-ఆర్థిక లోటు రూ. 38,224 కోట్లని బడ్జెట్ లో చదివిన బుగ్గన .. మార్చికి రూ. 25,194 కోట్లు ఎలా అయ్యిందో చెప్పే దమ్ము ఉందా?
– జీడీపీలో అప్పుల నిష్పత్తి ఎంత?
– నాడు – నేడు, వసతి దీవెన నిధులు కేంద్రానివి కాదా?
– కేంద్ర ఇచ్చే రూ. 6000 లేకుండా జగనన్న రైతుభరోస ఎక్కడ?
ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై చెప్పిన లెక్కలపై బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రనిధులకు స్టిక్కర్లు వేస్తున్న జగన్ ప్రభుత్వానికి, మద్యం అమ్మకాలు లేకుండా పథకాలు కొనసాగించే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. దొంగ చిట్టాలతో మసిపూసి మారేడుకాయ చేస్తే, పరిస్థితి చివరకు శ్రీలంకను కూడా మించిపోతుందని ఎద్దేవా చేశారు.
దినకర్ ఏమన్నారంటే… రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బుగ్గన,- యనమల ఇద్దరి వ్యక్తిగత గృహ నిర్వహణ కాదు వారు వారు మాట్లాడుకోవడానికి, రాష్ట్రంలో ప్రజలున్నారు. తన చేతిలోని అవాస్తవ లెక్కలు చెప్పి ఏదో పేపర్లో అనూకూలంగా రాయించుకున్న ఆర్టికల్ బడాయి మాటలు బుగ్గన పలికారు. ఫిబ్రవరి నెల వరకు ఉన్న రూ. 51,112 కోట్ల ఆర్థిక లోటు, దాన్ని 2021-22 లో సవరించిన అంచనా ప్రకారం రూ. 38,224 కోట్లని బడ్జెట్ లో చదివిన బుగ్గన, ఎలా మార్చికి రూ. 25,194 కోట్లు అయ్యిందో చెప్పే దమ్ము ఉందా?
జగన్ బ్రదర్ బుగ్గన సౌజన్యంలో గణాంకాలను ఫుట్‌బాల్ ఆడితే, ఆర్థికలోటు 2.01% కు తగ్గడం ఏం కర్మ ఆర్థిక మిగులు కూడ చూపగలుగుతారు.మార్చి నెల కాగ్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల చిట్టా విండో డ్రస్సింగ్ ( లేనిది ఉన్నట్లు ) చేసిన చిట్టా. బుగ్గన ఇలా చిట్టా పద్దులను ఒక నెల నుండి మరో నెల మధ్య మార్చి, ప్రజలను ఏమారిస్తే శ్రీలంక తో కూడ పోల్చలేని పరిస్థితి వస్తుంది. అంతా సక్రమంగా ఉంటే కాగ్, ఆర్బీఐ వంటి సంస్థలు అనవసరపు ఆరోపణలు ఎవరు చేసిన పట్టించుకోవు, ఆర్థిక అరాచకాలు చేస్తున్నారు కాబట్టే, బుగ్గన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఫిబ్రవరి వరకు ఉన్న లెక్కల ప్రకారం జీడీపీలో అప్పుల నిష్పత్తి ఎంత? ఒక మార్చి నెలలోనే ఏం బ్రహ్మాండం బద్దలై అంత భారీగా తగ్గినట్టు చూపించగలిగారు కేంద్రం పథకాలకు స్టిక్కర్లు వేయలేదని చెప్పే ధైర్యం బుగ్గన కి ఉందా? ప్రాజెక్టుల ఆలస్యం పైన శ్వేతపత్రం విడుదల చేస్తే, రాష్ట్రం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నష్టం బయట పడుతుంది.
నాడు – నేడు, వసతి దీవెన నిధులు కేంద్రానివి కాదా? మద్యం అమ్మకుండా అమ్మఒడి అమలు చేసి బుగ్గన ప్రెస్ మీట్ పెట్టాలి.అయుష్మాన్ భారత్ నిధులతో మేనేజ్ చేస్తున్నారు, ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ఇచ్చే రూ. 6000 లేకుండా జగనన్న రైతుభరోస ఎక్కడ? డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ మాత్రమే రాష్ట్రం సబ్సిడీ ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ముప్పావలా వడ్డీ సబ్సిడీ ఇస్తున్నదా, లేదా? గడచిన మూడు సంవత్సరాల్లో రూ. 30,000 కోట్ల రూపాయల మేరకు కేంద్రం ఉపాధిహమీ నిధులు ఇస్తే, రహదారుల గుంతలు పూడ్చలేదు, కనీసం బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. రాష్ట్రంలో వ్యయం పైన ఒక్క మాట మాట్లాడే దమ్ము బుగ్గన కి లేదు. ఏస్పీడీసీ ఆదాయం బడ్జెట్ లోని ఆదాయం బదలాయింపు ఆర్టికల్ 293 ప్రకారం తప్పా కాదో బుగ్గన ఎందుకు చెప్పలేక పోతున్నారు?