్తే సదావత్సలే మాతృభూమే.
త్వయాహిందు భూమే సుఖం వర్ధితోహం.
మహామంగళే పుణ్యభూమే త్వదర్ధే.
పతత్వేష కాయా నమస్తే నమస్తే ’’
అని వినిపించాల్సిన చోట.. బావలూ.. సయ్యా.. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా?.. అనే సినిమా పాటలు వినిపిస్తే ఖంగుతినక తప్పదు కదా?
అవును.. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. సహజంగా బీజేపీ సభలో సంఘ్ గీతం వినిపించదనుకోండి. కానీ ఈ దరిద్రపు సినిమా డాన్సుల కంటే, కనీసం సంఘ్ గీతం పెట్టినా బాగుండేదన్నది చాదస్త భాజపేయుల ఉవాచ.
కానీ అది మార్కాపురం. సోము వీర్రాజు నియమించిన కొత్త నియోజకవర్గ ఇన్చార్జికీ కొంత కళాపోసన ఉందని, అది ఎలుగెత్తి గంతులేస్తుందనీ తెలుసుకోకపోతే ఎలా? ‘మనవాళ్లూ అప్‌డేట్ అవుతున్నారోయ్’.. అని మురిసిపోవాలే తప్ప.. దానిని కూడా భూతద్దంలో చూసి, భారతీయ సంస్కృతి కమ్ బీజేపీ కట్టుబాట్లు.. జమిలిగా మంటకలిసిపోయాయని గుండెలు బాదుకుంటే ఎలా?
మార్కాపురం టౌన్ జాతరలో అంతా హడావిడి. అక్కడ బీజేపీ ఒక సభ నిర్వహించింది. ఇటీవల అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించిన, నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆ సభ ఏర్పాటుచేశారట. అంతవరకూ బాగానే ఉంది. కానీ వేదిక మీద ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలపై, ఆ తర్వాత విమర్శల జల్లు కురిసింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే, విమర్శలెందుకు అనే కదా మీ డౌటనుమానం?
అవును. అదీ నిజమే. ఏదో భరతనాట్యం, కథాకళీ, సత్యహరిశ్చంద్ర కాటిసీన్లు, చెలియో చెల్లకో లాంటివి కాకుండా… రికార్డింగ్ డాన్సు పాపలతో .. బావలూ.. సయ్యా.. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా.. వంటి డాన్సులు వేయించారు. పాపలతో చిందులు వేయించి, చిరునువ్వులు పూయించారు. డాన్సు పాపల తైతక్కలు చూసి, కమలనాధులు తన్మయం చెందిన వీడియోలు కాస్తా, సోషల్‌మీడియాలో దూరి తెగ డ్యాన్సులేస్తున్నాయి. చట్టం తన పని చేసినట్లు.. సోషల్‌మీడియా ఉత్సాహవంతులు కూడా తమ పని తాను కానిచ్చేశారన్నమాట!
బీజేపీ వేదికపై డాన్సుపాపల కళానైపుణ్యానికి పరవవులైన నెటిజన్లు.. సోషల్‌మీడియాలో రసానుభూతితో కామెంట్లు పెడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఫొటో పెట్టి మరీ తెగ పొగిడేస్తున్నారు. బీజేపీలో మొదలైన నయా ట్రెండ్.. తిరనాళ్లలో పార్టీ ప్రభలు కూడా కట్టే అలవాటు లేని బీజేపీ, చివరకు డాన్సుపార్టీల వరకూ ఎదగడాన్ని భారతీయులంతా గర్వించాల్సిందే.. భారతీయ సంప్రదాయాన్ని బతికిస్తున్నందుకు మార్కాపురం బీజేపీ నేతలను సన్మానించాల్సిందే.. అంటూ తెగితాబులిచ్చేస్తున్నారు.
పాపం డాన్సుపాపలు అప్పటికీ ‘ఒళ్లు దాచుకుని’.. శాస్త్రబద్ధంగా.. డాన్సులేసి.. సంప్రదాయ సుడిగుండంలో చిక్కుకుని, రాజకీయ జీవితం ఈదుతున్న పువ్వుపార్టీ’వాదులకు.. సోము వీర్రాజు పుణ్యాన మార్కాపురంలో ఒక సంస్కరణవాది వచ్చి, డాన్సు పాపలు డాన్సులు వేయించి, కమలదళాల జీవితాలను చరితార్ధం చేశారు.
అసలు పువ్వు పార్టీ పెట్టి వికసించిన ఇన్ని దశాబ్దాల చరిత్రలో.. బావలూ.. సయ్యా.. ఊ అంటావా మావ.. ఊహూ అంటావా మావ అంటూ డాన్సుపార్టీ ఏర్పాటుచేసిన సాహసికి, మెడలో వీరతాళ్లు వేయకుండా.. విమర్శలెందుకున్నది బీజేపీ నయా ట్రెండు సెట్టర్ల ప్రశ్న.
అయితే.. పూర్వం కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లలో పూటకూళ్ల భోజనం చేసే బీజేపీ, సంఘ్ నేతలు.. ఇప్పుడు స్టార్ హోటళ్లు, ఫైట్లలో తిరిగి అప్‌డేట్ అవుతుంటే లేనిది.. పాపం ఏదో మార్కాపురం స్థాయి నేతలు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటుచేస్తే తప్పేమిటన్నది నయా బీజేపీ వాదుల ప్రశ్న. ఆ లాజిక్కు నిజమే కదా అన్నది పార్టీ నేతల జవాబు. యద్భావం. తద్భవతి!