Home » క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్

క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్

– ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌లో క్రాస్‌ఓటింగ్‌ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించాం..
– ఒక్కొక్కరు రూ.10 నుంచి రూ.20 కోట్లకు అమ్ముడు పోయారు
–బాబు డబ్బు ప్రలోభాలతోనే వారు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారు
– సంతలో పశువుల్ని కొన్నట్టు ఎమ్మెల్యేల్ని కొనడం చంద్రబాబు నైజం
– వారిలో ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు
– అందుకే, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఆ నలుగుర్ని సస్పెండ్‌ చేస్తున్నాం..
– వైఎస్‌ఆర్‌సీపీ అంతర్గత విచారణలో ఆధారాలున్నందునే..
– మా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు
-:ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి

క్రమశిక్షణ సంఘ సభ్యులతో చర్చించాకే సస్పెన్షన్‌..
వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రలోభాలకు తలొగ్గి క్రాస్‌ ఓటింగ్‌ కు పాల్పడ్డారు. మా పార్టీ అంతర్గతంగా దర్యాప్తు జరిపి ఆధారాలతో సహా అవి నిరూపితమవడంతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ సీనియర్లుతో, క్రమశిక్షణా సంఘ సభ్యులతోనూ చర్చించాక నలుగురు శాసనససభ్యులును సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. ఈ నలుగురు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ అభిప్రాయానికొచ్చింది.

రూ.10 నుంచి 20 కోట్లకు బేరం:
మాకున్న సమాచారం మేరకు రూ.10 నుంచి 20 కోట్ల దాకా ఒక్కొక్కరికీ డబ్బులిచ్చి ప్రలోభపెట్టి ఆ ఓట్లు కొనుక్కున్నారు. ఇది నిజమని నిర్ధారణ కావడం వల్లనే ఈరోజు వారిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

చంద్రబాబు నీచరాజకీయం ఈరోజు కొత్తేమీ కాదు
సందర్భాన్ని బట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారాలు ఏ రాజకీయ పార్టీకైనా మంచిదికాదు. ఇదొక రోగలక్షణం లాంటిది. ఇలాంటి పరిణామాలపై తొందరగా రియాక్ట్‌ అవ్వడం మంచిదని మేం భావించినందునే క్రాస్‌ ఓటింగ్‌నకు పాల్పడి వైఎస్‌ఆర్‌సీపీ గీత దాటిన నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్‌ చేస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గతంలో బ్రీఫ్డ్‌మీ.. అంటూ రేవంత్‌రెడ్డితో డబ్బు సంచులు పంపడం, మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనడం వంటి ఆధారాలు, ఉదాహరణల నేపథ్యంలో ఈరోజు నలుగురికి డబ్బు వల విసరడం చంద్రబాబు నీచరాజకీయానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

సంఖ్యా బలముంది కనుకే 7 స్థానాలకు పోటీచేశాం:
వైఎస్‌ఆర్‌సీపీకి సంబంధించి మాకున్న సంఖ్యాబలం ఆధారంగా ఖచ్చితంగా రావాల్సిన ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నందునే.. మేం ఏడు స్థానాలకు పోటీకి దిగుతున్నామని గతంలో ముందుగానే చెప్పాం. ఆచరణలో తనకు సంఖ్యాబలం లేనప్పటికీ టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోటీపెట్టి మాపార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశాడు.

నిజాల్ని చెప్పడం జగన్‌మోహన్‌రెడ్డి నైజం:
వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేం చేపట్టిన సర్వేల్లో గానీ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కనిపించిన ప్రజాదరణ నేపథ్యంలో.. ‘వచ్చే ఎన్నికల్లో మీరే అభ్యర్థులుగా ఉంటే.. పార్టీ గెలుపు కష్టంగా ఉంటుంది’ అనే అభిప్రాయాన్ని నేరుగా కొంతమందికి మా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి వైఎస్‌ఆర్‌సీపీ నిబద్ధతగా పనిచేసి గెలుపే లక్ష్యంగా ముందంజలో ఉండాలనేది జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం. ఆమేరకు తన దృష్టికి వచ్చిన ఏ అంశాన్నైనా పార్టీ ఎమ్మెల్యేలతో, ఇతర నేతలతోనూ ఆయన నేరుగా చర్చిస్తారు. ఎమ్మెల్యేలపై నెగిటివ్‌ పరిస్థితి ఉంటే దాన్ని దాచిపెట్టి, చివరి నిముషంలో షాక్‌లిచ్చే నైజం మా జగన్‌మోహన్‌రెడ్డిది కాదు. కనుకనే, మా ఎమ్మెల్యేల సీట్లు గురించి ముందుగానే కొందరితో చర్చించారు. ఒకవేళ, వచ్చే ఎన్నికల్లో ఎవరికైనా సీట్లు ఇవ్వని పక్షంలో అలాంటి వారికి ప్రత్యామ్నాయం చూపిస్తానని కూడా ముందుగానే సమాచారమిస్తారు. పూర్తి పారదర్శకంగా వ్యవహరించి నాయకుల రాజకీయ భవిష్యత్తుకూ తగిన హామీనిస్తూ కొంత హింట్‌ ఇచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌ను దాటారు. అలాగని, వీరు తప్ప ఏ ఇతర ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌ దాటలేదు. వారంతా పార్టీ అధినాయకుడి మీద, పార్టీ మీద విశ్వాసం ఉంచారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలుగా ఉన్నవారంతా తాము ఏ పదవిలో ఉన్నప్పటికీ.. అందరం పార్టీ కార్యకర్తలమేనని భావించాల్సిందే. పార్టీ గెలుపు కోసం మా అధినేత తీసుకునే నిర్ణయం మేరకు నడుచుకుంటామని అందరూ చాలా క్రమశిక్షణగా ఉండే పార్టీ మాది.

గీతదాటిన వారిపై చర్యలకు నిముషం కూడా ఆలస్యం చేసే ప్రసక్తే లేదు
మా వైఎస్‌ఆర్‌సీ పార్టీలో భవిష్యత్తులో ఒకవేళ ఎవరికైనా సీట్లు దక్కకపోయినా..ఏదోవిధంగా పార్టీకి ఉపయోగించుకుంటామని, ఒకరు ఎక్కువా తక్కువా అనే భేదం లేకుండా నాయకులందర్నీ సమానంగా చూసుకుందామనేది మా జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన. అదే విషయాన్ని అందరితోనూ బహిరంగంగానే చెబుతుంటారు. అందర్నీ కన్విన్స్‌ చేస్తుంటారు. కానీ, కొంతమంది మాకు సీటు లేకపోతే ఇక రాజకీయం లేదనుకునో.. మరోచోట సీటు వెతుకులాటకు ప్రయత్నించడమో..అనే విషయాన్ని గమనించి చంద్రబాబునాయుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు వల విసురుతాడు.

ఇది అసంతృప్తి కాదు.. బాబు ఆశ పెట్టిన డబ్బు రోగం:
చంద్రబాబు ఎవరికి ఎంత ఇచ్చారనేది వారికి తెలుసేమో గానీ.. మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం.. మాకున్న సమాచారం మేరకు భారీమొత్తంలో డబ్బులు చేతులు మారాయని మా పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే, వారు మా పార్టీని కాదని చంద్రబాబు వెంట వెళ్లడానికి వేరే కారణం కూడా కనిపించడంలేదు. డబ్బులైనా చేతులు మారుండాలి.. కాదంటే, రేపోచ్చే ఎన్నికల్లో వాళ్లకు సీటిస్తామనైనా బాబు చెప్పి ఉండాలి. కనుకనే మా పార్టీ లైన్‌ దాటిన వారిపై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. అసలు మీరెందుకు ఈ తప్పు చేశారని అడిగే అవసరం కూడా లేదని మాపార్టీ భావించింది. అలాగని, ఈ నలుగురిలో ఏ ఒక్కరూ మేం తప్పు చేయలేదని పార్టీకి కూడా జవాబిచ్చేందుకు అందుబాటులోకి రాలేదు. సాధారణంగా అసంతృప్తినో.. అసమ్మత్తినో ఉంటే దాన్ని ఏదోరకంగా మాట్లాడి కన్వీన్స్‌ చేయవచ్చు. కానీ, వారు ఎంచుకున్న డబ్బు మార్గం మంచిదికాదు. ఇలాంటి రోగంతో ఉన్నవారిని మన పక్కన ఉంచుకోవడం కూడా అంత పద్ధతి కాదనుకున్నాం. వారిది వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం.. మాది పార్టీకి సంబంధించిన వ్యవహారం.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అదే చంద్రబాబు అయితే ఆరోజు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్‌ అయిన దగ్గర్నుంచి.. మా ఎమ్మెల్యేలను 23 మందిని సంతలో పశువుల్లా కొన్నతర్వాత దాకా .. వాళ్లకు కూడా పూర్తిస్థాయిలో పేమెంట్‌ ఇవ్వలేదని.. అడ్వాన్స్‌ అర్ధరూపాయి చేతిలో పెట్టి నిండా ముంచారని ఆ తర్వాత వాళ్లే చెప్పుకోవడాన్ని విన్నాం. అవసరాన్ని బట్టి చంద్రబాబు ఎంతకైనా బరితెగిస్తాడు. కాకపోతే, ఆయన ఇప్పుడు అధికారంలో లేనందున పూర్తి పేమెంట్‌ అయిన తర్వాతనే వాళ్లు కూడా ఆయనతో వెళ్లి ఉంటారని అనుకుంటున్నాము. ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారంటే పార్టీ అధినాయకుడి మీద పూర్తి నమ్మకంతో ఉండాలి. ఆయన సూచించిన బాటలో నడుస్తామని నమ్మకం చూపుకోవాలి. ఒకసారి ఆ నమ్మకం పోయిన తర్వాత వారితో పార్టీ కూడా ప్రయాణం చేయడం అంత మంచిదికాదు. ప్రజలకు సేవ చేయడంలో పార్టీ కొన్ని విధానాలు పెట్టుకుని ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి వారితో ప్రమాదమని తెలిసినప్పుడు ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది. అందుకే, ఈ నలుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం.

కుంభకోణాలతో కోట్లు గడించింది కనుకే టీడీపీ మైండ్‌గేమ్
టీడీపీ మైండ్‌గేమ్‌ ఆడటం ఈరోజు కొత్తేమీ కాదు. ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు వాళ్లతో టచ్‌లో ఉన్నారని చెప్పుకోవడం వారి పార్టీ పొలిటికల్‌ మైండ్‌ గేమ్‌ మాత్రమే. అలాగని ఎవరైనా వాళ్ల ఉచ్చులో పడితే వారిపై కూడా మా పార్టీ ఇదేవిధమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడదు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు మా పార్టీని కాదని పోయినప్పుడు కూడా మేం ఇదేవిధంగా వ్యవహరించాం. పోయేవాళ్లు పోతూ ఉంటారు. కొత్తగా మా పార్టీలోకి వచ్చేవారు వస్తూ ఉంటారు. కాకపోతే, ఉన్నవారిని మా పార్టీ కుటుంబ సభ్యులుగా చూసుకోవడం, వారు పార్టీకి, ప్రజలకు జవాబుదారీతనంగా బాధ్యతగా మెలిగేలా చూడటంపై మా పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు కూడా అంతే బాధ్యతగా మెలగాలని.. అధికారమే శాశ్వతమని ప్రవర్తించరాదని.. ఒకవేళ ఎమ్మెల్యే సీటు కాదంటే.. వారికి మరో పదవి లభిస్తోందని వారు భావించాలనేది మా పార్టీ సిద్ధాంతం.

Leave a Reply