– మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీజేపీ
– 10 సీట్లకు పడిపోయిన టీడీపీ బలం
– పీడీఎఫ్ మూడుకు పరిమితం
– 44 స్థానాలు పెంచుకుని కౌన్సిల్‌లో వైసీపీ పైచేయి
– వచ్చే నెలలో టీడీపీ నుంచి 11, వైసీపీ నుంచి 7గురు ఎమ్మెల్సీల పదవీ విరమణ
ఏపీ శాసనమండలిలో బలాబలాలు మారిపోతున్నాయి. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని గెలిచిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, తాజా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీకి కౌన్సిల్‌లో ఉనికి లేకుండా పోయింది. తాజా పరిస్థితిలో కౌన్సిల్‌లో వైసీపీ హవా కొనసాగుతుండగా, ప్రతిపక్ష టీడీపీ బలం 10 సీట్లకు పడిపోయింది. అధికార వైసీపీ 33 నుంచి 44 స్థానాలు పెంచుకుని కౌన్సిల్‌లో పైచేయిగా ఉంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైకాపా సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారితో కలిపి) 44కు చేరుకోనుంది..
ప్రతిపక్ష తెదేపా సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది. భాజపాకు ఉన్న ఒక్క సభ్యుడూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో, ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది.. తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2.. మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైకాపా, 4 స్థానాలు తెదేపా దక్కించుకున్నాయి.
తెదేపాకు చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు.. వైకాపాకు చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది గెలిచారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న వైసీపీ.. సహజంగానే మండలిలో అతి పెద్ద పార్టీగా మీసం మెలేసింది.