– వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌తో సీబీఐపై తగ్గిన భారం
– ఒత్తిళ్లు లెక్కచేయని సీబీఐ
– ఉదయ్‌రెడ్డి అరెస్టుతో ఖాయమైన భాస్కర్‌రెడ్డి అరెస్ట్ సంకేతం
– పీఏను కూడా అదుపులోకి తీసుకున్న సీబీఐ
– ఎట్టకేలకూ తొలగిన సస్పెన్స్
– సీబీఐ అధికారులను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
– అధికారులతో భాస్కర్‌రెడ్డి సోదరుడు మనోహర్‌రెడ్డి వాగ్వాదం
– అరెస్టుకు నిరసనగా పులివెందులలో వైసీపీ శాంతిర్యాలీ
-తాజా పరిణామాలతో వైసీపీ షాక్
– రేపటి జగన్ అనంతపురం పర్యటన వాయిదా
– భాస్కర్‌రెడ్డి అరెస్టుపై వైసీపీ మౌనం
– మంత్రులు, ఎమ్మెల్యే మౌనరాగం
– సీబీఐని విమర్శించాలా? వద్దా?
– వైసీపీ అంతర్మథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగన్ బాబాయ్, కడప ఎంపి అవినాష్‌రెడ్డి తండ్రి, మాజీ ఎంపి వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఎట్టకేలకూ అరెస్టు చేసింది. ఆయన భార్య లక్ష్మికి సీబీఐ అధికారులు అరెస్టు సమాచారం ఇచ్చారు. కుట్ర, హత్య, ఆధారాలు చెరివేసిన ఆరోపణలపై సీబీఐ అధికారులు, పులివెందుల వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది. దీనితో సీబీఐ తనపై పడిన నిందను తొలగించుకున్నట్లయింది. తాము ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదన్న సంకేతాలిచ్చింది.
రోజుకో కొత్త కథతో, రోజుకో మలుపు తిరుగుతున్న వివేకా హత్య కేసులో, సీబీఐ పెద్దతలనే అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. గతంలో తాము వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేస్తామని కోర్టుకు చెప్పింది. దానిని సవాల్ చేసిన వైఎస్ భాసకర్‌రెడ్డికి, అక్కడ ఊరట లభించలేదు. సీబీఐని అరెస్టు చేయవద్దన్న ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
అది జరిగి చాలారోజులయినప్పటికీ, భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకపోవడంతో, సహజంగానే సీబీఐపై అనుమానాలు రేకెత్తాయి. కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ, భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయకపోవడానికి కారణమేమిటన్న చర్చకు తెరలేచింది. అదే సమయంలో మళ్లీ కేసును, సమాధి చేస్తున్నారన్న వ్యాఖ్యలు- సందేహాలు తెరపైకి వచ్చాయి.
ఈలోగా ఎంపి అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌రెడ్డిని, సీబీఐ ఊహించని విధంగా అరెస్టు చేయడంతో కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఉదయ్‌రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత, ఇక ఎప్పుడైనా భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని, భాస్కరరెడ్డి అరెస్టు తర్వాతి వంతు ఎంపి అవినాష్‌రెడ్డిదేనంటూ, గత రెండు మూడు రోజుల నుంచి ప్రచారం జరిగింది. నిజానికి ఉదయ్‌రెడ్డి అరెస్టు వ్యవహారం భాస్కర్‌రెడ్డి అరెస్టుకు సంకేతమేనన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరిగింది.
అందుకు తగినట్లుగానే ఆదివారం తెల్లవారుఝామున సీబీఐ అధికారులు పులివెందుల వెళ్లి, వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. సెక్షన్ 130 బి, రెడ్‌విత్ 302, 201 కింద ఆయనను అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. దీనితో సీబీఐ…తన చేతులు స్వచ్ఛంగానే ఉన్నాయన్న సంకేతాలిచ్చింది. తనపై వచ్చిన నిందలకు తెరదించింది. ఒత్తిళ్లకు తలొగ్గలేదని నిరూపించుకుంది.అయితే సీబీఐ అధికారుల అరెస్టు ప్రయత్నాలను, వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భాస్కరరెడ్డి మరో సోదరుడైన మనోహర్‌రెడ్డి సీబీఐ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. వీటిని అధిగమించి ఎట్టకేలకూ సీబీఐ అధికారులు.. వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి కడపకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. ఆయన పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది.
తాజా పరిణామాలు ఏపీ సీఎం జగన్‌కు శరాఘాతమే. వైఎస్ భాస్కరరెడ్డి, ఎంపి అవినాష్‌రెడ్డిపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా, జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారిని సీబీఐ విచారించినప్పుడల్లా, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్‌కు తాత్కాలిక ఊరటనే తప్ప, శాశ్వత ఊరట లభించలేదు.
ప్రతిపక్షాలు సైతం.. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా, ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని ఆరోపించాయి. నిజానికి ఈవారంలో భాస్కరరెడ్డి, ఆయన తనయుడు అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందన్న ప్రచారం జరిగింది. అందుకు తగినట్లుగానే, ఆదివారం తెల్లవారుఝామున భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.
తాజా పరిణామాలు, వైసీపీలో కలవరం సృష్టించాయి. సీఎం జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటన రద్దవడంతోపాటు, వసతిదీవెన కార్యక్రమం కూడా వాయిదా అవకాశాలు కనిపిస్తున్నాయి. భాస్కర్‌రెడ్డి అరెస్టుపై వైసీపీ నేతలు మౌనం వహించడం విశేషం. జగన్ కుటుంబంపై ఎవరు విమర్శలు చేసినా, వరస వెంట వరస ప్రెస్‌మీట్లు పెట్టి ఖండించే మంత్రులు-జగన్ విధేయ ఎమ్మెల్యేలు, ఇప్పటిదాకా సీబీఐ అరెస్టుపై మౌనం వహించడమే విచిత్రం.
బహుశా సీబీఐని విమర్శిస్తే.. కేంద్రాన్ని విమర్శించినట్లవుతుందన్న భయంతోనే, భాస్కర్‌రెడ్డి అరెస్టుపై వైసీపీ మౌనం వహించినట్లు కనిపిస్తోంది. ఇది అక్రమ అరెస్టు అనో, రాష్ట్రంపై కుట్ర అనో, సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారనో ఆరోపిస్తే.. అది అటు తిరిగి ఇటు తిరిగి.. చివరకు కేంద్రంలో బీజేపీతో యుద్ధానికి దారితీస్తుందన్న ముందు చూపు కూడా వైసీపీ మౌనం వెనుక మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
భాస్కర్‌రెడ్డి అరెస్టు పరిణామ క్రమం ఇదీ..
▪️కడపలో ఉ.5.30 గంటల సమయంలో భాస్కర్ రెడ్డి ఇంట్లోకి సీబీఐ బృందం.
▪️ఉ.6.10 నుంచి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన సీబీఐ.
▪️తర్వాత భాస్కర్ రెడ్డి ఇంట్లోకి ఎవరినీ అనుమతించని సీబీఐ.
▪️లాయర్‌ను అనుమతించాలని భాస్కర్‌రెడ్డి వినతిపై స్పందించని సీబీఐ.
▪️వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేశాము – సీబీఐ.
▪️మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాం – సీబీఐ
▪️సెక్షన్ 120 B , రెడ్ విత్ 302 , 302 ఐపీసీ కింద కేసు నమోదు.
▪️వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది – సీబీఐ.
▪️వివేకా హత్య కు ముందు తరువాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడాడు – సీబీఐ
▪️వైఎస్ లక్ష్మీ, పి జనార్దన్ రెడ్డి, సాక్షులు.
▪️120b కుట్ర , 302 మర్డర్ , 201 ఆధారాలు రిపివేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము – సీబీఐ