– సిట్టింగులకే సీట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టీకరణ
– ఇప్పటివరకూ టికెట్లపై మాజీల గంపెడాశలు
– టీఆర్‌ఎస్ మాజీలకు బీజేపీ టికెట్ల హామీ?
– కేసీఆర్ ప్రకటనతో టికెట్లపై ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ సీనియర్ల నిరాశ
– టీఆర్‌ఎస్ ఆశావహులపై బీజేపీ దృష్టి
– టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బలం 104 మంది
– అందులో 67 మందిని మార్చాలన్న ప్రశాంత్‌కిశోర్
– 40మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు
– ఆ 67 నియోజకవర్గాలపై కమలం కన్ను
– టీఆర్‌ఎస్ అసంతృప్త నేతలపై బీజేపీ వల
– ఎమ్మెల్యే స్థాయి నేతలను పార్టీలోకి తెచ్చే ఎత్తుగడ
– గతంలో ఓడి, మళ్లీ సీటు కోసం ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్ నేతలపై కన్ను
– వారిని బీజేపీలోకి తీసుకువచ్చే వ్యూహం
– ఈటల, కోమటిరెడ్డికి కీలక బాధ్యతలు?
– టీఆర్‌ఎస్ అసంతృప్త నేతలతో చర్చించే బాధ్యత ఈటలకు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
సిట్టింగులకే మళ్లీ సీట్లిస్తామన్న తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విస్పష్టమైన హామీ బీజేపీకి వరంలా పరిణమించనుంది. దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా.. తెలంగాణలో శరవేగంగా ఎదగాలన్న బీజేపీ కోరిక, నెరవేరే మార్గం ఎట్టకేలకూ ఆ పార్టీ నాయకత్వానికి లభించింది. సిట్టింగులపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే స్థాయి నేతలను ‘కారు’ దింపి, కమలవనంలో చేర్పించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఆ మేరకు ఢిల్లీ నాయకత్వం శరవేగంగా పావులు కదుపుతోంది.
అత్యంత విశ్వనీయ సమాచారం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది.. తమను ఎక్కడ మారుస్తారోనని భయాందోళనలో ఉన్న, సిట్టింగులకు శుభవార్తగానే పరిణమించింది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలంటే.. ఉన్న సిట్టింగులలో 67 మందిని మార్చాల్సిందేనని, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్.. టీఆర్‌ఎస్ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న 104 మంది ఎమ్మెల్యేలలో, 40 మందికి పైగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తన నివేది లో పేర్కొన్నట్లు చర్చ జరిగింది. వారిని కొనసాగిస్తే మళ్లీ గెలవడం కష్టమని, ప్రశాంత్‌కిశోర్ స్పష్టం చేసినట్లు టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలకు-ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య సమన్వయం లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. నియోజకవర్గ-మండల స్థాయి నేతల చర్యల వల్ల.. సామాన్యులు పార్టీకి దూరమవుతున్నారని, ఆ నివేదికలో పేర్కొన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దానితో సహజంగానే సిట్టింగులలో సీట్ల భయం మొదలయింది.
ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ చేసిన ప్రకటన, సిట్టింగుల పెదవులపై చిరునవ్వులు పూయించాయి. అదే సమయంలో.. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న ఆశావహులకు మాత్రం, కేసీఆర్ ప్రకటన చేదుమాత్రలా మారింది. మొదటినుంచీ టీఆర్‌ఎస్‌లో పనిచేస్తూ.. వివిధ కారణాల వల్ల సీటు దక్కని సీనియర్లకు, కేసీఆర్ ప్రకటన తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇప్పటికే టీడీపీ- కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల, తమ అవకాశాలు దెబ్బతిన్నాయని వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కరుణిస్తారన్న ఆశతో ఉన్నారు. ఆ భరోసాతోనే నియోజకవర్గాల్లో డబ్బు ఖర్చు చేస్తూ, క్యాడర్‌ను పోషిస్తున్నారు. కానీ ఇతరులకు సీట్లు ఇచ్చేది లేదన్న కేసీఆర్ తాజా విస్పష్ట ప్రకటన, సీనియర్లను తీవ్ర నైరాశ్యంలో ముంచింది.
దీనిని రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు, బీజేపీ వ్యూహబృందం వాయువేగంతో రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ప్రకటన వెంటనే.. భవిష్యత్తు పరిణామాలపై బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నేతలపై చర్చించినట్లు సమాచారం. ఆ ప్రకారం.. 104 నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న టీఆర్‌ఎస్ నేతలను గుర్తించాలని నిర్ణయించారు. అలాగే ప్రశాంత్‌కిశోర్ సూచించిన 67 నియోజకవర్గాల్లో.. క్రియాశీలకంగా వ్యవహరించే టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలను గుర్తించాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
టికెట్లపై ఆశలు పెట్టుకుని, కేసీఆర్ ప్రకటనతో నిరాశకు గురయిన టీఆర్‌ఎస్ అసంతృప్త నేతలతో మాట్లాడే బాధ్యతను మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఢిల్లీ నేతలు అప్పగించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో చేరే వారికి ఎమ్మెల్యే సీట్ల హామీ ఇవ్వడం ద్వారా, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తిరుగులేనిశక్తిగా మార్చాలన్నది బీజేపీ వ్యూహం. టీఆర్‌ఎస్‌లోని అన్ని నియోజకవర్గ నాయకులతో సత్సంబంధాలున్న ఈటల ద్వారా, వారిని బీజేపీలోకి తీసుకురావాలన్నదే తాజా ఆపరేషన్ లక్ష్యంగా కనిపిస్తోంది.