– తెలంగాణలో కమ్మ వర్గానికి 5 సీట్లు.. సెటిలర్లకు ప్రాధాన్యం
– జనసేనతో పొత్తా? మద్దతా?
– జనసేనతో పొత్తు లాభమా? నష్టమా?
– బీజేపీ కోర్ కమిటీలో వాడి వేడి చర్చ
– శేరిలింగంపల్లిలో బీజేపీ వర్సెర్ సంఘ్
– మువ్వా సత్యనారాయణ వైపు బీజేపీ అగ్రనేతలు
– యోగానంద్ వైపు ఆరెస్సెస్?
– కొన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పీటముడి
– కోర్ కమిటీ భేటీకి హాజరుకానున్న మోదీ
– సాయంత్రానికి అభ్యర్ధులపై స్పష్టత
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణలో అధికార పగ్గాలు అందుకునే లక్ష్యంతో అడుగులేస్తున్న బీజేపీ.. ఆ మేరకు తన ముందున్న మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న కోర్ కమిటీ భేటీలో, కూడికలు-తీసివేతలపై సీరియస్‌గా చర్చిస్తోంది. సాయంత్రం, వరకూ జరిగే ఈ భేటీకి మధ్యలో ప్రధాని మోదీ కూడా హాజరవనున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 35 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే, కమ్మ వర్గాన్ని దరిచేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 5 అసెంబ్లీ స్థానాలు ఆ సామాజికవర్గానికి కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ స్థానాలేమిటన్నది సాయంత్రానికి స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో 35 నుంచి 40 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే సెటిలర్లకు, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నియోజకవర్గాల్లో నాన్ కమ్మ వర్గాలకు సీట్లు కేటాయించాలని భావిస్తున్నారు. వాటిపై కూడా సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ మేరకు కమ్మ, సెటిలర్ల ప్రభావం ఉన్న నియోజకవర్గాల జాబితాను కోర్ కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాగా గ్రేటర్ హైదరాబాద్‌లో కమ్మ వర్గ ప్రభావం ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్ధి ఎంపిక వ్యవహారంలో, బీజేపీ-ఆరెస్సెస్ మధ్య ఆధిపత్యపోరు నెలకొన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సహా, కోర్ కమిటీ సభ్యులు టీడీపీ నుంచి చేరిన మువ్వా సత్యనారాయణ వైపు మొగ్గు చూపుతున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణకు సీటు ఇవ్వాలని వారంతా పట్టుపడుతున్నారు.
అయితే ఆరెస్సెస్ మాత్రం వైశ్య వర్గానికి చెందిన, యోగానంద్‌కు సీటివ్వాలని ఇప్పటికే సిఫార్సు చేసింది. యోగానంద్ చాలాకాలం నుంచి సంఘ్ కార్యకలాపాలకు, ఆర్ధికంగా దన్నుగా నిలుస్తున్నారు. ఈవిధంగా కొన్ని నియోజవకవర్గాల్లో ఇలాంటి ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. వాటిపైనా చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇక కీలకమైన జనసేనతో పోటీ లేదా మద్దతు అంశంపైనా, కోర్ కమిటీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో జనసేనతో పొత్తు వల్ల పార్టీకి లాభమా? నష్టమా అంశంపై కోర్ కమిటీలో చర్చిస్తున్నారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఆ ప్రభావం బీజేపీపై పడుతుందా? ‘ఆంధ్రా పార్టీతో పొత్తు’ అన్న ప్రచారంతో, బీఆర్‌ఎస్ తమను నష్టపరుస్తుందా? అన్న అంశంపై చర్చిస్తున్నారు.ఇది కూడా చదవండి: జనసేన స్పీడుకు మళ్లీ బీజేపీ బ్రేకులు?
పొత్తు-లేదా విడిగా పోటీ చేసేందుకు సిద్ధమని జనసేనాని పవన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి స్పష్టం చేశారు. తమ పార్టీ నేతల మనోగతాన్ని కూడా ఆయన కిషన్‌రెడ్డికి వివరించారు. ఆ విషయాన్ని కిషన్‌రెడ్డి కోర్ కమిటీ సభ్యులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీనిపైనా సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సాయంత్రం వరకూ జరిగే కోర్ కమిటీ సమావేశానికి, ప్రధాని మోదీ ఎప్పుడైనా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని వచ్చిన తర్వాత జనసేనతో పొత్తు-మద్దతు అంశాన్ని నిర్ణయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కాగా వీటిపై కసరత్తు ముగించి, దసరా రోజున తొలి జాబితా విడుదల చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆలోగా అభ్యర్ధుల వడపోతను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా తెలంగాణలో కమ్మ వర్గానికి 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లు కేటాయించాలని.. కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి తాజాగా తన పార్టీని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.