ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెలుగు జాతి నాగరికతను విచ్చిన్నం చేసేందుకు తెలుగు భాషను నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. తెలుగు భాషా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని డిమాండ్ చేశారు. సాకేంతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతిక విద్యను కూడా మాతృభాషలోనే చేస్తున్నారని తెలిపారు. తెలుగు భాషను
నిర్వీర్యం చేసే ఏ కార్యక్రమాన్నైనా బీజేపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. తెలుగు సంస్కృతిని నాశనం చేయాలని వైసిపి కుట్ర చేస్తుందని బిజేపి నేత యామినీ ఆరోపించారు. కేజీ నుంచి పీజీ వరకు తెలుగు లోనే బోధన చేపట్టాలని డిమాండ్ చేసారు. వైసిపి నిర్లక్ష్యాన్ని ఎండగడతూ బిజేపి ఆందోళనలు కొనసాగిస్తుందని చెప్పారు. గుంటూరు పార్లమెంట్ బిజేపి అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు భాషా వారోత్సవాల్లో భాగంగా ప్రాధమిక విద్యను తెలుగు భాషా లోనే కొనసాగించాలని పోరాటం చేస్తున్నాం. సీఎం జగన్ కక్ష్య పూరితంగా పాలన చేస్తున్నాడని చెప్పారు.