Suryaa.co.in

Telangana

తెలంగాణలో ఎగరేది కాషాయ జెండానే

-లక్ష్మణ్ కు రాజ్యసభ సీటివ్వడమే అందుకు సంకేతం
– కేసీఆర్ పాలనను పెకిలించేందుకు యూపీ నుండి బుల్డోజర్లు రాబోతున్నయ్
– శ్రీలంకలో కుటుంబ పాలనకు పట్టిన గతే కేసీఆర్ కూ పడుతుంది
-కేటీఆర్…తెలంగాణకు కేంద్రం 2.52 లక్షల కోట్లిచ్చినట్లు నిరూపిస్తా… రాజీనామా చెయ్..
-హైదరాబాద్ లో చీమ చిటుక్కుమన్నా డ్రోన్లు, సీసీ కెమెరాలు కనిపెడతాయన్నావ్ కదా…
-మైనర్ బాలికపై ఆఘాయిత్యం జరిగి ఐదు రోజులైనా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్…
-రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై హైదరాబాద్ కు వచ్చిన లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించిన బీజేపీ నేతలు

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్ కు బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అభినందన సభ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డాక్టర్ కె. లక్ష్మణ్ ను శాలువా కప్పి పూలె బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా లక్ష్మణ్ ను పూల బోకేలు, శాలువాసహా వివిధ రూపాల్లో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, శాసనసభాపక్ష నేత రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, జి.వివేక్ వెంకటస్వామి, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, చాడా సురేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, నందీశ్వర్ గౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడి, బంగారు శ్రుతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆలోచన, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ ఆశీస్సులతో యూపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తొలిసారి తెలంగాణకు వచ్చిన లక్ష్మణ్ కు స్వాగతం. అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన శ్రీరామ మందిరం నిర్మిస్తున్న యూపీ గడ్డ నుండి లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం మనకు గర్వ కారణం.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి జాతీయ నాయకత్వం అనేకసార్లు సహకరించింది. లక్ష్మణ్ ఎన్నిక ద్వారా తెలంగాణలో ఈసారి ఎగరేది బీజేపీ జెండా మాత్రమేననే సంకేతాలు జాతీయ నాయకత్వం పంపింది.

బీజేపీ విలక్షణమైన పార్టీ. అనేక అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ మొదలుకుని వాజ్ పేయి, మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడంవల్లే పార్టీ ఈ స్థాయికి ఎదిగింది. 2 ఎంపీ సీట్ల నుండి 303 స్థానాల్లో విజయం సాధించి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే..

ఈ రాష్ట్రం నుండి పార్టీకి సేవలందించిన వి.రామారావు, సీహెచ్. విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ లకు గవర్నర్లుగా నియమితులయ్యారు. వారితోపాటు కిషన్ రెడ్డి వంటి వారు కేంద్రమంత్రులయ్యారు. ఆచారి, రాములు, షెహజాది వంటి వారు జాతీయ కమిషన్ సభ్యులుగా అవకాశం కల్పించింది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అవకాశాలుంటాయనడానికి వీరే నిదర్శనం.

తెలంగాణలో బీజేపీ ఇంత శక్తివంతంగా మారిందంటే… లక్ష్మణ్, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, బాల్ రెడ్డి, నరేంద్ర వంటి వారి కృషి కారణం.లక్ష్మణ్ కు సింగరేణిలో ఉద్యోగం వచ్చినా నమ్మిన సిద్ధాంతం, పార్టీ కోసం రాజీనామా చేసి సామాన్య కార్యకర్త నుండి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా వివిధ పదవుల్లో కొనసాగుతూ సేవలందించారు. లక్ష్మణ్ హయాంలోనే 4 గురు ఎంపీలు గెలిచారు. అందులో నేనూ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా.

చాలామంది అవాకులు పేలుతున్నారు. లక్ష్మణ్ ను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక చేసిందంటే… యూపీ తరహాలో ఏ విధంగా అభివృద్ధి, సంక్షేమ జరుగుతుందో… తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే ఆ తరహా పాలన అందిస్తామనే సంకేతాలను పంపింది.

మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే.. 5 రోజులైనా చర్యలు తీసుకోలేదు. బీజేపీ ఆందోళన చేస్తే ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసి అసలైన నిందితులను తప్పించే కుట్ర చేస్తున్నారు.ఎక్కడ ఏ సంఘటన జరిగినా డ్రోన్ కెమెరాలు ఆ దృశ్యాలను బంధిస్తాయని చెప్పిన కేసీఆర్, కేటీఆర్… మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే ఏమైనయ్..

తెలంగాణకు 2.52 లక్షలు కోట్లు ఇచ్చాం.. కేటీఆర్.. ఆధారాలతోసహా వివరిస్తా… రాజీనామా చేయడానికి సిద్దంగా ఉండాలని సవాల్ చేస్తున్నా.ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన చరిత్ర నీ అయ్యది (కేటీఆర్ ను ఉద్దేశించి). జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. సభ్య సమాజం తలదించుకునే దుస్థితి.

శ్రీలంకలో ఏ విధంగా అవినీతి, కుటుంబ పాలన కొనసాగడం వల్ల ఆ దేశ ప్రజలు బిచ్చమడిగే పరిస్థితి నెలకొందో…. కేసీఆర్ కుటుంబ అవినీతి-నియంత పాలనవల్ల తెలంగాణ రాష్ట్రం అప్పులపాలై ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొంది.ఉత్తర ప్రదేశ్ నుండి బుల్డోజర్లు రాబోతున్నయ్. రాజాసింగ్ కల నెరవేరబోతోంది. మోదీ నేతృత్వంలో కేసీఆర్ పాలనను పెకిలించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.

అన్ని పార్టీలకు అధికారమిచ్చాం… ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు. దేశంలోనూ మరో 20 ఏళ్లపాటు మోదీ ప్రభుత్వం కొనసాగుతోంది. తెలంగాణలో పేదల బతుకులు బాగుపడాలంటే… అభివ్రుద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యం. అందుకోసం బీజేపీ కార్యకర్తలంతా ఇష్టపడి, కష్టపడి పనిచేయండి. ఎన్నికలొచ్చే వరకు వ్యాపారాలు, సొంత పనులు మానుకుని పార్టీ కోసం సమయం వెచ్చించండి. టీఆర్ఎస్ పునాదులు బద్దలు కొడదాం.. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పనిచేద్దాం…

రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ….
పార్టీలో సిద్దాంతం కోసం పనిచేస్తున్న నాయకులను, వేదికపై ఉన్న నేతలు చేసిన సేవలను గుర్తు చేశారు. దళితుడిని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్రపతిగా, బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీకే సాధ్యం. పార్టీ నాకు అన్ని అవకాశాలిచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యేగా, శాసనసభాపక్ష నేతను చేసింది. నగర అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ కార్యదర్శిగా, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా అవకాశమిచ్చింది. తెలంగాణలో సామాన్య కార్యకర్తను ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపడం అది నాకు దక్కిన గౌరవం కాదు.కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవిమిది.

నేను ఏనాడూ ఓడిపోయానని కుంగిపోలేదు.. గెలిచానని పొంగిపోలేదు.. నమ్మిన సిద్ధాంతం కోసం.. కాషాయజెండా కింద పనిచేస్తున్నాను. 31 రాత్రి 10 గంటలకు నాకు సంతోష్ జీ, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మంత్రి శ్రీనివాస్ ఫోన్ చేసి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముషీరాబాద్ లోని నా కార్యకర్తలు 40 ఏళ్లుగా నా వెన్నంటి నడిచారు. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రజలకు తలవంపులు తేకుండా పనిచేస్తా. రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చేందుకు కృషి చేస్తా. తెలంగాణ పట్ల బీజేపీకి అపార విశ్వాసం ఉంది. కష్టపడి సాధించుకున్న తెలంగాణ కుటుంబ, అవినీతి, నియంత పాలన కొనసాగుతోంది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. యూపీ నుండి ఎన్నిక చేసిన 8 మంది రాజ్యసభ సభ్యుల్లో 4గురు ఓబీసీలకు కేటాయించి సామాజిక న్యాయం చేసింది.

నా ఎంపిక వల్ల తెలంగాణ ప్రజలకు బీజేపీ స్పష్టమైన సంకేతమిచ్చింది. కష్టపడే కార్యకర్తలకు అవకాశాలుంటాయని, ఎవ్వరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దనే విషయాన్ని చెప్పింది. తెలంగాణలో ఏ వర్గాలు బీజేపీ దూరంగా ఉన్నాయో… ఆ వర్గాలను సైతం బీజేపీవైపు ఆకర్షించేందుకు నావంతు క్రుషి చేస్తా.. తద్వారా తెలంగాణలో అదికారంలోకి వచ్చేలా అడుగులు వేయాలని జాతీయ నాయకత్వం చెప్పింది. యూపీ మాదిరిగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెబితే ట్విట్టర్ పిట్ట అడ్డగోలుగా మాట్లాడారు.

కేటీఆర్ ఒక్కసారి తనతో వస్తే… యూపీలో జరిగిన అభివృద్ధిని వివరిస్తా.. గంగలో మునిగి పాపాలు పోగొట్టుకోండి. అయినా కేటీఆర్ కు మూసీ నీళ్లే బెటర్ అనుకుంటున్నారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేసిన మోసాలతో ప్రజలను ఇబ్బంది పెట్టారు. యూపీలో 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. తెలంగాణలో మాత్రం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా… భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారు. బండి సంజయ్ పాదయాత్రలో ఈ విషయాన్ని నిలదీస్తే… దిగొచ్చి ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తున్నారు… మరి ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియని పరిస్థతి. అభివ్రుద్ధిలో తెలంగాణకు, యూపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

కరోనా సమయంలో 15 కోట్ల మంది ప్రజలకు నెలకు రెండుసార్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఘనత యూపీ ప్రభుత్వానిదే… కోటి మందికి ఆయుష్మాన్ భారత్ కింద వైద్య చికిత్స చేస్తున్నారు. 2010 దాకా యూపీ బడ్జెట్ లక్షన్నర కోట్లు మాత్రమే.. యోగీ ప్రభుత్వం వచ్చాక రూపాయి పన్ను పెంచకుండా రూ. 6 లక్షల కోట్ల బడ్జెట్ కు చేర్చిన ఘనత బీజేపీదే… కేసీఆర్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా ప్రకటనలిస్తున్నారు.. ఇక్కడి సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలకు పనేముంది?
మోదీ, యోగీ హయాంలో కొనసాగుతున్న భవ్యమైన రామ మందిరాన్ని చూస్తుంటే నా కళ్లు చాలలేదు.. రాముడి ఆశీర్వాదంతో లక్ష్మణుడిగా వెళ్లి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. యోగీజీ నన్ను అడిగారు.. బండి సంజయ్, రాజాసింగ్ ఎట్లున్నారని అడిగారు. సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు.

యూపీ నుండి బుల్డోజర్ ను తెలంగాణకు తీసుకొచ్చి కేసీఆర్ నియంత-అవినీతి-కుటుంబపాలనను పెకిలించబోతున్నాం… మోడీ, యోగీ తరహా పాలన తెలంగాణలో రావడానికి కార్యకర్తలంతా క్రుషి చేయాలి. ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుంది మొసళ్ల పండుగ. హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని సహా కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు ఇక్కడే మకాం వేయబోతోంది. కాచుకో కేసీఆర్…ఖబడ్దార్… కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓకే గూటి పక్షులు. కుటుంబ పాలనలో, కలిసి దోచుకోవడంలో, కలిసి పోటీ చేయడంలో రెండు పార్టీలు దొందు దొందే.. ఆ రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో దోషిగా నిలబెడతాం.

పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు ఓటేసినట్లే. రాష్ట్రంలో కాంగ్రెస్-టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీ లు వేర్వేరు కాదు. మూడు ఒక్కటే… పార్లమెంట్ లో టీఆర్ఎస్ ను దోషిగా నిలబెడతా.. తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలన్నా… పేదలకు సేవ చేసే పాలన రావాలంటే బీజేపీతోనే సాధ్యం. అందుకోసం అందరం కలిసి పనిచేద్దాం.. పాతవాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే పార్టీలోకి వచ్చే కొత్త నేతలను కలుపుకుపోతూ అధికారం సాధిస్తాం..

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ… బీజేపీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత గౌరవం లభిస్తుందనడానికి డాక్టర్ కె.లక్ష్మణ్ నిదర్శనం. జనాభాలో 80 శాతమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో మాటలకే పరిమితమవుతోంది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ…. యూపీ నుండి రాజ్యసభకు లక్ష్మణ్ ని ఎన్నిక చేయడం ధన్యవాదాలు.. హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ సిటీలో వినకూడని, చూడకూడని సంఘటనలు జరుగుతుండటం బాధాకరం.. ఆ సంఘటనలను చూస్తుంటే మనం హైదరాబాద్ లోనే ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. 24 గంటలపాటు పబ్ లు నిర్వహిస్తూ మైనర్లను కూడా అనుమతించడం ఆందోళన కలిగిస్తోంది. మైనర్ బాలికపై అత్యాచార సంఘటనలు నిత్యం పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. షీ టీమ్స్ ఏర్పాటు చేశామని, అత్యధిక సీసీ టీవీలను పెట్టామని, కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ను తీర్చిదిద్దామని చెప్పిన సీఎం కేసీఆర్…. ఈరోజు పట్టపగలే నరికి చంపుతున్నారంటే… అత్యాచారాలు చేస్తుంటే ఏం చేస్తున్నారో చెప్పాలి.

హైదరాబాద్ ను అంపశయ్యపై పడుకోబెట్టడానికి కారకుడు కేసీఆరే… రేపు వర్షాకాలమొస్తే.. ఎంతమంది మురికి కాల్వల్లో కొట్టుకపోతారో బిక్కుబిక్కుమనే దుస్థితి…
నిన్న జరిగిన సంఘటనపై పోలీస్ వ్యవస్థపై నమ్మకం సడలిపోతోంది. దోషిగా నిలబడే దుస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించండి. రాబోయే రోజుల్లో చరిత్ర మిమ్ముల్ని క్షమించదు.. ఇంటెలిజెన్స్ వ్యవస్థ నేరాల మీద నిఘా పెట్టడం మర్చిపోయింది.. మాలాంటి రాజకీయ నేతలు ఏం చేస్తున్నారనే నిఘాకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 4 గురు ఎంపీలను గెలిపించి సత్తా చూపింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో సత్తా చాటింది. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపుతో టీఆర్ఎస్ కు ఘోరీ కట్టడం ఖాయమని తేలింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా అలుపెరగకుండా పార్టీని బలోపేతం చేసి గులాబీ జెండాను, రాచరిక పోకడలకు ఘోరీ కట్టేదాకా విశ్రమించొద్దని కోరుతున్నా.

తమిళనాడు ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…ఇతర రాష్ట్రాలకు వెళితే… తెలంగాణలో హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటూ అక్కడి ప్రజలు అడుగుతుంటే బాధేస్తోంది. కేసీఆర్ రాక్షస, రజాకార్ల పాలన ముసుగులో ప్రజలను ఇబ్బంది పెడుతూ సభ్యసమాజం సిగ్గుపడేలా మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కాని పరిస్థితి. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైన నేపథ్యంలో బండి సంజయ్ కు తోడుగా లక్ష్మణ్ కు రాజ్యసభకు పంపడం సంతోషంగా ఉంది. కేసీఆర్ అవినీతి-అరాచక-నియంత పాలనకు చరమ గీతం పాడతామనే సంకేతాలను పంపేందుకే వచ్చే నెలలో బీజేపీ హైదరాబాద్ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతోంది. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని డబ్బులు పంచినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికిపాటి మోహన్ రావు మాట్లాడుతూ…
లక్ష్మణ్ కు రాజ్యసభలో స్థానం కల్పించడం మనందరం గర్వించదగ్గ విషయం. ఇతర పార్టీలు కూడా చాలా మందిని రాజ్యసభకు పంపారు. వాళ్లకు ఏ విధంగా సీట్లు ఇచ్చారో అర్ధం చేసుకోండి… మేం బీజేపీలోకి రావడానికి లక్ష్మణ్ చేసిన కృషిని మరువలేం. తెలంగాణ నుండి బీజేపీ తరపున రాజ్యసభలో తొలి వ్యక్తిగా అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. సరైన సమయంలో సరైన వ్యక్తిని రాజ్యసభకు పంపడం గర్వించదగ్గ విషయం. యావత్ తెలంగాణ సమాజం బీజేపీవైపు చూస్తోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బండి సంజయ్ చేస్తున్న కష్టానికి చేదోడు వాదోడుగా లక్ష్మణ్ కు రాజ్యసభ సీటివ్వడం మరింత బలం చేకూరుస్తోంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ….
లక్ష్మణ్ కు ఇంత పెద్ధ ఘన స్వాగతమిచ్చి తెలంగాణ ప్రజలు చూపిన ప్రేమ మరువలేనిది. 40 ఏళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు చాలా క్రుషి చేశారు. 2019 ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిపించారు. చాలామంది సీనియర్ నేతలను బీజేపీలో చేర్చుకుని కోర్ కమిటీలో స్థానమిచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నా చిన్నతనం నుండి లక్ష్మణ్ తో సంబంధాలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జేఏసీలో పాల్గొనడమే కాకుండా రాష్ట్ర సాధనకు క్రుషి చేశారు. ఉత్తర ప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్ ను నియమించారంటే తెలంగాణపై నరేంద్రమోదీ ఎంతగా ద్రుష్టి పెట్టారో అర్ధం చేసుకోవచ్చు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు లక్ష్మణ్ క్రుషి చేయాలని కోరుతున్నా…

బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ మాట్లాడుతూ…
సామాన్య కార్యకర్త సిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడయ్యే అవకాశం బీజేపీలోనే సాధ్యం. 4 దశాబ్దాలుగా పార్టీ బలోపేతం చేస్తున్న లక్ష్మణ్ సేవలను గుర్తించి యూపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోవడం గర్వకారణం. మోదీ, అమిత్ షాల కు ప్రత్యేక క్రుతజ్ఝతలు. లక్ష్మణ్ జీ.. మీరు పోరాడండి.. మీ వెంట మేమున్నాం… ఛాయ్ వాలా ప్రధాని అయ్యారు. ఓ చిన్న ఏబీవీపీ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఎన్నికవడం బీజేపీకే సాధ్యం… బీజేపీకి తెలంగాణలో ఉజ్వల భవిష్యత్ ఉందని లక్ష్మణ్ నియామకంతోనే స్పష్టమైంది.

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ…
నేను అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేల్లో లక్ష్మణ్ కూడా ఉన్నారు. నగర అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయిలో సేవలందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన ఓ సామాన్య కార్పొరేటర్ గా ఉన్న అమ్మాయిని నేరుగా రాజ్యసభకు పంపిన ఘనత మోదీకే చెల్లుతుంది. తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు జాతీయ నాయకత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో సాగుతోంది. లక్ష్మణ్ కు రాజ్యసభ సీటివ్వడం ద్వారా తెలంగాణలో బీజేపీ బలోపేతంపై సీరియస్ గా ఉన్నాం… అధికారంలోకి తీసుకొస్తామనే సంకేతాలను పంపింది.. కేసీఆర్ పాలనను గద్దె దించాలనుకునే వాళ్లంతా బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తున్నాం…

LEAVE A RESPONSE